జగన్‌ను చూసి ఎవ్వరూ అప్పు ఇవ్వరు: సీపీఐ రామకృష్ణ

Spread the love

విజయవాడ : వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో వర్కు షాపులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంత్రుల మాటలు సీఎం జగన్ తరహాలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు హయాంలో అప్పులు తప్పు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారని, ఇప్పుడు రెట్టింపు అప్పులు చేసి సిగ్గు లేకుండా సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు.

అప్పులు ఇచ్చే వాళ్లు రాష్ట్ర ప్రజలు, ఆర్ధిక వనరులు చూసి ఇస్తారని, జగన్‌ను చూసి ఎవ్వరూ అప్పు ఇవ్వరని అన్నారు. అప్పు చేసి తెచ్చిన డబ్బుతో జగన్ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఏది..ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి బుగ్గనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఆస్తి పన్ను పెంపుకు ప్రజలు అంగీకరించారని మంత్రి బొత్స చెప్పడం హాస్యాస్పదమన్నారు.

విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ఈ పన్నుల భారాలు వేస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మంత్రి బొత్సకు నమ్మకముంటే వీటిపై రెఫరెండం పెట్టాలన్నారు. ప్రజలు అంగీకరిస్తే సరే. లేదా ఉపసంహరించుకోవాలని, వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళదామన్నారు. వైసీపీ గెలిస్తే తాము తమ పోరాటాలు వదిలేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Leave a Reply