Suryaa.co.in

Telangana

ముందస్తు పరీక్షలతో కేన్సర్ ను కట్టడి చేద్దాం

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ సంస్థ “రన్ ఫర్ గ్రేస్ – స్ర్కీన్ ఫర్ లైఫ్” అనే నినాదంతో గచ్చిబౌలిలో నిర్వహించిన గ్రేస్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మన దేశంలో కేన్సర్ వ్యాధి లక్షలాది మంది పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని.. దీన్ని కట్టడి చేసేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. కేన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.

కేన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నప్పటికి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తుదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత కేన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తూ ప్రజలను కేన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదలచికిత్సకు సహాయం అందించడం మంచి విషయమని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రజలు కేన్సర్ బారిన పడితే.. చికిత్స కు డబ్బులు లేక వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్న మంత్రి.. గ్రేస్ ఫౌండేషన్ వారు గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్ మొబైల్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణులకు కేన్సర్ పై అవగాహన కల్పించడమే కాదు, కేన్సర్ నిర్ధారణ అయిన వారికి చికిత్సకు అండగా నిలుస్తుండటంపై అభినందించారు. గ్రేస్ కేన్సర్ రన్ అనేది ఒక కార్యక్రమం కాదు, కేన్సర్ పై పోరాడే ఉద్యమమని ఆయన అన్నారు.

అంతకు ముందు కేన్సర్ రన్ లో పాల్గొన్న మంత్రి డీజే టిల్లు పాటకు నృత్యం చేసి యువతను ఉత్సహపరిచడంతో పాటు జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లితో పాటు వేలాదిగా యువత రన్ లో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE