Suryaa.co.in

Editorial

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి బాబు అరెస్టు సెగ

– అరెస్టుపై నిరసన ర్యాలీలో పాల్గొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
– బాబును అరెస్టును ఖండిస్యూ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ కార్పొరేటర్
– వనస్థలిపురం టీడీపీ ర్యాలీలో విచిత్ర పరిణామం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న సామెత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్లుంది. టీడీపీ అధినేత-ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు సెగ హైదరాబాద్‌ను తాకుతోంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో తమంతట తాముగా నిరసన ర్యాలీలో పాల్గొని, చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

అవుటర్ రింగ్ రోడ్డులో కార్ల ప్రదర్శన నిర్వహించి, జగన్ సర్కారుకు నిరసన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు నిర్వహించిన నిరసన ర్యాలీలో ప్రజలు, ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ పరిణామాలు అధికార బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాణసంకటంలా పరిణమించాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిసర నియోజకవర్గాల్లో సెటిలర్లు, కమ్మ సామాజికవర్గ ప్రభావం ఎక్కువ. ప్రధానంగా శేరిలింగంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మలక్‌పేట, రాజేందర్‌నగర్ వంటి నియోజకవర్గాల్లో సెటిలర్ల సంఖ్య ఎక్కువన్న విషయం తెలిసిందే. ఫలితంగా చంద్రబాబు అరెస్టు ప్రభావం ఈ నియోజకవర్గాల్లో సహజంగానే చూపుతోంది.

గత జీహెచ్‌ఎంసీ, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ నియోజకవర్గాల్లోని సెటిలర్లు బీఆర్‌ఎస్‌కే జై కొట్టారు. తెలంగాణలో టీడీపీ లేకపోవడమే దానికి కారణ ం. అటు బీఆర్‌ఎస్ కూడా ఎమ్మెల్యే-కార్పొరేటర్ సీట్లను ఎక్కువ సంఖ్యలో సెటిలర్లే ఇచ్చి, వారి పెదవులపై చిరునవ్వులు పూయించింది. ఈ కారణం వల్లే గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లు-కమ్మ వర్గం ఉన్న అన్ని డివిజన్లలో, బీఆర్‌ఎస్ విజయం సాధించింది.

తాజాగా చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టిన ప్రభావం , తెలంగాణలో కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు కూడా, బాబు అరెస్టును ఖండించారు. తాజాగా ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అయితే ఏకంగా.. బాబు అరెస్టును ఖండిస్తూ వనస్థలిపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, బాబుకు సంఘీభావం ప్రకటించాల్సి వచ్చింది.

బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి కూడా ర్యాలీలో పాల్గొని, చంద్రబాబు అరెస్టును ఖండించటం చర్చనీయాంశమయింది. పనామా చౌరస్తా నుంచి చంద్రబాబు అభిమానులు నిర్వహించిన ర్యాలీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ కార్పొరేటర్ పాల్గొనాల్సి వచ్చిందంటే.. బాబు అరెస్టు ప్రభావం తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో స్పష్టషమవుతోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి.. తన పార్టీ అభ్యర్ధి ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా సీటు ఇవ్వాలని గతంలో చంద్రబాబునాయుడే, కాంగ్రెస్ పార్టీకి సిఫార్సు చేయడం గమనార్హం.

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా, చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఏపీలో వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రజల కోసమే బాబు జైలుకు వెళ్లారని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE