హైదరాబాద్: అనుకున్నదే అయింది. అందరూ ఊహించిందే జరిగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బీజేపీపై మరోసారి తన పట్టు నిరూపించుకున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు.
ఆమేరకు పార్టీ నాయకత్వం దీపక్‌రెడ్డి పేరు ఖరారు చేసింది. ఆయన గత ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే. కాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆయన పేరు కోసం పట్టుపట్టినట్లు తెలిసింది. రేసులో మరో ఇద్దరు ఉన్నప్పటికీ, చివరకు కిషన్‌రెడ్డి సూచించిన దీపక్‌రెడ్డి వైపే నాయకత్వం మొగ్గుచూపింది. దీపక్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి 25 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే ఆయనకు మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. కాగా జూబ్లీహిల్స్ టికెట్ సాధించిన దీపక్‌రెడ్డిని పార్టీ నాయకులు అభినందించారు. తనపై నమ్మకం ఉంచి తన పేరు సిఫార్సు చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.