Suryaa.co.in

Andhra Pradesh

బిల్డరును బెదిరించిన సీఎం జగన్ బంధువు వైఎస్ కొండారెడ్డి అరెస్టు

– ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వై.ఎస్.కొండా రెడ్డి అరెస్టు
– తాను చెప్పినట్లు చేయకపోతే” రోడ్డు పనులు ఆపివేస్తామని బెదిరించినట్లు ఉద్యోగుల ఫిర్యాదు
– చక్రాయపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు
– ఎన్‌హెచ్‌ఏఐకు పిర్యాదు చేసిన కంపెనీ ప్రతినిధులు
– సీఎంఓకు ఎన్‌హెచ్‌ఏఐ ఫిర్యాదు?
– కొండారెడ్డిని ఆదివారమే అదుపులోకి తీసుకున్నారా?
– ఏ సెక్షన్ పెట్టారో చెప్పని పోలీసులు
– బెదిరింపులకు ఎవరు పాల్పడినా, అవినీతికి పాల్పడినా 14400, డయల్ 100, లేదా జిల్లా ఎస్.పి గారి ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ హెచ్చరిక

కడప : ఎస్.ఆర్.కె కన్ స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో ఏపీ సీఎం జగన్ సమీప బంధువయిన వై.ఎస్ కొండారెడ్డిని చక్రాయపేట పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్.పి మీడియా తో మాట్లాడారు.

వేంపల్లి – రాయచోటి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న ఎస్.ఆర్.కె కంస్ట్రక్షన్స్ లో పని చేస్తున్న ఉద్యోగులకు.. వై.ఎస్. కొండారెడ్డి ఈ నెల 5 న ఫోన్ చేసి తాను చెప్పినట్టు చేయకపోతే, రోడ్డు పనులు

ఆపివేస్తామని బెదిరించినట్లు 9 న సోమవారం ఉదయం సదరు ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం చక్రాయపేట పోలీసులు కడప సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్.పి తెలిపారు. రిమాండ్ నిమిత్తం లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు.

జిల్లాలో ఎవరైనా అధికారులను, లేదా ప్రైవేటు వ్యక్తులను లేదా ప్రజలను తమ స్వలాభానికి లేదా డబ్బుల కోసం బెదిరించడం, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని, అలాంటి వ్యక్తుల సమాచారాన్ని 14400 డయల్ 100, లేదా తన ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ హెచ్చరించారు.

ఎన్‌హెచ్‌ఏఐ ఫిర్యాదుతో కదలిన డొంక
కాగా.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి చెందిన రోడ్డు పనులు నిర్వహిస్తున్న కంపెనీ అధికారులను, గత కొద్దిరోజుల క్రితం జగన్ బంధువు కొండారెడ్డి బెదిరించినట్లు చెబుతున్నారు. అయితే.. తాను సీఎం జగన్ బంధువునన్న కొండారెడ్డి మాటలు నమ్మని కంపెనీ అధికారులు, ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. దానితో రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏపీ సీఎంఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పనులు ఆగకుండా చూసే బాధ్యత మీదేనన్నారు. దానితో కొండారెడ్డి ఎవరన్నదీ తెలుసుకోకుండా, సహజ పద్ధతితోనే సీఎంఓ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కొండారెడ్డిని అరెస్టు చేయడం జరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తీరా పోలీసులు రంగంలోకి దిగి, కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన సీఎం సమీప బంధువని తేలిందట. బహుశా కొండారెడ్డి సీఎం బంధువని ముందు తెలిసిఉంటే, చర్యలు ఇంత వేగంగా ఉండకపోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బళ్లారి శ్రీరాములు కంపెనీకే బెదిరింపు
కాగా, కాంట్రాక్టు తీసుకున్న ఎస్.ఆర్.కె.కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ, గాలి జనార్దన్‌రెడ్డి కోటరీలో కీలకమైన బళ్లారి బీజేపీ నేత శ్రీరాములుకు చెందిన చెబుతున్నారు.గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములతో జగన్‌కు సన్నిహిత సంబంధాలున్న విషయం బహిరంగమే. అలాంటి శ్రీరాములు కంపెనీని కూడా కొండారెడ్డి బెదిరించారంటే, రాష్ట్రంలో కాంట్రాక్టులు చేస్తున్న ఇతర కంపెనీల పరిస్థితి ఏమిటన్న ఆందోళన తెరపైకి వచ్చింది. కాంట్రాక్టు దక్కించుకున్న సదరు కంపెనీ.. ఆ తర్వాత పెద్దలతో ‘ఫార్మాలిటీస్’ పూర్తి చే సుకుని పనుల్లోకి దిగిందని చెబుతున్నారు. అయితే హటాత్తుగా స్వయంగా సీఎం బంధువు కొండారెడ్డి రంగంలోకి దిగి, మామూళ్లు అడగడంతో కథ అడ్డం తిరిగిందని చెబుతున్నారు.

ఇడుపులపాయ ఇన్చార్జి కొండారెడ్డి
కాగా అరెస్టయిన వైఎస్ కొండారెడ్డి ఇడుపులపాయ ఎస్టేట్‌కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన జగన్‌కు సోదరుడి వరస అవుతారనని పార్టీ వర్గాల సమాచారం. విజయమ్మ సహా వైఎస్ కుటుంబసభ్యులు ఎవరు ఇడుపులపాయకు వచ్చినా, వారికి కొండారెడ్డి అతిథి మర్యాదలు చేస్తారట. అయితే, కొండారెడ్డిని అరెస్టు చేశామని ప్రకటించిన పోలీసులు, ఆయనపై ఏ సెక్షన్లు పెట్టారన్నది మాత్రం చెప్పకపోవడం గమనార్హం.

ఇదిలాఉండగా.. జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనతో నడుస్తూ మాట్లాడుతున్న కొండారెడ్డి ఫొటోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విడుదల చేశారు.ఇసుక, అక్రమ మద్యం కాదేదీ అవినీతికి అనర్హం అంటూ జగన్ రెడ్డి గారు జనం డబ్బు దోచేస్తుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు ఆయన బంధువులు, పార్టీ నాయకులు. పులివెందులలో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు గుంజ బోయాడు జగన్ రెడ్డి గారి సమీప బంధువు వైయస్ కొండారెడ్డి. సీఎం గారి సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమైన అవినీతి జరుగుతుంటే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేయని దందాలు ఎన్ని జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్ని, వ్యాపారుల్ని, కాంట్రాక్టర్లని పీడిస్తున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE