Suryaa.co.in

Political News

గడప గడపకూ….. వారు కాదేమో!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడప కూ మన ప్రభుత్వం ‘ అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎం.ఎల్.ఏ తన నియోజక వర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రభుత్వం గత మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాటితో పాటు, లబ్ధిదారులకు తనCM-Jagan-Review-on-Gadapa-Gadapaku-Mana-Prabhutvam-Work-Shop-1 సందేశం కూడా చేరవేయాలానేది ముఖ్యమంత్రి అభిమతం.అయితే, తాను అభిలషించిన విధంగా ఈ ఎం.ఎల్.ఏ లు ఈ కార్యక్రమలో పాల్గొనడం లేదని సీ.ఎం ఇటీవల జరిగిన ‘వర్క్ షాప్ ‘లో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. వచ్చే ఆరు నెలల్లో వాళ్లంతా గడప గడపకూ వెళ్ళాల్సిందేనని.. అలసత్వం ప్రదర్శించేవారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనని కూడా తెగేసి చెప్పారు.

అయితే, ఇది వైస్సార్ సీపీ చేపట్టిన కార్యక్రమం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. సంక్షేమ పధకాలు అందించింది కూడా వైసీపీ పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.కనుక, రాష్ట్రంలోని గడప గడపకు వెళ్లి, సంక్షేమ పధకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా… లేదా? లోటు పాట్లు ఏమిటి? ప్రభుత్వం ఇంకా ఏమి చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు? వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అవి ఎందుకు పరిష్కారం కావడం లేదు? మొదలైన వివరాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదించవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. అంటే – కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వి ఆర్ ఓ లు, గ్రామ -వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు. రాష్ట్రంలోని 150 నియోజక వర్గాల్లోనే వైసీపీ ఎం.ఎల్.ఏ లు ఉన్నారు. మరి, మిగిలిన 24 నియోజక వర్గాల్లో ఈ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ? ఆ నియోజక వర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదా? ఆ నియోజక వర్గాల్లో లబ్ధిదారులు లేరా?

అందుకే, ఈ పథకం కింద ఇంటింటికీ వెళ్లి, ముఖ్యమంత్రి సందేశాన్ని అందించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి అప్పగించాలి. జిల్లాలలో కలెక్టర్. కలెక్టర్ చేతిలో అధికారం ఉంటుంది. ప్రభుత్వ శాఖలు ఉంటాయి. వివిధ పద్దుల కింద సొమ్ములు ఉంటాయి. వాటిని ఎలా ఖర్చు పెట్టాలానే విచక్షణాధికారం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే – పనిచేసే జిల్లాకు ఆయనే/ఆమే రాజు. మంత్రి కూడా. అందుకని,నెలకు ఇన్ని గడపలకు కలెక్టరు నుంచి వాలంటీర్ వరకు వెళ్లాలని టార్గెట్ లు నిర్దేశించాలి. దాని వల్ల ముఖ్యమంత్రి జగన్ సందేశం 150 నియోజకవర్గాలలోని ప్రతి గడుపకు మాత్రమే పరిమితం కాకుండా , మొత్తం 175 నియోజక వర్గాలకూ చేరుతుంది.

ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి, పోలీస్ యంత్రాంగం సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. లబ్ధిదారుల చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ప్రభుత్వ సిబ్బంది ఆగమేఘాలపై కదులుతారు.

ఇక, ఎం.ఎల్.ఏ లను పార్టీ ప్రచారం కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. నియోజక వర్గాలలో ఊరేగింపులు, బహిరంగ సభలు, గ్రామాలలో పాదయాత్రలు, ప్రభుత్వ సంక్షేమ పధకాలకు సంబంధించిన కరపత్రాల పంపిణీలు గట్టిగా చేయించవచ్చు. అటువంటి కార్యక్రమాలయితే నేతలు హుషారుగా పాల్గొంటారు. ఆ హుషారును బట్టి, వారికి జనంలో వ్యక్తమయ్యే స్పందనను బట్టి, వారికి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది ముఖ్యమంత్రి నిర్ణయించుకోవచ్చు.

దీనివల్ల, ఆయా నియోజక వర్గాలలో వైసీపీ గ్రూపులు పరిస్థితి ఏమిటి అనేది కూడా ముఖ్యమంత్రి దృష్టికి వస్తుంది.ఇది పార్టీ కార్యక్రమం. గడప గడపకూ అనేది ప్రభుత్వ కార్యక్రమం. రెండూ సమానాంతరంగా చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఎవరు చేసే పని వారు చేస్తేనే అందం…చందం.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE