Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన

-ఆఫ్రికా దేశాల్లోని ఆటవిక వాతావరణాన్ని తలపించేలా ఏపీలో పరిస్థితులు
-ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదు
-మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మాచర్ల ఘటన చూసిన తర్వాత ఏపీలో ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం ఏర్పడుతోంది.జూలకంటి బ్రహ్మానంద రెడ్డి బలమైన నాయకత్వాన్ని వైసీపీ జీర్ణించుకోలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతోంది.ముమ్మాటికే ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన అరాచక ఘటనే.

మాచర్ల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.అరాచక శక్తులు వచ్చే అవకాశం ఉందని, ముందుజాగ్రత్తగానే కార్డన్ సెర్చ్ నిర్వహించామని పల్నాడు ఎస్పీ సెలవిచ్చారు.ముందే తెలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించి పోలీసులు ఏం సాధించారు.వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?అరాచక శక్తుల ఆగడాలతో మహిళలు, తల్లీబిడ్డలు వంటిళ్లలో దాక్కుని ఏడుస్తున్నా ఊరుకోకుండా విధ్వంసం కొనసాగించారు.ఇలాంటి పరిస్థితులు ఏపీలో చూస్తామని అనుకున్నామా?

ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఇలాంటి అరాచక శక్తులను అక్కడి ప్రభుత్వాలు అణిచివేసి ప్రశాంత వాతావరణం తెచ్చాయి.అన్నపూర్ణ లాంటి ఏపీలో మాత్రం అరాచకాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటం దురదృష్టకరం.ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్థితులు ఏపీలో నెలకొనడం బాధాకరమైన విషయం.

తెలుగుదేశం పార్టీని అణిచివేయడంతో పాటు వేలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయించి వచ్చే ఎన్నికలకు వారిని దూరం చేసే కుట్రలో భాగమే ఈ అరాచక పర్వం.శాంతి భద్రతలతో పాటు అనేక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను మూటగట్టుకుంది. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం తగదు.ప్రశాంత వాతావరణంలో పాలన సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

LEAVE A RESPONSE