– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
317 జీవోను సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్దం కావాలని పిలుపునిస్తూ రూపొందించిన కరపత్రాన్ని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇగ ఎట్లాంటి సమస్యలుండవ్… పిల్లలకు మంచిగ పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నా హ్రుదయ పూర్వక నమస్సులు.పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలగాణ సాధించుకున్నమో అదే తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చేయాల్సి రావడం బాధాకరం… దీనికంతటికీ కారణమైన 317 జీవోను సవరించాలని కోరుతూ ఆందోళనలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు, వివిధ సంఘాల నాయకులందరికీ నా నమస్కారాలు..
మీరు చేస్తున్నది న్యాయమైన పోరాటం. మీ పోరాటానికి బీజేపీ తరపున నేను పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాను. సకల జనుల సమ్మె వంటి చారిత్రక పోరాటంలో పాల్గొన్న నేపథ్యం మీది…. ఆనాడు పరాయి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అవసరాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్ధమయ్యేలా వివరించి పల్లె నుండి పట్నం దాకా ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర మీదే.
కానీ తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ దుర్మార్గపు సీఎం తెచ్చిన అనాలోచితంగా తీసుకొచ్చిన అశాస్త్రీయమైన 317 జీవో వల్ల చివరకు మీ స్థానికతే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీ కుటుంబాలన్నీ చిన్నభిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. మీరు పనిచేస్తున్న చోట స్థానికేతరులుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది.
గతంలో ధర్నాలే వద్దు… అందరూ సంతోషగా ఉంటారని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండు. 317 జీవో ద్వారా వేలాది ఉద్యోగుల జీవితాలో చిచ్చు పెట్టారు. లక్షలాది మంది ఉద్యోగులను మానసిక వేదనకు గురి చేస్తున్నడు. వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తండు.
317 జీవోను సవరించాలని కోరుతూ మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్ కు మద్దతుగా నేను ప్రజాస్వామ్యబద్దంగా దీక్షకు కూర్చుంటే నా కార్యాలయాన్ని గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేయించిన దుర్మార్గుడు కేసీఆర్. పోలీసులతో దాడులు చేయించిండు. మా కార్యకర్తలపై లాఠీ చేశారు. మహిళలని చూడకుండా వేధించిండు.
ఇక నాపై ఎంత అమానుషంగా పోలీసుల ద్వారా దాడి చేయించిండో లోకమంతా కళ్లారా చూసింది. చివరకు నాపై అక్రమ కేసులు పెట్టి ఎంపీగా నా హక్కులను భంగం కలిగిస్తూ అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా బెదరకుండా మీ కోసం నేను జైలుకు పోయిన. ఈ పోరాటంలో నాతోపాటు కార్యకర్తలు, నాయకులంతా జైలుకు పోయినరు. వందలాది మంది కార్యకర్తలు గాయాలయ్యాయి. అయినా వెనకడుగు వేయకుండా మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ సహా చాలా చోట్ల 317 జీవోను సవరించాలని మీటింగ్ లు పెట్టినం.
ఈ సందర్భంగా మీ అందరికీ నాటి తెలంగాణ మహోజ్వలిత ఘట్టాలను స్మరించుకోవాలని కోరుతున్నా… సకల జనుల సమ్మెలాంటి చారిత్రక ఉద్యమంలో పాల్గొంటున్న యోధులు మీరు. ఇన్నాళ్లూ మీలో కొందరు మౌనం దాలిస్తే అది అంగీకరించనట్లు కేసీఆర్ భావిస్తున్నరు. 317 జీవోను గొప్ప జీవో అని చెబుతుండు.
ఈ జీవోను సవరించాలని కోరుతున్న వారిని దొంగలుగా చిత్రీకరిస్తూ అవమానిస్తున్నడు. ఏ ఉద్యోగులైతే ఉద్యమించి తెలంగాణ తెస్తే సీఎం అయ్యారో… వారిని దొంగలుగా చిత్రీకరించడం దుర్మర్గం. అయినా మీరు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఈ పోరాటాన్ని కొనసాగించండి. ఈ సమస్య పోరాటంలో మీరు విజయం సాధించాలని బీజేపీ పక్షాన మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా… మీ పోరాటానికి బీజేపీ పక్షాన మనస్పూర్తిగా సంఘీభావం తెలుపుతున్న. మీతోపాటు కలిసి పోరాడేందుకు మా పార్టీ సిద్ధం. ప్రభుత్వ మెడలు వంచేదాకా అందరం కలిసి పోరాడుదాం.