– నిజాంసాగర్ ప్రాజెక్టు కు సాగునీరు ఆందించే మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను, మరియు కాలువ, టన్నెల్ నిర్మాణాలను బాన్సువాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి
ముందుగా కుకునూరుపల్లి సమీపంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను, కాలువకు నీరందించి హెడ్ రెగ్యులేటర్ ను పరిశీలించిన స్పీకర్ పోచారం గారు అనంతరం గజ్వేల్ మండలం కేసారం, గిరిపల్లి, రాయపోల్ మండలం వీరా నగర్ వద్ద టన్నెల్, కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మల్లన్న సాగర్ వద్ద మరియు వీరా నగర్ సమీపంలోని టన్నెల్ లో స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ…ఏ దేశం, సమాజం బాగు పడాలన్నా నీరు ప్రధానం. త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇంత గొప్పగా ఆలోచన చేసిన మొదటి వ్యక్తి భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ గారు అయితే, తరువాత కేసీఆర్ గారే.
ఇదో గొప్ప ఆలోచన.తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ఆలోచన ఎవరికి రాలేదు.గతంలో కమీషన్ల కోసమే కాలువలు తవ్వేవారు. నీళ్లు వచ్చింది లేదు, ఇచ్చింది లేదు. అసాధ్యాన్ని సుసాద్యం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ . ముఖ్యమంత్రి సూచనతో ఈరోజు మల్లన్న సాగర్ ను పరిశీలించడానికి వచ్చాం. నా 47 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను, నాయకులను చూశాను. కానీ పట్టుదలతో ప్రజల సమస్యలను తీర్చుతున్న ఏకైక నాయకుడు కేసీఆర్ . తల్లిని పిల్ల దగ్గరకు చేర్చినట్లుగా గోదావరి నీళ్ళను మంజీర నదిలోకి తీసుకువచ్చారు. గోదావరి నదిలో ఏటా 1600 కు పైగా TMC ల జలాలు వృదాగా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీ లను నిర్మించి అక్కడి నుండి నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా అనంత సొగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల లోకి మళ్ళిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.75 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుతో పాటుగా వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. వాగులు, చెరువులు,ఎత్తిపోతల కింద మరికొంత సాగవుతుంది13 జిల్లాలు 31 నియోజకవర్గాల లోని 50 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది సస్యశ్యామలం అవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా 150 నుండి 200 TMC ల నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు నిర్మించారు.ఒక ఏడాది వర్షాలు లేకపోయినా రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటితో పంటలు సాగు చేయవచ్చు.ఇంత మంచి ప్రాజెక్టును చూసి కొంతమంది అవాక్కులు, చెవాక్కులు మాట్లాడుతున్నారు. వాళ్ళు మంచి పనులు చేయరు, చేసే వాళ్ళను చూసి ఓర్వరు. శంకుస్థాపన రోజ ఇంత పెద్ద ప్రాజెక్టు మూడు ఏళ్ళలో పూర్తి చేస్తామంటే ఆశ్చర్యం పోయాం, కానీ ముఖ్యమంత్రి పట్టుదలతో పూర్తి చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలకు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహాదూర్ శాస్ర్తీ గార్ల పేరు పెట్టారు. అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి వచ్చే కాలువలకు కేసీఆర్ పేరు పెట్టాలని నాతో పాటుగా రైతుల అభిప్రాయం.
ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించి, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టడం సమంజసం.కేసీఆర్-1 కెనాల్, కేసీఆర్-2 కెనాల్ అని పేర్లు పెట్టాలి. అప్పుడు వారి రుణం కొంతైనా తీరుతుంది. కనిపించే దేవుడు కేసీఆర్ . సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉన్నది. దేశంలో వృదాగా పోతున్న వేల TMC ల నీటిని ప్రాజెక్టులు నిర్మించి ఉపయోగించుకోవాలి. అప్పుడే దేశంలో కరువు, రైతుల కష్టాలు పోతాయి.దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం భవిష్యత్తులో కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే అవకాశం ఉన్నది.
మల్లన్న సాగర్ నుండి 6000 క్యూసెక్కుల కెపాసిటీతో కాలువను డిజైన్ చేశారు.ఇందులో 3000 క్యూసెక్కులు హల్ధీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి, మరో 3000 క్యూసెక్కులు సింగూరు ప్రాంతానికి వెల్తాయి.సింగూరు ప్రాంతానికి అవసరం లేనప్పుడు 6000 క్యూసెక్కులు హల్ధీ ద్వారా నిజాంసాగర్ లోకి మళ్ళించవచ్చు. ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ ద్వారా 1000 క్యూసెక్కుల గోదావరి నీళ్ళు నిజాంసాగర్ లోకి వస్తున్నాయి. ఈ 24 కిమీ కాలువ, టన్నెల్ ద్వారా మల్లన్న సాగర్ నుండి 6000 క్యూసెక్కుల నీళ్ళు హల్ధీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తాయి.ఈ కాలువ ద్వారా 12 నియోజకవర్గాలలోని పది లక్షల ఎకరాల భూములకు ప్రత్యేకంగా, పరోక్షంగా సాగునీరు అందుతుంది.
70 మీటర్ల లోతులో టన్నెల్ నిర్మాణం జరుగుతున్నది.గ్రావిటీ ద్వారానే నీళ్ళు ప్రవహిస్తాయి.నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు పుష్కలంగా నీళ్ళు అందుతాయి.అందరి శ్రమ, కృషి తోనే ఇంత గొప్ప ప్రాజెక్టు సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇల్లు, భూములు కోల్పోయి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా.మల్లన్న సాగర్ మా ప్రాణం, కేసీఆర్ మాకు దేవుడు.బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడుగా మా ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించే పనులను చూడడానికి మా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి వచ్చాను.రైతుల శ్రేయస్సు, అవసరాల దృష్ట్యా రాత్రింబవళ్లు పనులను జరిపి జూలై చివరి నాటికి పనులను పూర్తి చేయాలని గుత్తేదారు ను కోరుతున్నాను.
జుక్కల్, నర్సాపూర్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, చిలుముల మదన్ రెడ్డి, అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సాగునీటి శాఖ Enc మురళీదర్, CE అజయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, సిబ్బంది స్పీకర్ పోచారం వెంట ఉన్నారు.