ఉన్నత పదవి అందని మావి!
ఒకనాడు పార్లమెంటులో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైన ఓ పార్టీ మరోనాడు జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టింది.లెక్కలు ఎలా మారాయి..అద్భుతం జరిగిందా..మాయామంత్రం.. కుళ్ళు కుతంత్రం ఏమైనా చోటు చేసుకున్నాయా..లేదే..కనీసం నిన్న మొన్నటి ఎన్నికల్లా ఇవిఎంల గోల కూడా లేని రోజులాయె.
మరి అలాంటి పరిస్థితుల్లో ఒక సభలో ఇంచిమించు ఉనికే లేని భారతీయ జనతా పార్టీని మరో సభ నాటికి అధికారంలో కూర్చోబెట్టిన ఘనత నిస్సందేహంగా లాల్ కిషన్ అద్వానీదే..!
అది మాత్రమే గాక ముందు నుంచీ బిజెపికి ఒక వైపు కొమ్ము కాసిన దిగ్గజం అద్వానీ..ఇప్పుడు అదంతా ప్రస్తావిస్తే ఒక మహా గ్రంథమే అవుతుంది.. బిజెపి అధికారంలోకి రావడానికి..ఈరోజున అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో సదరు బిజెపి రొమ్ములు విరిచి గొప్పలు పోవడానికి మూల కారకుడు లాల్ కిషన్..ఆయన జరిపిన రథయాత్ర ప్రజల్లో ఒక చలనమై..దేశంలో ఒక సంచలనమై..
హిందుత్వ నినాదానికి ఒక ఆలంబనమై..ఈరోజున బిజెపి అనుభవిస్తున్న అధికార జైత్రయాత్రకు
శ్రీకారమై నిలిచిందనడంలో ఎటువంటి సందేహాలకు తావు లేదు..జాతికి అద్వానీ ఒక బలమైన నాయకుడు..బిజెపికి తిరుగులేని హీరో..!
అయితే ఆ ఫలితం అద్వానీకి ఎంత వరకు దక్కింది..పార్టీకి ఒక సుశిక్షితుడైన సైనికుడిగా..మచ్చలేని నాయకుడిగా… ఒకనాటి మహానేత అటల్ బిహారీ వాజపేయికి నిజమైన సేనాధిపతిగా..స్నేహితుడిగా వెలిగిపోయిన అద్వానీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.బిజెపి ఆయన రుణం ఎంతవరకు తీర్చుకుంది.అటల్జీ ఉన్నంతకాలం పార్టీ క్యాడర్ పై… ప్రజలపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అద్వానీ రెండో స్థానానికే పరిమితం కావలసి వచ్చింది.భారతీయ జనతా పార్టీని..ఆ పార్టీ బలంగా చేపట్టిన రామజన్మభూమి నినాదాన్ని..ఆ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లిన నాయకుడు అద్వానీ..
అయితే వాజపేయి ఇమేజ్ కారణంగానే బిజెపి అధికారంలోకి రాగలిగిందనే ఒక ఫీలింగ్ ని పార్టీలో బలంగా నాటుకు పోయేలా చేసిన కొన్ని శక్తులు 1996లో కేంద్రంలో తొలిసారిగా బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆటల్జీని పెద్ద కుర్చీపై ప్రతిష్టించాయి..ఆ తర్వాత కూడా బిజెపి కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాజపేయి ప్రధానిగానే కొనసాగారు.మొత్తం కెరీర్లో ఉప ప్రధాని హోదాని దాటి
అద్వానీ ముందుకు వెళ్ళలేక పోయారు.
భారతీయ జనతా పార్టీలో అంతర్గత వ్యవహారాలు..తెరచాటు రాజకీయాలు..ఆపై మితిమీరిన ఆరెస్సెస్ జోక్యం..ప్రమేయం..ఒక దశలో ప్రాబల్యం అద్వానీకి వ్యతిరేకంగానే నడిచాయి..ఇదే దశలో వాజపేయి శకం ముగుస్తుందనగా ఇటు అద్వానీని.. అటు అప్పటికి ఒక వెలుగు వెలుగుతున్న తెలుగు బిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడిని మరుగు పరుస్తూ నరేంద్ర మోడీని తెరపైకి తెచ్చారు.
అంతే.. అప్పటివరకు జాతీయ రాజకీయాలలో పెద్దగా ప్రాచుర్యమే లేని మోడీ ఒక హీరోగా అవతరించి 2014 నుంచి ఇటు పార్టీ..ఆటు ప్రభుత్వ వ్యవహారాలను శాసిస్తున్నారు.ఆయనకు ఆమిత్ షా తోడయ్యారు.
2014 లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్టీ కోసం..ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం జీవిత పర్యంతం పాటు పడిన..రథయాత్ర వంటి అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి నేతృత్వం వహించిన అద్వానీకి ప్రధాని పదవి లభిస్తుందేమోనని పార్టీలోని అత్యధికులే గాక మామూలు జనం కూడా ఊహించారు.అయితే ప్రధాని పదవి కాదు కదా.. ఉపప్రధాని..కేంద్రమంత్రి..ఇత్యాది ఉన్నత స్థానాల ప్రసక్తే లేకపోగా పూర్తిగా వృద్ధ సింహాన్ని పక్కన పెట్టేశారు.
పర్యవసానంగా 2014 నుంచి జాతీయ రాజకీయ యవనికపై నుంచి అద్వానీ అనే మహాయోధుడు ఔట్!
ఇదిలా ఉంటే ప్రధాని..ఉప ప్రధాని..కేంద్రమంత్రి ఇత్యాది రాజకీయ సంబంధ పదవుల
సంగతి అటుంచితే 2017లో ప్రెసిడెంట్ పదవిని అద్వానీకి కట్టబెట్టి ఆ వీరునికి అత్యున్నత గొరవాన్ని ఇచ్చి వీడ్కోలు చెపితే సముచిత రీతిన ఉండేది..అయితే బిజెపి అలా కూడా చెయ్యలేదు.
నిజం చెప్పాలంటే 2017లో రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాధ్ కోవింద్ పేరును తెరపైకి తెచ్చే వరకు కూడా ఈ దేశంలో చాలా మందికి ఆయన పేరు కూడా తెలియదు.పార్టీలో అద్వానీ..వెంకయ్య నాయుడుతో పాటు ఎందరెందరో పెద్ద నాయకులు ఉండగా ఏరికోరి కోవింద్ ను అత్యున్నత పదవిలో కూర్చోబెట్టడం వెనక ఏ శక్తులు పని చేశాయో.. వాటి ఆలోచనలు ఏమిటో ఇంచుమించు దేశం మొత్తం ఊహించగలిగిన విషయమే.. ఇటు అద్వానీకి శాశ్వతంగా తలుపులు మూసెయ్యడం..అదే సమయంలో వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి ఆయనను క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకి తప్పించడం..ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు..ఆ మాస్టర్ ప్లాన్..!
జనం మర్చిపోలేదు
సరే… భారతీయ జనతా పార్టీ..ఆ పార్టీలోని పెద్ద తలకాయలు అద్వానీని తాము మరచి పోయినట్టు జనం కూడా మర్చిపోయారని అనుకుంటున్నారేమో కాని జనం ఇప్పటికీ అద్వానీ పేరు వినాలనే కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ వయసులో కూడా దేశానికి ఆయన అవసరం ఉంది.అపారమైన ఆయన అనుభవం..మేధస్సు వెలకట్టలేనివి.ఆయన ఇంకా జవసత్వాలు ఉడిగిపోని అద్వానీగానే అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు.
ఇక వర్తమానానికి వస్తే రామ్నాధ్ కోవింద్ 2017 జూలై నెలలో దేశంలోని అత్యున్నత పదవిని చేబట్టి రేపు జూలైలో పదవీ విరమణ చేయబోతున్నారు..ఆయన వారసుని ఎంపిక ప్రయత్నాలు మొదలయ్యాయి. నిర్ణయం కూడా జరిగిపోయి ఉంటుందేమో..కొన్ని వర్గాల నుంచి వెంకయ్య నాయుడు పేరు వినిపిస్తున్నా బిజెపి అంతర్గత రాజకీయాల దృష్ట్యా అది జరగడం అంత సులభం కాదేమో.అదే సమయంలో అప్పుడు కోవింద్ మాదిరిగానే ఇప్పుడు కూడా పరిచయమే లేని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.అద్వానీ గురించి కనీస ఆలోచన కూడా ఉన్నట్టు లేదు..
ఏం..ఆయనకు ఆ పెద్ద గౌరవాన్ని ఇచ్చి రుణం తీర్చుకుంటే..బిజెపి పెద్దలకు పోయింది ఏముంది.. అఫ్కోర్స్..అద్వానీతో కొన్ని సమస్యలు ఉంటాయనేది నిస్సందేహం..కొన్ని విషయాల్లో ఆయన రాజీపడరు.అది ప్రస్తుతం చక్రం తిప్పుతున్న కొందరికి ఇబ్బందికరంగా పరిణమించవచ్చు..అసలు ఇప్పటి వరకు చాలా మంది ప్రధమ పౌరులు వెయ్యని ఒక బలమైన ముద్ర ఈ వయసులో కూడా అద్వానీ వంటి మేరునగధీరుడు అత్యున్నత స్థానంపై విడిచిపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు..
కరాచీ సాకు
అలాంటి భయాలతోనే బిజెపి తాజా వ్యూహకర్తలు..అతి పెద్దలు అద్వానీని ఒక పథకం ప్రకారం 2005 నుంచే పక్కన పెట్టడం ప్రారంభించారు.అదే సమయంలో అగ్రనేత అద్వానీ తన జన్మస్థలమైన కరాచీ సందర్శించడం..జిన్నా సమాధిని కూడా చూసి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఆ శక్తులకు ఆయనను పక్కన పెట్టడానికి ఆయుధాలు దొరికినట్టయింది..
అప్పటి నుంచే ఈ వృద్ధ సింహాన్ని తెర వెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ పెద్దలు ఇప్పుడు అద్వానీకి పెద్ద పదవి కట్టబెట్టే విషయం గురించి కనీసం ఆలోచనైనా చేస్తుందా..అలా చేస్తే ఏవేవో పేర్లు తెరపైకి ఎందుకు వస్తాయి…ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా నయం..
గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారనే కానివ్వండి..పార్టీకి సేవ చేశారనే అనుకోండి..
జైల్ సింగ్…వెంకట్రామన్..ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను పెద్ద కుర్చీపై కూర్చోబెట్టారు.మొహమాటం లేకుండా చేపకంటే కాంగ్రెస్ పార్టీకి,దేశానికీ ఆ ముగ్గురూ చేసిన సేవ కంటే బిజెపికి.. దేశానికి..బిజెపిని వెనక నుండి శాసించే ఆరెస్సెస్ కి కూడా అద్వానీ చేసిన సేవలు చాలా ఎక్కువ..
ఇన్ని కారణాలు ఉండగా అధ్యక్ష పదవికి అద్వానీ వంటి మహానేత పేరును పరిశీలించకపోవడం వెనక
ఎలాంటి రాజకీయాలు చోటుచేసుకున్నాయో..చేసుకుంటున్నాయో..?వాటికో నమస్కారం!!
ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286