– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ
అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు చేతకాలేదు కానీ ఇపుడు ఈ దొంగ ఏడుపులు ఎందుకు జగన్? ప్రభుత్వాధినేతగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్రమోదీ గారికి రాష్ట్ర బీజేపీ అభినందనలు తెలియచేస్తోంది. నరేంద్రమోదీ గారి పాలనలో దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తోంది. ఈ నెల 16 న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ర్యాలీ లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న మోదీ కి స్వాగతం.
ప్రజలు ఛీ కొట్టి, అసహ్యించుకుంటున్నా ఏ మాత్రం సిగ్గు పడకుండా బట్ట కాల్చి మోహన వేయడం జగన్ కి అలవాటుగా మారింది. 5 సంవత్సరాలలో చేయలేని పనిని ఇపుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటే కక్షతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు జగన్. 17 మెడికల్ కాలేజీలకోసం 1950 కోట్లను కేంద్ర పథకం, ఇతర గ్రాంట్లు, లోన్ల ద్వారా ఇచ్చింది.
8480 కోట్లు మా ప్రభుత్వం కేటాయించింది అని గొప్పగా చెప్పుకునే జగన్ ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయాడు? చాలావాటికి కనీసం భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు పూర్తయిన పనులలో కూడా అవినీతి జరిగిందని మేము భావిస్తున్నాము.
పీపీపీ తో కడితే మీకేంటి ఇబ్బంది అని హై కోర్ట్ అడిగిన ప్రశ్న జగన్ కు చెంప పెట్టు. మొండిగోడలు, ఖాళీగా వెక్కిరించే స్థలాలను చూడటానికా జగన్ నర్సీపట్నం వెళ్లింది? వేలకోట్ల వ్యాపారాలు చేసే జగన్ కి చాలా స్పష్టంగా పీపీపీ అంటే ఏమిటో ప్రైవేటీకరణ అంటే ఏమిటో తెలుసు. అయినా కూడా ప్రజల్ని మోసగిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే భూమి, నియంత్రణ, సీట్లు, ఫీజులు ఉన్నప్పుడు అది ప్రైవేటీకరణ ఎలా అవుతుంది?
పేదలకు అన్యాయం జరుగుతుందని జగన్ అబద్ధం చెప్తున్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ఆరోగ్య స్కీం లలో ఉన్న లబ్ది దారులకు ఎలాంటి మార్పు లేకుండా మరింత అధునాతనమైన, సత్వర వైద్యం అందుతుంది. పడకలు పెరుగుతాయి. అత్యాధునికమైన వసతులు లభిస్తాయి.
విద్యార్థులు నష్టపోతారు అని మరొక అబద్ధం ఆడుతున్నాడు జగన్. కానీ వాస్తవానికి సీట్లు పెరుగుతాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మరింత లాభం. స్టాట్యూటరీ ఫీసులలో ఎలాంటి మార్పు ఉండదు. ఉపాధి పెరుగుతుంది.
జగన్ పాలనలో కల్తీ మద్యంతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కోట్ల అవినీతి జరిగింది. ఇపుడు కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.