మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి ఛాతీలో నొప్పి : ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన కుమారులు, బంధువులు, బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ‍క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ దాడుల సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి.

నా కుమారుడిని సీఆర్‌పీఎఫ్‌ దళాలతో కొట్టించారు :తెలంగాణ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి సంపాదించి నిజాయితీగా మెలిగానన్నారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. బీజేపీ అక్రమంగా దాడులు చేయిస్తోంది. దాడులకు బెదిరేది లేదు. నా కుమారుడు ఆస్పత్రిలో చేరాడు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా కొట్టించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply