-పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్
-ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైనబుల్ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ -మేనేజ్‌మెంట్ పై స్వచ్చాంధ్ర కార్పోరేషన్ సదస్సు
-ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అత్యావశ్యకం : గంధం చంద్రుడు
విజయవాడ: ఘన వ్యవర్ధాలను ఉప ఉత్పత్తులుగా మార్చటం ద్వారా వాటి నిర్వహణ సులభతరం అవుతుందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ శనివారం విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో “ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైనబుల్ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ఎస్ఎల్ఆర్ఎం)” ప్రాజెక్ట్ నమూనాలపై జిల్లా అధికారులను నిర్దేశించి ఒక రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
ప్రభుత్వం చేపట్టిన “చెత్త నుండి సంపద” విధానాన్ని ప్రధానంగా వర్క్‌షాప్ నొక్కి చెప్పింది. స్వచ్చ ఆంధ్ర కార్పోరేషన్ ఎండి గంధం చంద్రుడు మాట్లాడుతూ ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అత్యావశ్యకమన్నారు. ప్రతి గ్రామం ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ఇందుకు అవసరమమైన అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.
కార్యక్రమంలో కీలకోపన్యాసం ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైనబుల్ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు సి. శ్రీనివాసన్ పురపాలక, గ్రామీణ ప్రాంతాల ఘన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా సంపదగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు . సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన వివిధ పద్ధతులు సాదోహరణంగా ప్రదర్శించారు. ఘన వ్యర్థాలను కాలక్రమేణా కుళ్ళిపోయేలా వదిలివేయడం వల్ల కలిగే ప్రభావాలను వివరించారు.
ప్రజలు, పిల్లలు, పక్షులు, జంతువులు, సమాజంపై ప్రభావం చూపుతుందని దీనిని సమర్ధవంతంగా నివారించవలసి ఉందన్నారు. ఈ ప్రక్రియలో విజయం సాధించడానికి విశ్వసనీయమైన పద్ధతులను అనుసరించాలని, ప్రభుత్వం, ప్రజల నుండి మద్దతు తప్పనిసరని శ్రీనివాసన్ తెలిపారు. ఈ క్రమంలో ముందుగా వారికి అవగాహన కల్పించాలన్నారు.
టాటా ట్రస్ట్ ప్రతినిధి మనోజ్ గ్రామాలకు నమ్మదగిన, స్థిరమైన ద్రవ వ్యర్థాల నిర్వహణ సూత్రాలను అందించారు. ఆర్థికంగా లాభదాయకమైన నమూనాల ద్వారా ద్రవ వ్యర్థాలను పర్యావరణపరంగా సురక్షితమైన మార్గంలో, శుద్ధి చేసిన నీటిగా మార్చడానికి అనుసరించవలసిన పద్దతులను వివరించారు.
పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ శాఖ కమీషనర్ సూర్యకుమారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, ఆన్ లైన్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ప్రభుత్వ అధికారులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. స్వచ్చ ఆంధ్ర కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఊర్మిళా దేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.