Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి మాగుంట గుడ్‌బై

– పార్టీకి రాజీనామా
– ఆత్మగౌరవమే ముఖ్యమన్న మాగుంట
– ఒంగోలు బరిలో కొడుకు దిగుతారని ప్రకటన
– వైసీపీకి ఎంపీల వరస షాకులు

అధికార వైసీపీకి వరస వెంట షాకులు తగులుతున్నాయి. తాజాగా ఒంగోలు సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇది ప్రకాశం జిల్లాలో వైసీపీకి వజ్రాఘాతమే. తనయుడు మాగుంట రాఘవరెడ్డి రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మాగుంట వెంట భారీ సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా ఒంగోలు ఎంపి పరిథిలో వైసీపీ అభ్యర్ధుల గుండెలో రాయి పడినట్లయింది.

కాగా మాగుంట కుటుంబానికి పదవుల కన్నా ఆత్మగౌరవం-మర్యాద ముఖ్యమని మాగుంట తన లేఖలో పేర్కొన్నారు. అవి లేనిచోట మాగుంట కుటుంబం ఉండదని స్పష్టం చేశారు. తనకు సహకరించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబాన్ని 30 ఏళ్ల నుంచి ప్రకాశం జిల్లా ఆదరించిందని గుర్తు చేశారు.

కాగా వైసీపీకి ఎంపీల రాజీనామాల వరద కొనసాగుతోంది. నర్సరావుపేట ఎంపి లావుకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరుతున్నారు. నేడో రేపో ఆయన చంద్రబాబు సమక్షంలో, పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నర్సరావుపేట ఎంపీగా ఆయన పేరు దాదాపు ఖరారయింది.

ఇక కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్‌కుమార్ కూడా రాంరాం చెప్పేశారు. జగన్ చెప్పే బీసీ కబుర్లన్నీ ఉత్తిదేనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో సామాజికన్యాయం శూన్యమని విమర్శించారు. వీరికంటే ముందే.. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన నెల్లూరు జిల్లా రాజ్యసభ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీకి ఝలక్ ఇచ్చారు. పార్టీ కోసం వేమిరెడ్డి చాలా ఖర్చు చేశారు. అలాంటి ఆయన ఈపాటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు. భార్యతో సహా ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

నెల్లూరు టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అదే జిల్లాకు చెందిన మరో సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. దానిని ఆయన ఖండించారు. అయితే గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పక్కనే చివరివరకూ ఉండి, బిల్లులు రాగానే బస్సు దిగి.. వైసీపీలో చేరిన ఆదాల ప్రకటనను వైసీపీ వర్గాలు విశ్వసించడం లేదు.

కాగా జగన్‌పై నాలుగేళ్ల క్రితమే తిరుగుబాటు బావుటా ఎగురవేసి, వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై, తరచూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ తలనొప్పిలా తయారైన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు కూడా, తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడయిన బందరు ఎంపీ బాలశౌరి కూడా పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు షాక్ ఇచ్చారు. ఆయనకు జగన్‌తో వ్యాపారసంబంధాలున్నాయన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. వ్యాపార వ్యవహారాల్లో కూడా ఆయన జగన్‌కు ఝలక్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రఘరామకృష్ణంరాజును అనర్హుడిని చేసేందకు జగన్, ఆయననే ప్రయోగించారు.

రఘురామకృష్ణంరాజుని స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి తొలగించి, బాలశౌరిని నియమించాలని గతంలో జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అసలు పార్లమెంటరీపార్టీ నేత సిఫార్సు లేకుండానే, రఘరామకృష్ణంరాజుకు ఆ పదవిని లోక్‌సభ స్పీకర్ ఇవ్వడం విశేషం. గమ్మతుగా ఇప్పుడు ఇద్దరూ పార్టీ వీడి.. పొత్తు పార్టీల్లో చేరారు.

ఏదేమైనా ‘వైనాట్ 175’ నినాదంతో బరిలోకి దిగిన జగన్‌కు.. అత్యంత సన్నిహితులయిన ఎంపీలే పార్టీకి రాజీనామా చేస్తుండటం, వైసీపీకి ప్రమాదఘంటికలేనని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ‘‘మళ్లీ గెలుస్తామన్న ధీమా ఉన్నవారెవరూ పార్టీని వీడరు. ఎందుకంటే ఒకవేళ టికెట్ రాకపోయినా, మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉంటుంది కాబట్టి! మరి ఎంపీలు-ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలు వరసపెట్టి రాజీనామాలు చేసి, ఎవరిదారి వారు చూసుకుంటున్నారంటే మళ్లీ పార్టీ అధికారం రాదన్న అనుమానమే కదా’’ అని, బాపట్ల జిల్లాకు చెందిన ఓ సీనియర్ ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించారు. తాను కూడా ఈ పార్టీలో ఉండాలా? వద్దా అని ఆలోచిస్తున్నానంటూ సదరు పెద్దాయన మరో బాంబు పేల్చారు.

LEAVE A RESPONSE