ప్రభుత్వంపై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాల ధ్వంసానికి వైసీపీ తెగబడటం చాలా దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నిన్న దుర్గి, నేడు తాడికొండలో మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాలని విద్వేషంతో పగలగొట్టారన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు.. దేవతామూర్తులు, మహనీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారణమైపోయాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు. అధికార మదంతో రహదారిపై ఉన్న విగ్రహాలను కూలగొడుతున్న జగన్‌రెడ్డి అండ్ కో… ప్రజలు తమ గుండె గుడిలో కట్టుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎప్పటికీ కూలదోయలేరని నారా లోకేష్ పేర్కొన్నారు.