– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 14: ఏపీ సీఎం కప్ టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ సీఎం కప్ టోర్నీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటే రత్నదాస్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ళ లోపు వయస్సు కల్గిన యువతీ, యువకులకు చదువుతో నిమిత్తం లేకుండా 13 క్రీడాంశాల్లో ప్రభుత్వం పోటీలను నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో పురుషుల, మహిళల విభాగాల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పోటీల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేస్తారని చెప్పారు.
దీనిలో భాగంగా ఈ నెల 25 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏపీ సీఎం కప్ టోర్నీ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేస్తారన్నారు. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడ పట్టణంలోనే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో 13 జిల్లాల నుండి పురుషుల, మహిళల జట్లు తలపడతాయన్నారు. జిల్లా కబడ్డీ పోటీల నిర్వహణ ఏర్పాట్లను మంత్రి కొడాలి నానికి వివరించారు. ముందుగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పయనించకుండా క్రీడల వైపు దృష్టిని మరల్చేందుకు శాప్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం కప్ టోర్నీ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఇటువంటి పోటీల ద్వారా గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యం మరింత మెరుగుపడుతుందని, తద్వారా అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, వైసీపీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వెంపటి సైమన్, కే దిలీప్, యార్లగడ్డ సత్యభూషణ్, పీ బెన్ను తదితరులు పాల్గొన్నారు.