-ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్.జగన్ భేటీ
– రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ప్రధానికి నివేదించిన సీఎం.
– విజ్ఞాపన పత్రం అందించిన ముఖ్యమంత్రి
ప్రధానికి సీఎం నివేదించిన అంశాలు:
రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయి: ప్రధానితో సీఎం
రాష్ట్ర విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది
2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియచేయడానికి ఈ ఒక్క గణాంకాలే నిదర్శనం. భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ పెద్దది, ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువ.ప్రజల
అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది.విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది. అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయాం.అక్కడ వాటి కోసం భారీగా ఖర్చు చేశారు.అందుకే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతోపాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. కాని, చాలా హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు.
2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలియజేసింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్–90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో వ్యయం కూడా పెరుగుతుంది.
ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాలకు ప్యాకేజీలను కూడా విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారం. భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ భాగానికి మాత్రమే మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్ కాగా, రెండోది విద్యుత్ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ఈ విషయలలో మీరు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధానమంత్రి ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన జరిగే తేదీ నాటికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు తేదీకి మధ్యనున్న రిసోర్స్ గ్యాప్‌ను 2014–15 కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 2014 జూన్ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న రీసోర్స్ గ్యాప్ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్ నిర్ధారించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం (స్టాండరై్డజ్డ్ ఎక్స్‌పెండేచర్) పేరిట కొత్త పద్ధతిని తీసుకు వచ్చింది. రీసోర్స్ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది.
దీంతో నిధుల కొరత వల్ల 2014–15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతున్నాను.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను సరఫరా చేసింది. జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు విద్యుత్‌ను అందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్దిష్ట ఆదేశాల మేరకు ఆ విద్యుత్ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. కాని ఇప్పటివరూ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. దీని వల్ల ఏపీ విద్యుత్ సంస్థలు బలపడతాయి. బిల్లుల చెల్లింపులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లేని విధానం వల్ల రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2.68 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 61 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో 41 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు. కాకపోతే దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో సగటు లబ్ధిదారుల్లో గ్రామీణ ప్రాంత జనాభాలో 75 శాతం మంది, పట్టణ ప్రాంత జనాభాలో 50 శాతం మంది లబ్ధిదారులు ఉన్నారు.
ఆర్థికంగా గణనీయ ప్రగతి సాధించిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పీడీఎస్ లబ్ధిదారులు ఏపీలో కన్నా కనీసం 10 శాతం ఎక్కువగా ఉన్నారు. అర్హత ఉన్న చాలా మంది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కవర్ కావడం లేదు. అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఆ మేరకు ఎక్కువ మంది లబ్ధిదారులు కవర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ విషయమై కేంద్ర ఆహారం, వినియోగదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే కొన్ని ప్రతిపాదనలు పంపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సేకరిస్తున్న ఆహార ధాన్యాల్లో కేవలం 90శాతం మాత్రమే కేటాయిస్తున్నారు.
ఉదాహరణకు 2021 ఆగస్టులో 21.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేశారు. కాని ఆ మాసంలో సేకరించిన బియ్యం 24.4 లక్షల టన్నులు. నెలకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతోంది. ఏపీలో లబ్ధిదారులను విస్తృత పరిస్తే అదనంగా చేయాల్సిన కేటాయింపులు కేవలం 0.77 లక్షల టన్నులు మాత్రమే. దీని వల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటుగా కేటాయింపులు ఉంటాయి. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని తగిన కేటాయింపులు చేయాలని కోరుతున్నాం.
రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 2019–20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించింది. దీని వల్ల కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఆ ఆదాయం దాదాపు 3.38 శాతం తగ్గింది. గత 2 దశాబ్దాల్లో కేంద్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయంలో అతి తక్కువ నమోదైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత∙దుర్లభంగా మారింది. అన్ని వర్గాల వారూ తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి.
ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు పెట్టబడులు, వారి పెట్టే ఖర్చులు తగ్గాయి. ప్రభుత్వాలే వ్యయం చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ప్రగతి పరిమితమైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీని కోసం భారత్‌తో పాటు వివిధ ప్రపంచ దేశాలన్నీ కూడా భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. 2020–2021లో దేశ జీడీపీలో 11 శాతం మేర కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి కేంద్రం ఈ డబ్బును వ్యయం చేసింది.
2019–2020 ఆర్థిక మందగమనం కూడా ఏపీపై ప్రభావం చూపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.34,833 కోట్లు అయితే వాస్తవంగా వచ్చింది రూ.28,242 కోట్లు మాత్రమే. 2020–21లో కోవిడ్ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీశాయి. కేంద్ర పన్నుల్లో రూ.7.780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్రం ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయి. దీంతోపాటు కోవిడ్ నివారణా చర్యల కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం.
వీటితోపాటు రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల (డీబీటీ) ద్వారానే జీవనోపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోగలమని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించింది. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నుంచి పక్కకు వెళ్లలేదు. అంకిత భావంతో ఆ పథకాలను అమలు చేసింది. ప్రజల చేతిలో నేరుగా డబ్బు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం కావడమే కాదు, ఎలాంటి అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శక పద్ధతిలో అత్యంత సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకుంది. దీంతోపాటు రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా మార్చగల వైద్యం, విద్య, వ్యవసాయం, గృహæనిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులు కుంటుపడకుండా గట్టిగా అమలు చేశాం.
ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు తన శక్తిమేరా ప్రయత్నం చేసింది. ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా తన వంతు కృషి చేసింది. 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితి (నెట్ బారోయింగ్ సీలింగ్–ఎన్‌బీసీ) ని రూ. 42,472 కోట్లుగా నిర్ధారించారు. తదుపరి కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని ఆమేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్టుగా పేర్కొంది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండానే ఈ విధంగా రుణ పరిమితిలో కోత విధంచడం సరి కాదు. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. మేం తీసుకుంటున్నవి అప్పులే కాని, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. తీసుకుంటున్న రుణాలకు సకాలంలో చెల్లింపులు కూడా చేస్తున్నాం. గత ప్రభుత్వం తమ ఐదేళ్ల కాలంలో అధికంగా అప్పులు చేశారన్న కారణంగా ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో కోత విధించడం రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించాల్సిన ప్రస్తుతం తరుణంలో విధిస్తున్న పరిమితులు ఇలాంటి అవకాశాలకు ఆస్కారం ఇవ్వదు.
గత ఐదేళ్ల కంటే ముందు ఇచ్చిన రుణ పరిమితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులు తీసుకోలేదనే అంశానికి సంబంధించి మీ ముందు వివరాలు సమర్పిస్తున్నాను. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఎన్‌బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాను.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్‌ను రెన్యువల్ చేయాలని కోరుతున్నాను.వైయస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థచే వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కోరుతున్నాను.
ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే క్రమంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలని కేంద్ర గనుల శాఖకు విజ్ఞప్తి చేశాం. వేలం ప్రక్రియలో పాల్గొనాలని గనుల శాఖ చెబుతోంది. వేలం ప్రక్రియ వల్ల తక్కువ ఖర్చుకు గనులు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వైయస్సార్ కడప జిల్లాలో ప్లాంట్æఏర్పాటుకు అత్యంత కీలకమైన గనుల కేటాయింపు అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించాం. ఎస్‌బీఐ క్యాప్ ఎస్సార్ స్టీల్స్‌ను కాపంటేటివ్ బిడ్డర్‌గా ఎంపిక చేసింది. రుణం మంజూరుకు ఎస్‌బీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా ముగిసేలా చేయగలగడం ద్వారా రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది.