Suryaa.co.in

Family

నాన్నను గెలిపిద్దాం…

ఆయ‌నో.. ఆటుపోట్లు చెక్కిన శిల్పం.
ఆయ‌నో..మరుపురాని మధుర జ్ఞాపకం
ఆయ‌నో..మసకబారని మానవత్వం
ఆయ‌నో.. మురిపించి మరపించే మంచితనం
చిటికెన వేలు పట్టుకుని నడక నేర్పినా..
చూపుడు వేలుతో ప్రపంచాన్ని చూపినా..
ఆయనకే సాధ్యం..ఆయనే ఒక ఆశ్రయ దుర్గం
ఆయనే మన నాన్న..

అమ్మ ఒడి గుడి..
నాన్న భుజం బడి..
అమ్మ లాలిపాట..
నాన్న బ్రతుకు బాట..
దూరదేశంలో ఉన్నా ..
నాన్న మాట గొప్ప ఊరట
పేగు బంధం అమ్మది..
పేరు ప్రతిష్ఠ నాన్నది.

మన కన్నా ముందే ..
మన బ్రతుకును కలగనేది నాన్న
దాన్ని నిలబెట్టడానికి ..
రెక్కలు విరుచుకునేది నాన్న..
‘‘నాన్నంటే ఓ ధైర్యం..
నాన్నుంటే ఓ స్థైర్యం..
నాన్నంటే ఓ బాధ్యత..
ఆయనుంటే ఉండదు
ఏ చీకూ చింత..
దరిజేరదు కలనైనా..
ఏ కలతా..నలతా..
ఆయ‌న‌కు కుటుంబమే ప్రపంచం..
పిల్లలే సమస్తం…
ఆరుపదులు దాటినా..
ఆయన మాటే ఆలంబన..

పిల్లలు ప్రయోజకులైతే ఆనందంలో తేలిపోతాడు
‘నాన్నా’ అని పిలిస్తే మంచులా కరిగిపోతాడు.
కరకుగా మందలించినా..
కలల భవితనిస్తాడు.

ఫాదర్ ఫెదర్ కాదు
తీసిపారేయడానికి..
ఫాదర్ అదర్ పర్సన్ కాదు తోసిపారేయడానికి..
రోడ్డు మీద పారేస్తే..
వృద్ధాశ్రమాల్లో వదిలేస్తే
వీధినపడేది మన బ్రతుకే..
అనాథ అయ్యేది మన బ్రతుకే..
కన్నబిడ్డను కన్నారా చూడలేక
నాన్న కన్నుమూస్తే ఆ దౌర్భాగ్యం మనదే..
ఆయన ఆస్తులను వాటాలేసుకుని
అంతస్తులు పెంచుకునే మనం
ఆయన బాట బీటలు వేస్తుంటే..
మాటలు గాలికిపోతుంటే..
చూస్తూ కూర్చోవడం అమానుషం
వంతులతో వారసత్వం వట్టిపోయే విన్యాసం

మన రక్తంలో రక్తం నాన్న…
ఓటమిలో ఓదార్పు నాన్న..
మన ప్రగతికి సోపానం నాన్న
మర్మమెరిగిన
పరమ పద సోపానం నాన్న..
సర్వాంతర్యామి నాన్నను
అర్థం చేసుకుందాం…
నాన్నని బతికిద్దాం…
పగిలిన గుండెను అతికిద్దాం
నాన్నని గెలిపిద్దాం…
మనుషుల్లా బ్రతికి
నాన్నను గెలిపిద్దాం.

డాక్టర్ రామకృష్ణ 

LEAVE A RESPONSE