Suryaa.co.in

Telangana

రాష్ట్రంలో రోడ్లకు మహర్ధశ

• తక్షణ మరమ్మత్తులు, నిరంతర నిర్వహణతో రోడ్లు అద్దంలా మెరవాలి
• పంచాయతీ రాజ్ శాఖ పునర్వవస్థీకరణ..అదనపు నిధులకు సిఎం కేసిఆర్ హామీ
• అధికారులు, ఇంజనీర్లకు పదోన్నతులు- ఇబ్బందులకు ఫుల్ స్టాఫ్
• డిసెంబర్ 6వ తేదీనాటికి కొత్త ఎస్.ఈ ఆఫీసుల ఏర్పాటు
• డిసెంబర్ 15వ తేదీ నాటికి రోడ్ల మరమ్మత్తుల టెండర్లు పూర్తి కావాలి
• 3000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి
• వచ్చే ఏడాది పనులు, నిధుల ప్రతిపాదనలు కూడా తయారు చేయాలి
• వరదనీటితో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి
• రోడ్ల నిర్మాణంలో అటవీ భూముల సమస్యను గుర్తించి…తగిన ప్రతిపాదనలు రూపొందించాలి
• ప్రతి మూడు నెలలకు అటవీ భూముల్లో రోడ్ల నిర్మాణంపై ఇఎన్సీ సమీక్ష
• రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత పెంపు కోసం విదేశాల్లో అధ్యయనం చేయాలి
• పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ల వర్క్ షాప్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫర శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రగతి పథంలో వేగంగా దూసుకెళ్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రోడ్లమీద ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ ఎప్పటికప్పుడు చేపడుతూ వాటిని అద్దంలా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడా గుంతలు ఉండకూడదు, రవాణాలో ప్రజలకు అసౌకర్యం కలగకూడదని, దీనికోసం వెంటనే రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించిన నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో వర్క్ షాప్ నిర్వహించి దిశానిర్ధేశనం చేశారు.

పంచాయతీ రాజ్ శాఖ రోడ్లు అందంగా, అద్దంలా ఉండేందుకు పంచాయతీ రాజ్ శాఖను పునర్వవస్థీకరిస్తూ బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఈశాఖ రూపు రేఖలు మారుతాయని, మరింత బలోపేతం అవుతుందన్నారు. దీనిని మంచి అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం వెంటనే వారి, వారి స్థాయిల్లో వర్క్ షాప్స్ పెట్టుకోవాలని చెప్పారు. శాఖ పునర్వ్యవస్థీకరణ వేగవంతం చేసేందుకు దీనికి ఒక ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేసుకుంటే మంచిదని సూచించారు.

రాష్ట్రంలో 67 వేల కిలోమీటర్ల పి.ఆర్ రోడ్లు ఉన్నాయని,ఇందులో ప్రతి రోడ్డుని అద్దంగా ఉంచాలన్నారు. ఇందుకోసం పనిని విభజించి అన్ని స్థాయిల ఇంజనీర్లకు బాధ్యతలు, అధికారాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు నిర్ణయించారని వెల్లడించారు. శాఖ పునర్వవస్థీకరణకు అవసరం అయితే మరో వంద కోట్ల రూపాయలు పెంచాలన్నది సీఎం కేసిఆర్ ఆలోచనగా ఉందని, దీనికి వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని చెప్పారు.

రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణపై గౌరవ సీఎం గారు సీరియస్ గా ఉన్నారని తెలిపారు. డిసెంబర్ 6 వ తేదీ నాటికి కొత్త ఎస్. ఈ ఆఫీస్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ ప్రతిపాదనలు డిసెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాల్సిందేనన్నారు. వరదల్లో కొట్టుకు పోయిన రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొత్త రోడ్లకు కూడా ప్రతిపాదనలు రూపొందించాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలతో కలిసి కూర్చొని ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. కొత్త రోడ్లతో పాటు వాటి నిర్వహణ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలన్నారు.

ఈ ఏడాది 1500 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, దీనికి రెట్టింపుగా 3000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రానున్న ఏడాది రోడ్ల ప్రతిపాదనలకు కూడా ఈ ఏడాదే మంజూరు ఇచ్చుకుంటామన్నారు. తద్వారా రోడ్లు వేయడంలో జాప్యం ఉండదన్నారు. అటవీ భూముల్లో అవసరమైన చోట్ల బ్రిడ్జిలు కట్టాలని, అక్కడ ఉన్న ఇబ్బందులు గుర్తించి తొలగించే విధంగా తగిన ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. దీనిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంజనీర్ ఇన్ ఛీప్ సమీక్ష నిర్వహిస్తారన్నారు.

రోడ్ల నిర్మాణంలో నూతన ఆధునిక విధానాలు అమలు చేయాలని, దీనివల్ల రోడ్ల నాణ్యత…వాటి జీవితకాలం బాగా పెరుగుతుందని చెప్పారు. ఇందుకోసం విదేశాల్లో పర్యటించి అక్కడి రోడ్ల నిర్మాణా విధానాలను అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. బిటి రోడ్ల ఖర్చు పెరుగుతున్నందున ఇక్కడే స్టాక్ యార్డ్ పెట్టి వాటి ఖర్చు తగ్గించే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.ప్రతిపాదనలు సిద్ధం చేసిన తర్వాత మళ్లీ ఈ నెల 22వ తేదీన సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానీయా, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరావు, చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, అధికారులు, పాల్గొన్నారు.

LEAVE A RESPONSE