– బహుజనులే తెలంగాణ పాలకులని నినదించిన నాయకులు
– జనరల్ సీట్లన్నిటిలో బి.సి లు పోటీ చేయాలి
– బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకుందాం
– ఐక్య ఉద్యమాలతోనే రిజర్వేషన్లు సాధ్యం
– రౌండ్ టేబుల్ సమావేశంలో బహుజన నాయకులు
హనుమకొండ: ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలు బి.సి లకు ఇచ్చే రిజర్వేషన్లు అవసరం లేదని బహుజనుల ఓట్లు బహుజనులకు వేసుకుంటే జనరల్ సీట్లన్నిటిలో బి.సి లు పోటీ చేసి గెలువచ్చని బి.సి నాయకులు ఉద్ఘాటించారు.
స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై ఇటీవల తెలంగాణ హై కోర్టు స్టే ఇచ్చిన నేపధ్యంలో బి.సి చైతన్య వేదిక, ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఆధ్వర్యంలో బి.సి రిజర్వేషన్లు – ఉద్యమ కార్యాచరణ అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు మాట్లాడారు.
బి.సి చైతన్య వేదిక ఛైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వి.సి.కె పార్టీ డాక్టర్ జిలకర శ్రీనివాస్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, బి.సి ఇంటలెక్టువల్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కూరపాటి వెంకటనారాయణ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి తదితరులు మాట్లాడారు.
బి.సి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమం లాగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, సబ్బండ వర్గాలవారు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేసి అధికారం ఆధిపత్య కులాల వారికి ఇవ్వడమేంటి, హక్కులు, అధికారం కోసం వారిని అడుక్కోవడమేంటని, బహుజనుల ఓట్లు బహుజనులు వేసుకుంటే జనరల్ సీట్లలో సైతం బి.సి లే గెలవవచ్చని ఆ దిశగా బి.సి ఉద్యమ నాయకత్వం సిద్ధం కావాలని అన్నారు. బి.సి రిజర్వేషన్లకు ఎస్సీ, ఎస్టీ ల మద్దతు ఉంటుందని, రిజర్వేషన్లు సాధించే వరకు వారు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.
బి.సి కుల జనగణన జరిపి బి.సి లకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో అన్ని పార్టీలు బి.సి లను మోసం చేస్తున్నారని, రాజకీయ పార్టీల మోసాలను గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యం చేయాలని, రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలతో కలిపి ఒక ఫ్రంట్ గా ఏర్పడి ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తాడిశెట్టి క్రాంతికుమార్, చాపర్తి కుమార్ గాడ్గే, గొల్లపల్లి వీరస్వామి, బక్కి యాదగిరి, సోమిడి అంజన్ రావు, వేణుమాధవ్, ధర్మపురి రామారావు, తిరుపతి, నూర సంపత్ పటేల్, జంగిలి శ్రీనివాస్, పెండెల సంపత్ పటేల్, శ్రీధర్ రాజు, నలిగింటి చంద్రమౌళి, సాయిబాబా, కేడల ప్రసాద్, మధుపాక ఎల్లన్న, సూత్రపు అనిల్, రావులకారు వెంకటేష్, ఐతం నగేష్, పెరమాండ్ల వెంకటేశ్వర్లు, న్యాయవాదులు చిల్ల రాజేంద్రప్రసాద్, రాచకొండ ప్రవీణ్ కుమార్, కందగట్ల సుధాకర్, అల్లం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.