Suryaa.co.in

Telangana

‘ముగింపు’ సభతో చరిత్ర సృష్టిద్దాం

– మార్పుకు సంకేతంగా సభను సక్సెస్ చేద్దాం
-ఒక్కో డివిజన్ నుంచి భారీ ఎత్తున ప్రజలను సమీకరించండి
-జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ అభ్యర్థులతో బండి సంజయ్ భేటీ
-ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు సభ ఏర్పాట్లు, జన సమీకరణపై దిశానిర్దేశం

ఈనెల 14న మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో నిర్వహించే ‘ప్రజా సంగ్రామ యాత్ర-2’ ముగింపు సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేసి సరికొత్త చరిత్రను స్రుష్టిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజులు టీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయారని, మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఆ మార్పుకు సంకేతంగా పాదయాత్ర ముగింపు సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేద్దామని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతోపాటు పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులతో ఈరోజు జడ్చర్ల మండలం మక్తపల్లి గేట్ వద్ద ఏర్పాటు చేసిన పాదయాత్ర లంచ్ శిబిరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, చింతల రామచంద్రారెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్, బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్న ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు సభ ఏర్పాట్లు, జన సమీకరణ వంటి అంశాలపై కార్పొరేటర్లు, సీనియర్ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… పాలమూరు జిల్లాలో పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని, జనం తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పారు. పాలమూరు ఎడారిగా మారిందని, ప్రజలు ఉండటానికి నిలువ నీడ కూడా లేదని అన్నారు.

పాలమూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు టీఆర్ఎస్ పాలనపట్ల విసిగిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఒక్కో డివిజన్ నుండి వేలాది మంది ప్రజలను ముగింపు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగింపు సభకు కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి ప్రజలు కోరుకుంటున్న మార్పుకు అనుగుణంగా సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందన్నారు.

అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క డివిజన్ నుంచి వేలాది మంది ప్రజలను సభకు తరలించాలని కోరారు. అందుకోసం ఇప్పటి నుంచే రవాణా సహా ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు, బీజేపీ నేతలు సైతం అమిత్ షా హాజరయ్యే సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ సమీకరించి సభను సక్సెస్ చేయడంలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

LEAVE A RESPONSE