ఇందిరమ్మ పార్టీకి ఇంతే సంగతులేనా!?

సోనియా తాళం..
రాహుల్ చెవి..
చెవి పోయిన తాళం..
బ్యాండు మేళం..!

అచ్చంగా అదే కాకపోవచ్చు..
అదే పేరు..
అదే నాయకులు..
అసలుకు మంగళం పలికి జిరాక్స్ కాపీగా అవతరించిన పార్టీ..ఇందిరా కాంగ్రెస్..
దేశానికి స్వరాజ్యం తెచ్చిపెట్టిన కాంగ్రెస్ ను భూస్థాపితం చేసి మహానాయకి ఇందిరా గాంధీ పురుడుపోసిన పార్టీ..
ఇప్పుడు తానుగా భూస్థాపితం కాబోతోందా..!
ఘన చరిత్ర త్వరలో సమాప్తమేనా..!?
ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే ముందు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రను సింహావలోకనం చేసుకుందాం..
స్వరాజ్యం అనే అతి పెద్ద అవసరాన్ని అనుసరించి పుట్టింది కాంగ్రెస్ పార్టీ..
మహామహులు పెంచి పోషించగా స్వరాజ్య సముపార్జనలో అత్యంత కీలకంగా వ్యవహరించి
స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకచక్రాధిపత్యంగా ముప్పై ఒక్క సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్..ఈలోగా పార్టీలో నెహ్రూ యుగం..

నెహ్రూ గాంధీ కుటుంబ పరంపరకు శ్రీకారం జరిగింది.నెహ్రూ..శాస్త్రి ఏలుబడుల అనంతరం జవహర్ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఇందిరా గాంధీ ఆనాటి నుంచి పార్టీని..ప్రభుత్వాన్ని పూర్తిగా తన అజమాయిషీలోకి తెచ్చుకున్నారు.అదే క్రమంలో తన ఆధిపత్యానికి భంగం వాటిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీలో చీలిక తెచ్చి మొత్తానికి పూర్తిగా తన ముద్రతో.. ఆమోదముద్రతో నడిచే ఇందిరా కాంగ్రెస్ పార్టీకి పురుడు పోశారు ఇందిరా గాంధీ..హస్తం గుర్తుతో ఆధిపత్యం చెలాయించిన ఇందిరా కాంగ్రెస్ కేంద్రంలోనే గాక మెజార్టీ రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన ఎన్నికల వరకు అప్రతిహతంగా అధికారం చెలాయించింది.

అయితే ఎమర్జన్సీ కాలంలో ప్రభుత్వం పనుపున సాగిన దారుణాల ఫలితంగా 1978లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా సర్కార్ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడింది.అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అయింది.

2004..ఎ సక్సెస్ స్టోరీ
సరే..అదంతా సుదీర్ఘ చరిత్ర.. ఏది ఎలా ఉన్నా మొన్న 2004లో ఇందిరా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక పార్టీలో సోనియా గాంధీ హవా గతంలో అత్త ఇందిర…భర్త రాజీవ్ గాంధీని మించి పెత్తనం చెలాయించారు.ఆ తల్లీ కొడుకుల హయాంలో వ్యవహారాలు ఒకే కుటుంబం అజమాయిషీలో నడిచినా పార్టీలో అసమ్మతి మాత్రం పెద్ద ఎత్తునే ఉండేది.అలా ఇందిర..రాజీవ్ లకు వ్యతిరేకంగా చాప కింద రాజకీయాలు నడిపిన..బహిరంగంగా గళమెత్తిన నాయకుల జాబితా చాంతాడంతే.. వారిలో కొందరు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కూడా.. కానీ సోనియా ఆధిపత్యం..కాంగ్రెస్ అధికారం చలామణి అయిన పదేళ్లలో అసమ్మతి అనే మాటే వినిపించలేదు. ఆమె మహారాణి..కొడుకు రాహుల్ యువరాజు.. అంతే…!

ఇక్కడే..ఇప్పుడే తప్పులో కాలు!
అయితే..ఈ దశలోనే పార్టీలో..ప్రభుత్వంలో ఒక పరంపరగా తప్పులు చోటు చేసుకోవడం మొదలైంది.ముఖ్యంగా పాలన విషయంలో..అంతకు ముందు 1991-96 మధ్య కాలంలో పి వి నరసింహారావు ప్రధాన మంత్రిగా పని చేసినప్పుడు ఆర్థిక దేశ ఆర్థిక మంత్రిగా అద్భుతాలు సృష్టించిన మన్మోహన్ సింగ్ తన ఆర్థిక నైపుణ్యతతో ప్రధానిగా దేశ గతినే మార్చేస్తారని జనం చాలా ఆశలు పెట్టుకున్నారు.

