Suryaa.co.in

Features

జీవితం ఒక చిక్కుముడి

డా. ఘనీ మున్సిఫ్:

నలుగురు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఒకడు వడ్రంగి, ఒకడు దర్జీ, ఒకడు కంసాలి, ఒకడు ఆధ్యాత్మిక సాధువు. వారంతా ఒక భయంకరమైన అడవి గుండా ప్రయాణిస్తున్నారు. అడవి జంతువులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. అందువలన కలసి ముందుకు సాగుతున్నారు. రాత్రి అయింది. వారంతా అక్కడున్న విశాలమైన చెట్టుకింద నిద్రించాలని నిర్ణయించుకున్నారు. ఎటువంటి క్రూర మృగాలు దాడి చెయ్యకుండా ఒకరి తరువాత ఒకరు కాపలా ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు.

మొదట వడ్రంగి కాపలా నిర్వహించాడు. కాలక్షేపం కొరకు ఆ చెట్టు కొమ్మను తీసుకుని తన దగ్గరున్న పని ముట్లతో ఒక మానవ స్త్రీ రూపాన్ని చెక్కసాగాడు. అతడు తన వని పూర్తి చేసేసరికి కాపలా సమయం పూర్తయింది. దర్జీని నిద్ర లేపి తాను పడుకున్నాడు.

దర్జీ తనతోటి ప్రయాణికుడు చెక్కిన ఆకృతిని చూసి ఆశ్చర్యపోయాడు. తాను కూడా ఆ కృతికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి దుస్తులు తయారు చేసాడు. అలా దుస్తులు తొడిగే సరికి ఆ స్త్రీ మూర్తి చాలా అందమైన బొమ్మలా తయారైంది.

మూడవ కాపలా వాడు కంసాలి. తనతోటివారి పనితనానికి ఆనందించి తాను కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో తన దగ్గరున్న పూసలు, వైరు ఉపయోగించి ఆ అందమైన ఆ బొమ్మను అలంకరించాడు.

చివరి కాపలా నిర్వహణ ఫకీరుది. అతడు ఆ ముగ్గురు చేసిన పనికి చాలా సంతోషించాడు. కానీ తనలో ఏ నైపుణ్యము లేదని, వారు ముగ్గురు లేచి తనను చిన్న చూపు చూస్తారని తలచాడు. అప్పుడతడు నిశ్చలభక్తితో భగవంతుని ప్రార్థిస్తూ “ఓ భగవంతుడా నా మానావమానాలు నీ చేతిలో ఉన్నాయి. నాతోటి వారు నన్ను చిన్న చూపు చూసేలా చెయ్యకు. ఈ మూర్తికి ప్రాణం పొయ్యి. నువ్వు సర్వశక్తి మంతుడవు” అని ప్రార్థించాడు. అలా నిస్సహాయ స్థితిలో హృదయ పూర్వకంగా చేసిన ప్రార్ధనను భగవంతుడు ఆలకించాడు.

ఆ ఆకారం ఒక దేవతాస్త్రీగా మారిపోయింది. చాలా అందంగా మారిపోయింది. తెల్లవారింది. నలుగురు బాటసారుల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ప్రతి ఒక్కరు ఆ స్త్రీ తనకే చెందాలని వాదించసాగారు. వడ్రంగి మొదట వచ్చిన ఆలోచన తనదేనని కనుక ఆ స్త్రీ తనకే చెందాలని వాదించాడు. ఇద్దరు దర్జీ, కంసాలి ఆ ఆకృతికి అందంగా తీర్చిదిద్దడానికి తాము కృషి చేసామని కాబట్టి వారికి కూడా ఆమె సొంతమవుతుందని వాదించసాగారు.

తరువాత ఫకీరు తన మహిమ ముందు వారెంత! వారికెవరికీ అధికారం లేదని వాదన మొదలు పెట్టాడు. వారి సమస్య తేల్చుకోలేక వారు నలుగురు ఆ ఊరి మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆమెను తీసుకొని కాజీ
దగ్గరకు వెళ్ళారు. కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఆ సుందరిని చూసిన మెజిస్ట్రేట్ తానే ఆమెను పొందాలనుకున్నాడు. అతడు ఆ నలుగురు ప్రతి వాదులను మోసగాళ్ళ కింద జమకట్టి ఆమె తన ఇంట్లో పని చేసే పని మనిషని, ఉదయం నుండి కనిపించడంలేదని ప్రకటించాడు.

వారికేం చెయ్యాలో తెలియక ఆ దేశపు రాజుని కలవడానికి బయలు దేరారు. ఆయన న్యాయ స్థానంలో న్యాయం దొరుకుతుందని భావించారు. రాజు ముందు నిలబెట్టిన ఆ స్త్రీ దేవతా సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై పోయాడు. అతనిలోని నిజాయితీ, నిష్పక్షపాత వైఖరి తొలగిపోయింది. అతడు ఆమె తన భార్యలలో ఒకరని ప్రకటించి ఆమెను వేధించినందుకు అందరు శిక్షింపబడతారని భయపెట్టాడు. వారంతా మరింత గందరగోళానికి గురయ్యారు.

ఆ సమయంలో ఒక తాపసి ఆ దారిన వెడుతూ కనిపించాడు. అతడు వారిని ఏమిటి గొడవ అని అడిగాడు. నేను మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అసలు మొత్తం ఈ గొడవ మొదలైన చోటులోనే పరిష్కారం దొరుకుతుందని అందరూ అక్కడికి వెళ్లుదామని సలహా ఇచ్చాడు. అక్కడ వారికి నీడనిచ్చిన చెట్టే మీకు సాక్ష్యంగా నిలబడి మీ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పాడు. వెంటనే కాజీ, రాజు, ఆ తాపసి సమస్యకు కారణమైన ఆ నలుగురు అ చెట్టు దగ్గరకు వెళ్ళారు. అక్కడ వీరికి ఆ చెట్టుకి ఒక పెద్ద తొర్ర కనిపించింది. వారు ఊహించుకున్న ఆ అసత్యమైన రూపం గల స్త్రీ అందులో అదృశ్యమైంది. ఆ విధంగా వంచింపబడిన ఆ హక్కు దారుడు నలుగురు నిరాశతో ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు.

ఈ భూమిమీద ఉన్న మానవుని దుస్థితికీ సంఘటన అద్దం పడుతుంది. పుట్టి పెరిగి పెద్దవాడయిన తరువాత ఆ వ్యక్తిపై రకరకాల మోసగాళ్లు హక్కుదారులు తమని గుర్తించాలని అతని మీద వాలుతూంటారు. తల్లితండ్రులు అతనిని పెంచి పెద్ద చేసినందుకు అనుబంధాన్ని కోరుతారు. బోధకులు చదువు చెప్పినందుకు తమను గౌరవించాలని ఒత్తిడి తెస్తారు. భార్య పిల్లలు అతని నుండి ప్రేమను వాంఛిస్తారు. సంఘం అతని సేవను కోరుతుంది. దేశం, దేశభక్తి ఉండాలని కోరుతుంది. చర్చి నరకం నుండి తప్పించినందుకు సొమ్ము చెల్లించుమంటుంది.

అలా వివిధ విషయాలతో తికమక పడుతూ వాటి నుండి తప్పించుకునేందుకై మరణాన్ని ఆశ్రయిస్తాడు మానవుడు. కానీ అది రోగం కంటే మరింత బాధాకరమైనది. అలా జనన మరణాల విషవలయంలో ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడుతూ చివరకు గురువు సన్నిధిని చేరుతాడు. ఆ గురువే అతనికి స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జీవాత్మ, పరమాత్మతో ఎప్పుడు ఏకమైపోతుందో అపుడు అతని చుట్టు ఉన్న హక్కుదార్లు అనగా అతని శరీరము, మనసు, ఆత్మ, సంఘం, దేశం, ఉపాధ్యాయుడు, బోధకుడు అందరూ మటుమాయమవుతారు.

మెహెర్ ప్రేమపధం

మెహెర్ బాబా :

“ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తనకు తెలియకుండానే యీ జీవితం పట్ల మిసుగు చెంది ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆనందాన్నే కోరుకుంటారు. కానీ ఆనందాన్ని పొందడం మాత్రం ఎలాగో తెలియదు. కానీ జీవితం చాలా అద్భుతమైనది. ఆనందంగా ఉండడానికే ఉంది. (నిరాశ పడకండి) నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు అన్ని మారిపోతున్నట్లు కనిపిస్తాయి. అవి మీరు గమనిస్తారు.

బాహ్యంగా కనిపించేదే పరిగణనలోకి వస్తుంది. (అసలైన విషయం మరుగున పడిపోతుంది) ఈ రోజు మీరు విసిగిపోవచ్చు. నిరాశ పొందవచ్చు. నీ జీవితంలో నీ చుట్టు ఉన్న అన్ని ఎంతమాత్రం నీకు నచ్చకపోవచ్చు. రేపటి రోజున పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. సంతోషంతో ఉండవచ్చు. నిన్న చిరాకు పరచిన అన్ని విషయాలు మారినట్లు గమనిస్తారు.

ఇదంతా మీ మానసిక స్థితి, మీ దృక్పథం మారడం వలన జరుగుతుంది. ఇదంతా విషయాలను (గంభీరంగా) ప్రధానంగా (తీవ్రంగా) తీసుకోవడం వలన జరుగుతుంది. వాటిని తేలికగా తీసుకోండి. నేను ఆనందంగా ఉండడానికే జీవించి ఉన్నాను”. అని మీకు మీరు చెప్పుకోండి. అలా సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలరు. నేను అలసిపోయాను. విసుగు చెందిపోయాను, నిరాశగా ఉన్నాను- అని ఎన్నడు నీ మనసుతో అనకు. అది ఇంకా నిన్ను దిగజారుస్తుంది. ఎప్పుడు అంతా బాగుంటుంది. సుందరంగా ఆహ్లాదంగా ఉంటుంది. నేను సంతోషంగా ఉంటాను అని భావిస్తే నేను నీకు ఆధ్యాత్మికంగా సాయం చేస్తాను.

ఒక్కటే మనమంతా పుట : 22-26
మెహెర్ ప్రేమ పధం

LEAVE A RESPONSE