కడప : యోగి వేమన యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ న్యాయవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ధీరజ్ మాట్లాడుతూ యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న రెండు న్యాయవిద్య కళాశాలలు ఉన్నాయని, రెండింటిలో మూడు వేల మందికి పైగా విద్యార్థులు న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. సెమిస్టర్ విధానంలో న్యాయవిద్యను అందిస్తూ ఉండడంతో అకాడమిక్ క్యాలెండర్ అందించడంలో, మిడ్ ఎగ్జామ్స్ మరియు సెమిస్టర్ పరీక్షల నిర్వహించడంలో యూనివర్సిటీ లా తాత్కాలిక ఇన్చార్జిలకు పెనుబారం అవుతోందని, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయనన్నారు.
న్యాయ విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పోలుదాసు హర్షవర్ధన్ మాట్లాడుతూ న్యాయవిద్య నిర్వహణ మరియు కళాశాలల పర్యవేక్షణ కొరకు ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసి ఒక నిర్దిష్ట అకాడమిక్ క్యాలెండర్ ద్వారా మిడ్ ఎగ్జామ్స్ మరియు సెమిస్టర్ పరీక్షలను నిర్వహించి, అకాడమిక్ సంవత్సరాలను సకాలంలో పూర్తిచేసేలా న్యాయవిద్యను అందించాలని కోరారు. అదేవిధంగా యూనివర్సిటీ పరిధిలో ఒక లా కళాశాలను ఏర్పాటు చేసి పిజి కోర్సులను అందించాలని, కడప జిల్లా నుంచి న్యాయవిద్యలో పీజీ చేయాలంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యోగివేమన యూనివర్సిటీ లో పీజీ న్యాయవిద్య కళాశాలను పెడితే జిల్లా లో ఎంతో మందికి మేలు కలుగుతుందని పలువురు అడ్వకేట్లు కూడా అభిప్రాయపడ్డారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజా నాయుడు, సింగనమల సుమన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.