Suryaa.co.in

Andhra Pradesh

మీకు ఓట్లు వేయ‌డ‌మే గిరిజ‌నులు చేసిన పాప‌మా?

– మీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవోలు ఆదివాసీల‌పాలిట శాపంగా మారాయి
– భూమి ఉంద‌ని మీరు పింఛ‌ను, రేష‌న్ పీకేయ‌డం అన్యాయం కాదా?
–  గిరిజనుల సమస్యలపై సీఎం జగన్‌కు లోకేష్ బహిరంగలేఖ
గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
అమరావతి
విషయం: గిరిజ‌నులకు సంక్షేమ‌ప‌థ‌కాలు దూరం చేసే అడ్డ‌గోలు నిబంధ‌న‌లు స‌వ‌రించి ..ఆపేసిన పెన్ష‌న్‌, రేష‌న్, సంక్షేమ‌ప‌థ‌కాలు పున‌రుద్ధ‌రించ‌డం గురించి
అయ్యా!
girijanaముఖ్య‌మంత్రి గారూ! మీకు ఓట్లు వేయ‌డ‌మే గిరిజ‌నులు చేసిన పాప‌మా? అడ్డ‌గోలు నిబంధ‌న‌ల‌తో ఆదివాసీల‌కు సంక్షేమ‌ప‌థ‌కాలు అంద‌కుండా దూరం చేయ‌డం మీకు న్యాయ‌మా? త‌ల‌కుమించిన అప్పుల‌తో సంక్షేమ‌ప‌థ‌కాలు కోత వేయాల‌నే ఆలోచ‌న‌తో క‌నీస అధ్య‌య‌నం లేకుండా మీరు తెచ్చిన నిబంధ‌న‌లు వేలాదిమంది గిరిజ‌నుల జీవ‌నాధార‌మైన పింఛ‌ను, రేష‌న్‌ని దూరం చేస్తున్నాయి. నిర‌క్ష‌రాస్యులైన ఆ గిరిజ‌నులు త‌మ‌కి రేష‌న్ బియ్యం ఎందుకివ్వ‌డంలేదో, పింఛ‌ను ఎందుకు ఆపేశారో తెలియ‌క‌…కొండ‌ల‌పై నుంచి దిగి రాలేక‌…ఆక‌లితో, ఆవేద‌న‌తో కుంగిపోతున్నారు. గిరిజ‌నుల క‌న్నీటిక‌ష్టాల‌పై ప‌త్రిక‌ల‌లో క‌థ‌నాలు వ‌చ్చినా మీరు స‌రిదిద్దే చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ఆదివాసీల ప‌ట్ల మీ చిన్న‌చూపుని ఎత్తిచూపుతోంది. సంక్షేమ‌ప‌థ‌కాలు కోత‌వేయాల‌నే హిడెన్ అజెండాతో ప‌ది ఎక‌రాల భూమి, ప్ర‌భుత్వ ఉద్యోగం, వాహ‌నం ఉంటే వారిని సంక్షేమ‌ప‌థ‌కాల‌కు అన‌ర్హులని మీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవోలు ఆదివాసీల‌పాలిట శాపంగా మారాయి.
ఈ నిబంధ‌న‌లే ఆదివాసీలని సంక్షేమ‌ప‌థ‌కాలకి దూరం చేస్తున్నాయి. రాజ్యాంగంలోకి 5వ‌ షెడ్యూలు లోని క్లాజ్ 6 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు…హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంద‌ని స్ప‌ష్టంగా పేర్కొన్నా…రాష్ట్ర‌ప్ర‌భుత్వం దీనిని విస్మ‌రించి మైదాన‌ప్రాంతాల ల‌బ్ధిదారుల ఏరివేత‌కి ఉద్దేశించిన నిబంధ‌న‌ల‌నే షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల‌కు విధించ‌డంతో వేలాదిమంది పింఛ‌ను ఆస‌రా కోల్పోయారు.
రూపాయి కిలోబియ్యానికి అన‌ర్హుల‌య్యారు. మైదాన‌ప్రాంతంలో 10 ఎక‌రాలుంటే త‌క్కువ‌లో త‌క్కువ ..కోటి రూపాయ‌లు విలువ చేస్తుంది…అదే ఆదివాసీల పేరుతో ఎన్ని ఎక‌రాలున్నా.. 5వ షెడ్యూల్ లోని 1/70 చ‌ట్టం ప్ర‌కారం అమ్మ‌డానికి వీల్లేదు, కొనడానికి వీల్లేద‌నేది సుస్ప‌ష్టం. అలాగే కొండాకోన‌ల్లో ఉండే ఈ భూముల్లో పండేది ఏమీ ఉండ‌దు. ఏజెన్సీలో ఆదివాసీల‌కు భూమి పది ఎకరాలకు మించి ఉన్నా … 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుంది.
దీని ద్వారా సంవత్సరానికి గ‌రిష్టంగా వ‌చ్చే ఆదాయం 25వేల రూపాయ‌ల‌కు మించ‌దు. ఈ సొమ్ముతో ఆదివాసీలు ఎలా జీవనం సాగించాలి? ఈ భూమి ఉంద‌ని మీరు పింఛ‌ను, రేష‌న్ పీకేయ‌డం అన్యాయం కాదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ప‌ది ఎక‌రాల నిబంధ‌న‌తో గిరిజ‌నుల నోటికాడ కూడు లాక్కోవ‌డం, సంక్షేమ‌ప‌థ‌కాల‌కు దూరం చేయ‌డం ఎంతవ‌ర‌కు స‌మంజ‌స‌మో ప్ర‌భుత్వం పునఃప‌రిశీచించాలి. టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదివాసీలందరికీ ఎటువంటి కొర్రీలు వేయ‌కుండా సంక్షేమ‌ప‌థ‌కాలు అందించాం.
మీరు అధికారంలోకి వ‌చ్చాక 5 ఎకరాలు భూమి వున్న గిరిజ‌నుల‌ని ప‌థ‌కాల‌కి అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తున్నారు. కొంతమంది ఆదివాసీల‌కు ఎటువంటి భూమి లేకపోయినా, రికార్డుల్లో 10 ఎకరాలు మించి ఉన్న‌ట్టు చూపిస్తూ… సంక్షేమ‌ప‌థ‌కాలు నిలిపేస్తున్నారు. రికార్డుల్లో మీరు చూపించిన భూమి ఆయా ఆదివాసీల‌కు అప్ప‌గించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. కుటుంబంలో ఎవ‌రైనా ప్ర‌భుత్వ‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం చేసినా ఆ కుటుంబపెద్ద‌ల ఆర్థిక‌స్థితి కూడా చూడ‌కుండా పెన్ష‌న్లు ఆపేస్తున్నారు. ఉద్యోగం వ‌చ్చిన వ్య‌క్తి త‌ల్లిదండ్రుల్ని కొండ‌ల‌పైనే వ‌దిలి మైదానప్రాంతాల‌కి వెళ్లిపోతున్నారు.
కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం అనే కార‌ణంతో సంక్షేమ‌ప‌థ‌కాలు మీరు ఆపేస్తున్నారు. కొండ‌ల‌పై ఆ నిరుపేద వృద్ధులు ఎలా బత‌కాలో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి. టిడిపి ప్ర‌భుత్వ‌ హయాంలో గిరిజ‌నుల‌కు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అందించాం. ఇప్పుడు ఉచిత‌విద్యుత్ ఎత్తేసి… 300 యూనిట్లు విద్యుత్ వాడ‌కం దాటినవాళ్ల పింఛ‌న్లు, రేష‌న్‌కార్డులు తీసేయ‌డం గిరిజనుల‌ని మోసం చేయ‌డ‌మే. ఎన్టీఆర్ సీఎంగా వున్న‌ప్పుడు గిరిపుత్రుల‌కి ప‌క్కాఇళ్లు క‌ట్టించి ఇస్తే…ఇప్పుడు వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో ప‌దివేలు క‌ట్టాల‌న‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య. ఓటీఎస్ క‌ట్ట‌ని ఆదివాసీల సంక్షేమ‌ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నారు.
సీఎంగా మీరేమో స్వ‌చ్ఛందం అంటున్నారు, అధికారులేమో మాకు టార్గెట్ ఇచ్చార‌ని, క‌ట్ట‌క‌పోతే..పింఛ‌న్లు, రేష‌న్ క‌ట్ చేస్తామ‌ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓటీఎస్ స్వ‌చ్ఛందం అని మీరు చెప్పేది అబ‌ద్ధ‌మా? అధికారుల బెదిరింపులు నిజ‌మా? అనేది స్ప‌ష్ట‌త‌నివ్వాలి. భూమి, కుటుంబంలో ప్ర‌భుత్వ ఉద్యోగం, 300 యూనిట్లు దాటిన క‌రెంటు బిల్లు, కుటుంబంలో వారికి ద్విచ‌క్ర‌వాహ‌నాలున్నా, స‌చివాల‌యాల్లో వివ‌రాలు అప్‌డేట్ చేసుకోని కార‌ణంగా అమ్మఒడి, రేష‌న్‌, పింఛ‌న్లు, సంక్షేమ‌ప‌థ‌కాలను గిరిజ‌నుల‌కు అంద‌కుండా చేశారు.
girijana2గిరిజన ప్రాంతాల్లో ఒక ఊరిలో సుమారు 100 కుటుంబాలుంటే, 15 కుటుంబాల‌ను ఇలా అన‌ర్హులుగా తేల్చి సంక్షేమ‌ప‌థ‌కాల‌న్నీ ఆపేశారు. ప్ర‌భుత్వం మైదాన‌, ఏజెన్సీ ప్రాంతాల మ‌ధ్య తేడాలేకుండా తెచ్చిన జీవో వ‌ల్ల కొన్నినెలల నుంచి రేషన్ బియ్యం, పించన్లు అందక ఆదివాసీలు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. గిరిజ‌నులు త‌మ స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మీరు అందుబాటులోకి తెచ్చిన స‌చివాల‌యాలే గిరిజ‌నుల‌కి స‌మ‌స్య‌ల వ‌ల‌యంలోకి నెట్టేస్తున్నాయి. అన్ని అర్హ‌తలున్నా..వార్డు స‌చివాల‌యాలు, వ‌లంటీర్ల నిర్ల‌క్ష్యంతో ప‌థ‌కాల‌కు దూర‌మైన ఆదివాసీల ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం.
రాష్ట్ర‌వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఈ స‌మ‌స్య‌లు త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల‌కు సంక్షేమ‌ప‌థ‌కాల అర్హత నిబంధ‌న‌లను స‌వ‌రించి కొత్త జీవోలు ఇవ్వాలి. అవ్వాతాల‌కు, వితంతుల‌కు, దివ్యాంగులైన ఆదివాసీల‌కు నిలిపేసిన పింఛ‌న్లు పున‌రుద్ధ‌రించాలి. రేష‌న్ బియ్యం క్ర‌మంత‌ప్ప‌కుండా పంపిణీ చేయాలి. రికార్డుల్లో త‌ప్పుగా న‌మోదైన భూములు వివ‌రాలు స‌రిచేయాలి. నిర‌క్ష‌రాస్యులైన ఆదివాసీలను ఈకేవైసీ, అప్‌డేష‌న్ అంటూ అన‌ర్హుల‌ని చేసే అనాలోచిత నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకోవాలి.

నారా లోకేష్‌
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

LEAVE A RESPONSE