దేశంలో నిర్లక్ష్యం తాండవిస్తుంది. మానవ తప్పిదాలకు కొదవే లేదు. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూరు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆరు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకులు కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. నాలుగు నెలల క్రింద శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది.
కరెంట్ కాటు ఆరుగురిని బలి తీసుకుంది. ఆటోపై విద్యుత్ తెగ పడిటంతో కరెంట్ షాక్ తగిలింది. మంటలు రావడంతో ఆటో తగలబడింది. కూలీ పనులకు వెళుతున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీలు చనిపోయారనే ఆరోపణలు వచ్చాయి. నిన్న రైల్లో తొక్కిసలాట పలువురికి తీవ్ర గాయాలు. మొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది యువకులు బలి. ప్రతి నెల కూలీలను తరలిస్తున్న ఆటో ప్రమాదంలో మరణించిన వారు, బోరు బావుల్లో పడి మరణిస్తున్న పిల్లలు. విహార యాత్రకు వెళ్లి విషాదాంతమైన బతుకులు.
మొన్న మానవతప్పిదం వలన గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. కిక్కిరిసిన సందర్శకులతో ఉన్న కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కుప్పకూలిపోయింది. మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 141 మంది దుర్మరణం పాలయ్యారు ఇంకా కొన్ని శవాలు బయటపడనున్నాయి. రెండు సంవత్సరాల క్రిందట పాపికొండలు సందర్శించడానికి వెళ్లి యాభయ్ మంది జలసమాధి అయ్యారు. పర్యావరణ ప్రమాదాలకు లెక్కేలేదు.
విషవాయువులు పీల్చి అనంతవాయువులలో కలుస్తున్నారు. ఈ సంవత్సరం పారిశ్రామిక ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలలో ముందు స్థానాలలో రెండు తెలుగు రాష్ట్రాలు. హైదరాబాద్ భోయిగూడ గుజిరీ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన పన్నెండు మంది మృత్యువాత పడ్డారు ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. దేశంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురాకుండా, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన వసతి కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద వహించక పోవడంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో 2019లో 22,442 విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోగా- 13,432 మంది చనిపోయారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 908, తెలంగాణలో 735 మంది చొప్పున ఉన్నారు. ఇవికాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మరో 1,990 మంది ప్రాణాలు కోల్పోయారు. సగటున రోజుకు 43 మంది విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వీరిలో అధికశాతం చేతి వృత్తిదారులు, రైతులే కావడం కలవరపరచే అంశం. రోజుకు 15 మూగజీవాలు విద్యుదాఘాతాలకు బలి అవుతున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) లెక్కలు తెలియజేస్తున్నాయి.
సహజంగా లేదా గాలి దుమ్ము, భారీ వర్షాలు, తుపాన్లు వంటివి సంభవించినప్పుడు- నేలపై పడిన తీగలను, స్తంభాలను, సపోర్ట్ తీగలను తాకరాదు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరకు వెళ్ళకూడదు. విద్యుత్ సమస్యలుంటే నిపుణులైన సిబ్బందికి సమాచారం అందించాలే తప్ప స్థానికులు సొంతంగా మరమ్మతులు చేయకూడదు. విద్యుత్ తీగల కింద ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు. బోర్లు వేయరాదు. ముఖ్యంగా పట్టణాల్లో చేతికందే దూరంలోనే కరెంటు సరఫరా తీగలు ఉండటం ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతోంది. లైన్ల కింద నుంచి ఎత్తయిన వాహనాలు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యుత్ తీగలకు దగ్గరలో పతంగులను ఎగుర వేయకూడదు. పిల్లలకు విద్యుత్ పరికరాల వాడకంపై అవగాహన పెంచాలి. నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ముప్పు సంభవిస్తుందో వివరించాలి. భారత్‌లో విద్యుత్ సంస్థలు ఏటా మే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తూ ప్రజల్లో, సిబ్బందిలో విస్తృత అవగాహన కల్పిస్తూ ఎందరినో జాగృతం చేస్తున్నాయి. పరికరాల తయారీదారులు, విద్యుత్ సంస్థల క్షేత్రస్థాయి సిబ్బంది, పరిశ్రమల కార్మికులు, వినియోగదారులు భద్రతా ప్రమాణాలు పాటించినట్లయితే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.
విద్యుత్ పంపిణీ సంస్థలు ఎల్టీ, హెచ్‌టీ లైన్లను కనిష్ఠంగా 19 అడుగుల ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ కట్టడాలు, చెట్ల నుంచి కనీసం నాలుగు అడుగుల దూరంలో ఏర్పాటు చేయాలి. ట్రాన్స్ఫార్మర్లను ఆరడుగుల ఎత్తులో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నెలకొల్పాలి. జనావాసాలు, రోడ్లపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలి. వేలాడే తీగలను ఎప్పటికప్పుడు సరిచేయడం, తుప్పు పట్టిన, కాలం చెల్లిన స్తంభాలను మార్చడం ముఖ్యం. విద్యుత్ లైన్లలో మరమ్మతులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేట్లు చూడాలి.
విద్యుత్ సిబ్బంది లైన్లపై పని చేసే ముందే ఎర్తింగ్ సరిచూసుకోవాలి. ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు రెండు ట్రాన్స్ఫార్మర్లను నిశితంగా గమనించాలి, హైవే , జాతీయ రహదారులపై వెలసిన ట్రాన్స్ఫార్మర్లు చెట్లు, తీగలతో కప్పబడి ఉంటున్నాయి. ఇక మారుమూల ఉన్న ట్రాన్సఫార్మర్లు ఎలా ఉంటాయో ఊహించగలం. ప్రతి ట్రాన్సఫార్మర్ దగ్గర న్యూట్రల్ సున్నా ఉండాలి. కానీ 20 నుండి 60 చూపుతుంటుంది.
ఇళ్లల్లో వోల్టేజి 260 ఉంటున్నది, హై వోల్టేజి కారణంగా గృహోపకరణాలు తరచూ మరమ్మత్తులకు గురైతున్నాయి. అధికారులు రైతులకు ఉరితాడు బిగించడంలో ఉన్న శ్రద్ధ మెయింటెనెన్స్ పై చూపడం లేదు. అధికారుల అలసత్వానికి నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రహదారులు నరకప్రాయంగా తయారయ్యాయి. బస్టాండులు, ప్రభుత్వ కార్యాలయాలు పెచ్చులూడుతున్నాయి. చెరువులు కుంటలు తలపిర్లు ఊటలు గట్లు తెగుతున్నాయి. భవిష్యత్తు అవసరాలకు నీటిని ఒడిసి పట్టుకునే పద్దతి పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో చెరువులు గండ్లు పడి మైదానాలను తలపిస్తున్నాయి. ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అన్ని శాఖలు సిబ్బంది లేక, సమన్వయము లేక, నిధులు లేక నిస్తేజంగా ఉన్నాయి.
