సీఎం పర్యటన కోసం స్కూళ్లకు సెలవులా.?

-విమాన ప్రయాణాలు మాని.. వాహనదారుల సమస్యలు చూడండి
-ప్రజలు నడుం విరగ్గొడతారనే భయంతోనే ఒకట్రెండు కిలోమీటర్లకూ హెలీకాప్టర్ ప్రయాణం
– వంగలపూడి అనిత

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనల్లో ఒకట్రెండు కిలోమీటర్ల ప్రయాణానికీ హెలీకాప్టర్లలో వెళ్తుంటే చాలా రిచ్ ముఖ్యమంత్రి అనుకున్నాం. కానీ.. ఈ రోడ్లపై ప్రయాణం చేస్తే నడుం విరుగుతుందనే భయం ఓ వైపు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు విరగ్గొడతారనే భయం మరోవైపు. అందుకే ఎక్కడకెళ్లినా విమాన ప్రయాణాలే చేస్తున్నారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ..

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన.. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడి, బురదతో నిండి ప్రజలు ప్రయాణానికి అవస్థలు పడుతుంటే.. ముఖ్యమంత్రి వాహన మిత్ర అంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అన్నారు. వాహన మిత్ర పేరుతో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తున్న ముఖ్యమంత్రి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు దేశంలోనే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని అసెంబ్లీ సమావేశాల్లో కేకలు వేసిన జగన్ రెడ్డికి ఇప్పుడు ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు కనిపించడం లేదా.? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అదే సమయంలో 23 రాష్ట్రాలు తమ వ్యాట్ తగ్గించుకున్నాయి. అయినా ఏపీలో తగ్గించేది లేదని నిస్సిగ్గుగా ప్రకటించిన ముఖ్యమంత్రి.. వాహన మిత్ర అంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు.

మరోవైపు జీవో నెం.21 తీసుకొచ్చి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లపై పగ తీర్చుకునేలా జరిమానాలు పెంచడం ఆటో డ్రైవర్లను ఉద్దరించడమా.? పెట్రోల్, డీజిల్ ధరలు, జరిమానాలతో డ్రైవర్ల రక్తాన్ని జలగల్లా పీలుస్తూ వాహన మిత్రతో ఉద్దరించేస్తున్నానన్నట్లు మాట్లాడడం సిగ్గుచేటు. రాష్ట్రంలో రోడ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో.. ప్రజలందరికీ తెలుసు జగన్ రెడ్డికి తప్ప. ఆటో డ్రైవర్లకు రూ.10వేల పేరుతో హడావుడి చేస్తున్నారు. కానీ ఈ రోడ్లపై ప్రయాణం చేస్తే ఆటో భాగాలు ఎక్కడ ఏది ఊడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశాం. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి వస్తున్నారని సుమారు 34 స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, వారి బస్సుల్ని లాక్కుని జనాలను పోగేసుకుని వెళ్లడం దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న ప్రచార ఆర్భాటం, హడావుడి చూస్తుంటే అతని బుర్రలో గుజ్జు (మెదడు) ఉందా లేక మోకాలి నుండి అరికాలులోకి జారిపోయిందా అనే అనుమానం కలుగుతుంది. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్ళేటపుడు 5కి.మీలు లేదా 10 కి.మీల పరిధిలో రోడ్డు మార్గంలోనే ప్రయాణం చేస్తారు. 10 కిలోమీటర్లు పైన ఉంటేనే హెలికాఫ్టర్లను వాడతారు. కాని మన రాష్ట్రంలో గొప్ప సీఎం రెండు కిలోమీటర్లకి మూడు కిలోమీటర్లకి కూడా హెలికాఫ్టర్లు వాడుతున్నారు. రెండు మూడు కిలోమీటర్లకు కూడా హెలీకాప్టర్లో వెళ్తుంటే మన సీఎం బాగా రిచ్ అనుకున్నాం. కానీ.. రోడ్డెక్కితే ప్రజలు తంతారనే భయంతోనే ఇలా గాల్లో ప్రయాణాలు చేస్తున్నారని ఇప్పుడర్ధమైంది.

రాష్ట్రంలోని రోడ్లు చూస్తుంటే ఇంటికో స్విమ్మింగ్ పూల్ రాష్ట్రంలో అమలు చేశారా అనిపిస్తోంది. ఇలానే ఉంటే.. ప్రపంచంలో ఏ పాలకుడూ చేయని విధంగా మా సీఎం ఇంటికో స్విమ్మింగ్ పూల్ కట్టించాడని వారి పెయిడ్ బ్యాచ్ ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఒక మంత్రి ఇంటికి వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్ల మేర మొత్తం కొట్టుకుపోయి, బురదతో నిండిపోతే కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానంటూ కటింగ్ ఇచ్చే సదరు మంత్రి ముందు తన ఇంటికెళ్లే దారిలోని గుంతల్ని పూడ్చడంపై దృష్టి పెట్టాలి.

మరోవైపు ముఖ్యమంత్రి రోడ్లు భవనాల శాఖతో తాజాగా నిర్వహించిన సమీక్షలో జులై 15 నాటికి రోడ్లన్నింటినీ మరమ్మతులు చేస్తాం, గుంతలు పూడ్చేస్తాం అన్నారు. ఈ రోజే జులై 15 ఎక్కడ, ఎన్ని రోడ్లు మరమ్మతులు చేశారు.? ఏ ముఖ్యమంత్రి అయినా కొత్తగా రోడ్లు వేస్తానంటాడు. కానీ మన పిచ్చి ముఖ్యమంత్రి మాత్రం గుంతలు పూడుస్తా అంటున్నారు. వాటిని కూడా పూడ్చడం చేతకాలేదు. ఫలితం రాష్ట్రంలోని ప్రజలంతా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న చాలా మంది గతంలో రోడ్లపై ఏర్పడిన గోతుల్లో నాట్లు వేశారు. ఇప్పుడు ఎందుకు సైలెంటుగా ఉన్నారు.? నారు దొరకలేదా.? లేక గోతులు కనిపించడం లేదా.? ఎలాగూ రోడ్లు వేయడం చేతగాదు కాబట్టి కనీసం ఈ రోడ్ల మీద నారు వేసిన మీ నిరసన తెలియజేస్తే ముఖ్యమంత్రి కళ్లకు కనిపిస్తుదేమో.

ప్రతిపక్షంలో ఉన్నపుడు మైక్ కొట్టి మరీ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్,డిజీల్ ధరలు మండిపోతున్నాయన్నారు. వెంటనే చర్చ జరగాలంటూ అసెంబ్లీలో ఊక దంపుడు ప్రసంగాలు ఇచ్చాడు. అదే జగన్ రెడ్డికి దేశంలో ఇప్పుడు ఏపీలోని పెట్రోల్ డీజిల్ ధరలు కనిపించడం లేదా.? ఈ రోజు ఏపీలో పెట్రోల్ ధర రూ.112. పక్క రాష్ట్రం కర్ణాటకలో కంటే రూ.11 ఎక్కువ. ఒడిశా కంటే రూ.11.60 ఎక్కువ. ఒక లీటర్ దగ్గర రూ.10 నుంచి రూ.12 వరకు ఎక్కువగా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఇంత దారుణంగా పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నా.. జగన్ రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేకుండా వాహనమిత్ర అంటూ చేస్తున్న హడావుడి చూస్తుంటే సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నా.

మీట నొక్కే కార్యక్రమానికి కోట్ల ఖర్చుతో పత్రికల్లో ప్రకటనలిచ్చారు. కోట్ల ఖర్చుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని కాఖీ చొక్కా వేసుకున్నారు. ఇంత ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు ఇచ్చేదెంత.. వారి నుండి దోచుకునేది ఎంత అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆటో డ్రైవర్లను ఉద్దరించేస్తున్నా అంటున్న జగన్ రెడ్డికి ధైర్యముంటే.. ఒక ఆటో తీసుకుని, డీజిల్ కొట్టించి సభా ప్రాంగణం నుండి కేవలం రెండు కిలోమీటర్లు వైజాగ్ రోడ్లమీద తిరిగి సభాప్రాంగణానికి రావాలి. అలా ప్రయాణం పూర్తి చేసుకుని క్షేమంగా వచ్చాక మీట నొక్కి డబ్బులు వేస్తే తప్పకుండా సంతోషిస్తాం. ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ, హెలీకాప్టర్ల నుండి కిందకు చూడడం మాని నేల మీద తిరిగితే ప్రజల సమస్యలు, ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుస్తాయి.

దేశంలోనే జగన్ రెడ్డి నెంబర్ వన్ అంటూ ఈ మధ్య కొందరు మంత్రులు ఒకటే భజన చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంకు స్టూడెంట్. నెంబర్ వన్ స్టూడెంట్, నెంబర్ వన్ సీఎం. అంటుంటే నిజమేననుకున్నా. ప్రజల్ని పీడించడంలో నెంబర్ వన్. పన్నుల బాదుడుతో ప్రజల రక్తాన్ని పీల్చడంలో నెంబర్ వన్ అనే విషయాన్ని చెప్పాలని ఆ మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.

రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. కొంత మంది డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చి అందరికీ ఇచ్చేశా అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా రిజిస్టర్డ్ డ్రైవర్లున్నారు. 7.62 లక్షలకు పైగా వాహనాలున్నాయి. కానీ.. ఈ రోజు జగన్ రెడ్డి 2.62 లక్షల మందికి వాహన మిత్ర ఇచ్చి.. అందరినీ ఉద్దరించేశాం అంటున్నారు. జగన్ రెడ్డి ఇచ్చిన హామీనే సరిగా అమలు చేయకుండా సుమారు 5 లక్షల మందికి పైగా డ్రైవర్లను మోసం చేస్తున్నారు. వాళ్లందరూ మీ దృష్టిలో డ్రైవర్లు కారా.

స్కూళ్లు మూయించి, వారి బస్సులు లాక్కుని సభలకు జనాలను సమీకరించడానికి ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా.? ఈ తుగ్లక్ ముఖ్యమంత్రిని ఇప్పటికైనా అడ్డుకోకుంటే రేపు ప్రతి ఒక్కరికీ ఒక బిస్కెట్ వేసి బానిసల్ని చేస్తారు. అవతల వాడికి తెలియకుండా అవతలి వాడి జేబులో డబ్బులాగేయడం. పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఒక ఆటో డ్రైవర్ నుండి సంవత్సరానికి రూ.40వేలకు పైగా కొట్టేస్తున్నారు. వాహన మిత్రతో రూ.10 ఈరోజు ఇచ్చి.. రేపటి నుండి ఎక్కడికక్కడ పికెటింగ్ పెట్టి డ్రైవర్ల నుండి ఆ సొమ్ము లాగేయబోతున్నాడు.

ఇంతకుముందు లైసెన్స్ లేకపోతే రూ.150 జరిమానా విధించేవారు. నేడు దాన్ని రూ.500 చేశారు. అడ్డగోలు నిబంధనలు, అడ్డగోలు పద్దతుల్లో జరిమానాలు విధించి ఇచ్చిన సొమ్ముకు నాలుగు రెట్లు లాక్కుంటున్నారు. ఇదేనా వాహన మిత్ర.? ఇదేనా ఆటో డ్రైవర్లను ఉద్దరించడం.? ఈ సందర్భంగా మంత్రులు, ముఖ్యమంత్రి, వైసీపీ కుక్కలకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడైనా కిలోమీటర్ లేదా రెండు కిలోమీటర్లు గోతులు లేకుండా రోడ్డు ఉంది అని చెప్పే దమ్ము, చూపించే ధైర్యం మీకు ఉన్నాయా. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి వివరించడానికి మేం సిద్ధం. ఈ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతున్నా గాల్లో తిరుగుతూ.. అంతా బ్రాహ్మాండంగా ఉంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అనే దిక్కుమాలిన ఆలోచనలు మాని.. రోడ్లు ఎలా బాగు చేయాలో ఆలోచించండి. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో ఆలోచించండి.

ఈ మధ్య ఒక మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఏంటో, ఆయన విజన్ ఏమిటో, ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. ఆ మంత్రికి బుద్ధి ఉందో లేదో ఆయనే ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు పేరు తలచుకోకుండా.. ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కూడా రోజు గడవడం లేదని ఇలాంటి ఘటనలు చూస్తే అర్ధమవుతోందని అనిత వ్యాఖ్యానించారు.

Leave a Reply