Suryaa.co.in

Telangana

ప్రమాదంలో ఉన్న మీడియాను రక్షించుకుందాం

– మీడియా కమిషన్ ఏర్పాటు చెయ్యాలి
– మీడియా మరియు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తేవాలి
– అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులు జారీ చెయ్యాలి
– రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే ఆందోళన విజయవంతం

వివిధ డిమాండ్లతో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా, గాంధీ జయంతి రోజైన సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని 122 కేంద్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

మహాత్మునికి నివాళి

గాంధీ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని ఎంజి రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఐజేయూ డిమాండ్ల వినతి పత్రాన్ని అక్కడ ప్రదర్శించారు.

గవర్నర్ కు వినతిపత్రం

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సోమవారం నాడు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కు వినతి పత్రాన్ని అందించింది. దేశంలో మీడియా మరియు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాసులు జారీ చేయాలనే డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ప్రతినిధి బృందానికి గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబులు ప్రతినిధి బృందంలో ఉన్నారు.

అంబేద్కర్ సర్కిల్ లో ధర్నా

ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద టీయూడబ్ల్యూజే, హెచ్.యూ.జేల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ మీడియా సంస్థలు మరియు జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష్య సాధింపు ధోరణిని మానుకోవాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను హరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. అలాగే జర్నలిస్టుల సౌకర్యాలను రద్దు చేసే చర్యలకు స్వస్తి పలకాలని విరాహత్ సూచించారు.

ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్ లు మాట్లాడుతూ దేశంలో జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. దాడులను అరికట్టేందుకు దేశంలో మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.మహిపాల్ రెడ్డి, ఏ.రాజేష్, షౌకత్ హమీద్, చారీ, శ్రీనివాస్ రెడ్డి, ప్రతిభ, గౌస్, అశోక్, వెంకటయ్యలతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE