– ఎన్టీఆర్ పార్టీని దొంగలించిన బాబు-లోకేష్ లకు బయోడేటానే లేదు.
– పులివేషాలు వేసినంతమాత్రాన సింహాలు అయిపోరు.. మీరు గ్రామ సింహాలే..
– తొడలు గొట్టి, తిలకం దిద్దినంత మాత్రాన లోకేష్ వీరుడు కాదు జోకరే.
– పల్నాడులో అడుగు పెట్టేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
– ఎన్నో హత్యలు చేసిన బ్రహ్మారెడ్డిని పెట్టి, పల్నాడులో మళ్ళీ ఫ్యాక్షన్ ను రెచ్చగొడదామంటే సహించం
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
లోకేష్ ఒక జోకర్
శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలియని లోకేష్.. పల్నాడులో పరామర్శ పేరుతో వచ్చి, నాలుగు దండలు వేసుకుని, నుదుట పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. పల్నాడులో ఏం జరుగుతుందో, అసలు పల్నాడు చరిత్ర ఏమిటో నారా లోకేష్‌కు తెలుసా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిన్న లోకేష్ మొహం చూస్తుంటే.. నిరాశ, నిస్పృహలు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడుకు వచ్చిన లోకేష్ మీసాలు మెలేసి, తొడలుకొట్టి, డైలాగులు చెబుతుంటే రాష్ట్ర ప్రజలందరికీ సినిమాల్లో హాస్యనటుడు బ్రహ్మానందం – కిల్పిల్ పాండే పాత్ర పోషించినట్లుగా ఉంది. లోకేష్ వీరుడు కాదు ఒక జోకర్. హతుడు జల్లయ్య గురించి నారా లోకేష్‌కు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నాం. 2014-19లో మీ నాన్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జల్లయ్యపై పది కేసులు నమోదు అయ్యాయి. అలాంటి వ్యక్తి వారి వ్యక్తిగత గొడవల్లో హత్యకు గురైతే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చావు. నువ్వు, నీ తండ్రి మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా పంపించిన బ్రహ్మారెడ్డి నేర చరిత్ర గురించి నీకు తెలుసా లోకేష్?.
బాబు సీఎంగా ఉండగా 15 ఫ్యాక్షన్ హత్యలు
నీకు పల్నాడు రాజకీయాలు తెలియకపోతే.. మీ తండ్రిని అడిగితే చెబుతాడు. రాజకీయాలంటే, ఆఫ్ నిక్కర్లు వేసుకుని విదేశాల్లో స్విమ్మింగ్‌ఫూల్‌లో అమ్మాయిలతో కులకడం అనుకుంటున్నావా…? నీ పక్కన కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి తల్లి 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, ఆమె సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగాయి. అలాంటి ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డిని నీవు పక్కన కూర్చోబెట్టుకుని ఫ్యాక్షన్ గురించి, హత్యా రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఏడుగురుని హతమార్చిన కేసులో బ్రహ్మారెడ్డి ఏ1 ముద్దాయి. సొంత బాబాయ్‌ని చంపిన కేసులో ఏ1గా ఉన్నాడు. సొంత కొడుకును చంపిన కేసులో ఏ1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. పల్నాడులో ఫ్యాక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పల్నాడులో తిరిగి ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టాలని మీరు చూస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో 2004 నుంచి మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎక్కడా కూడా ఫ్యాక్షన్‌కు సంబంధించిన గొడవలు జరగనివ్వకుండా అణచివేశాం.
అలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న బ్రహ్మారెడ్డిని, మాచర్లకు పంపించి తండ్రీకొడుకులు మళ్ళీ ఇక్కడ నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తున్నారు. ఇదంతా ప్రజలంతా గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే 2019లో 23 సీట్లు వచ్చిన టీడీపీకి ఈసారి ఎన్నికల్లో మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మీ నీచ రాజకీయాలను చూసి పల్నాడు ప్రజలు మిమ్మల్ని ఛీకొడుతున్నారు.
మీకు అసలు బయోడేటా ఉందా..?
మా బయోడేటాలోనే భయం లేదని చెబుతున్న లోకేష్‌ను, ఆయన తండ్రి చంద్రబాబుని అడుగుతున్నాం. మీకు అసలు బయోడేటా అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీని, జెండాను దొంగలించిన దొంగలు మీరు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆస్తులను దొంగలించిన మీకు అసలు బయోడేటా ఎక్కడ ఉంది? అసలు లోకేష్ బుర్రలో డేటా అనేది ఏమైనా ఉందా? లోకేష్‌కు అమరావతిలో ఆధార్ కార్డే లేదు. నువ్వు, నీ తండ్రి హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోయే టూర్టిస్ట్‌లు, అటువంటి మీరా మా గురించి మాట్లాడేది?
మీరు గ్రామ సింహాలే..
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రాయలసీమ పౌరుషం చూపించేది సింహంలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదే రాయలసీమలో పుట్టిన మీ తండ్రీకొడుకులు గ్రామ సింహాలు మాత్రమే. ఈ విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకుంటే మంచిది.
మంగళగిరిలో ఓడిపోయి, దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ సవాళ్ళు విసురుతుంటే విడ్డూరంగా ఉంది. అదే నేను మాచర్ల ప్రజల చేత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాను, ప్రభుత విప్‌గా పనిచేస్తున్నాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నన్ను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పల్నాడు ప్రజలు సహించరు. నీ పిల్ల చేష్టలు, నీ ఆఫ్ నాలెడ్జి రాజకీయాలు ఉంటే.. నీ కొడుకు దేవాన్ష్‌కు చెప్పుకో… పల్నాడు ప్రజలకు కాదు.
పల్నాడు ప్రాంతంలో నీళ్లు లోకేష్ ఎప్పుడూ రుచి చూసినట్టు లేదు. అందుకే ఒక జోకర్ లా మాట్లాడుతున్నాడు. గతంలో కూడా మీ చెంచాలను, మీ పార్టీ నాయకుల్ని పల్నాడుకు పంపించి గూండాగిరి చేయాలని చూశారు. అప్పుడు మీరు రుచి చూసిన పల్నాడు ప్రజల పౌరుషం ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదని లోకేష్‌కు హితవు పలుకుతున్నాం. అనవసరపు మాటలు, అబద్ధపు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలి.
ఫ్యాక్షన్ ను రాజేయాలని చూస్తే ఉపేక్షించం..
ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ ప్రోత్సహించి పల్నాడును అల్లకల్లోలం చేయాలని చూస్తే.. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.
సింహంలాంటి జగన్ మోహన్ రెడ్డిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుందో అదే పరిస్థితి లోకేష్ కు ఎదురౌతుంది. పల్నాడులో ఏదో జరిగిపోతుందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఏ గ్రామానికైనా రండి. క్రియాశీలకంగా ఉన్న మీ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళదాం. మీ తండ్రి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాలకు, ఆ కుటుంబాలకు ఎంత న్యాయం జరిగిందో… గడిచిన మూడేళ్లలో మా ప్రభుత్వ హయాంలో ఎంత న్యాయం జరిగిందో ప్రత్యక్షంగా చూద్దాం. మా నాయకుడు జగన్ ఆదేశాల మేరకు కులాలు, వర్గాలు, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం.
క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వాస్తవాలు తెలుసుకోకుండా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలో, మీ డబ్బా మీరు కొట్టుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పల్నాడు ప్రాంతంలో అడుగు పెట్టేడప్పుడు ఒళ్లు, నోరు అదుపులో పెట్టుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
లోకేష్‌వి పిల్ల రాజకీయాలు, పిల్ల చేష్టలు. నేను నిజంగానే అరాచకాలు చేసేవాడిని అయితే ప్రజలు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారు. అరాచకాలు, ఫ్యాక్షన్ చేసే వ్యక్తిని టీడీపీ మాచర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా పెట్టింది చంద్రబాబే. సొంత కుటుంబ సభ్యుల్ని దారుణంగా హతమార్చిన కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని నాపైన విమర్శలా? ఇలాంటి ఉడత ఊపులకు పల్నాడులో ఎవరూ భయపడరు.నారా లోకేష్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాను. మా పై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వైయస్సార్ జలకళ పథకం ద్వారా 300 బోరుబావులను తవ్వించే కార్యక్రమం చేస్తున్నాం. అర్హతే ప్రాతిపదికగా ఎలాంటి వివక్ష చూపించకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గుడ్డ కాల్చి మా మీద వేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. లోకేష్ అవాస్తవాలు మాట్లాడటం కాదు, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఛాలెంజ్ చేస్తున్నాను.
జల్లయ్య అనే వ్యక్తి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదికేసుల్లో ముద్దాయి. మా పార్టీకి సంబంధించి వ్యక్తిని చంపితే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలతో మాట్లాడి, గొడవలు వద్దని నేనే రాజీ చేశాను. జనవరి 24, 2022న ఆ కేసును కొట్టేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా పంపించారో, అప్పటి నుంచి పాత ఫ్యాక్షన్‌ను బయటకు తీస్తూ గొడవలు చేస్తున్నారు.