హంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆరెస్
కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆరెస్ కుట్ర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
సోనియాగాంధీని విమర్శించే నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. డిసెంబర్ నెలను మిరాకిల్ మంత్ అంటారు. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది..2023 డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
శనివారం సికింద్రాబాద్ హరిహర కళ భవన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి…. కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించిందని రేవంత్ రెడ్డి అన్నారు.దేశంలో మైనార్టీలు భయం భయంగా బతకాల్సి వస్తుంది అని అన్నారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని భయపెడుతుంది.. దేశ ప్రజల ఆత్మరక్షణ కోసం రాహుల్ గాంధీ దేశం అంతా పాదయాత్ర చేశారు అని ఆయన పేర్కొన్నారు.
మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది..క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే క్రిస్టియన్ మైనారిటీల డిమాండ్లు తీరుతాయన్నారు.
“రాష్ట్రంలో హాంగ్ వస్తదని, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెబుతున్నారు.కాంగ్రెస్, బీజేపీ కలవవు అని అందరికీ తెలుసు..హాంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆరెస్ . కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆరెస్ కుట్ర చేస్తున్నాయి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ఓట్లు చీల్చి హంగ్ ఏర్పాటుకు బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
హంగ్ లో బీజేపీ.. బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తుంది అని ఆయన అన్నారు. ఈ కుట్ర భగ్నం చేయండి.. కర్ణాటకలో మాదిరిగా.. మైనార్టీలు.. క్రిస్టియన్ లు.. కాంగ్రెస్ కి అండగా ఉండండి అని రేవంత్ రెడ్డి కోరారు. కర్ణాటకలో జేడీఎస్ లాగా బీజేపీ ఇక్కడ చేయాలని చూస్తుంది అని ఆయన అన్నారు.
కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
“కేసీఆర్, కేటీఆర్ సోనియా ను దూషిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ను నిందిస్తుంది..బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం… మరి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ ను దూషిస్తోంది. పదవులు త్యాగం చేసినందుకా? దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా ? ” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలేదని విమర్శించారు.- తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పేవని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బడుగులు బలహీన వర్గాలు, మైనారిటీలకు మేలు జరుగుతుందన్నారు.కేసీఆర్, మోదీ అపూర్వ సోదరులు వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరికీ బుద్ది చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.