అయితే అది జరగలేదు.మన్మోహన్ పూర్తిగా స్వతంత్రం లేని వ్యక్తిగా.. అధినేత్రి చేతిలో కీలుబొమ్మ అన్నట్టు వ్యవహరించడంతో ఒకదాని వెంట ఒకటిగా తప్పులు జరుగుతూ వచ్చాయి.కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఆర్థికంగా అద్భుతాలు జరగడం సంగతి అటుంచితే దేశ ఆర్థిక స్థితి నానాటికీ దిగజారిపోయింది. 2004..2009 మధ్యనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావడం మొదలైనా అదృష్టం బాగుండో..విపక్షం బలంగా లేకపోవడమో.. మన్మోహన్ పై ఇంకా ఆశలు మిగిలి ఉండడమో.. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను అనుసరించి కాంగ్రెస్ అనుకూల పవనాలు బలంగా వీచడమో.. మరోసారి 2009 లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టారు.ఇది వాపే అయింది..కానీ బలుపనుకుని కాంగ్రెస్ విజృంభించి మరీ తప్పులు చేసి నెమ్మదిగా ప్రజల విశ్వాసం కోల్పోతూ వచ్చింది.

సోనియా..అతి..!రాహుల్ మితి!!అదేగా చితి!!!
ఇదిలా ఉండగా సోనియా గాంధీ వ్యవహార శైలి కూడా రెండో విడతలో పార్టీని ఇబ్బందుల పాలు చెయ్యడమే గాక ఇందిర కుటుంబాన్ని అధికారానికి దూరం చేసింది.1991..అంత వెనక్కి వెళ్ళవద్దు గాని 2004 లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం వచ్చినప్పుడు ఆమే ప్రధాని పదవి చేపట్టాలని పార్టీలో అన్ని వర్గాలు ఒత్తిడి చేసాయి.అయితే ఆమె అంగీకరించకపోగా కొడుకు రాహుల్ వైపు సైతం మొగ్గు చూపక మన్మోహన్ సింగ్ కు పెద్ద పదవి కట్టబెట్టారు..అయితే అధికారాలు మాత్రం అప్పగించలేదు.సర్థార్జీకి పార్టీ వ్యవహారాలు ఎటూ పట్టవు.ప్రభుత్వంలో కూడా దిష్టి బొమ్మగా మిగిలిపోయారు. 2009 తర్వాత ఈ పరిస్థితి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పలచన కావడం మొదలైంది. ఈలోగా 2009 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హఠాన్మరణం..తదనంతర పరిస్థితులు.. పరాకాష్టగా ఆంధ్రప్రదేశ్ విభజన ఇటు ఆంధ్రలో.. అటు కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో కూడా చావు దెబ్బ తిని కాంగ్రెస్ పార్టీ ఉభయ భ్రష్టం అయింది. అదే సమయంలో అవతల కర్ణాటక పరిణామాలు కూడా వికటించి దక్షణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఒకటొకటిగా ఎదురు దెబ్బలు తప్పలేదు.

ఈ పరిస్థితులు ఇలా ఉండగానే దేశవ్యాప్తంగా బిజెపి పుంజుకోవడం మొదలైంది.ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మొత్తానికే లెగ్ అయిపోయిందా అన్నట్టు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అతి దారుణమైన పరాభవం తప్పలేదు.ఆ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం కోల్పోవడమే గాక చాలా రాష్ట్రాల్లో కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ను చీల్చినందుకు కోపంతో ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా అటు ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు బ్రహ్మరథం పట్టాల్సింది పోయి తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ని ఘోరంగా తిప్పి కొట్టారు.కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో..అన్నట్టు ఎన్నెన్నో తప్పిదాల ఫలితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనంత కష్టాల్లో పడింది.ఈలోగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిస్థితులు కూడా దిగజారిపోతూ వచ్చాయి.రాష్ట్రాల్లో పార్టీ పూర్తిగా పట్టు కోల్పోవడమే గాక తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కూడా నామమాత్రమే అయిపోయింది.ఒక దశలో బద్ధ శత్రువు తెలుగుదేశం పార్టీతో తెలంగాణ ఎన్నికల్లో చెయ్యి కలిపినా ప్రయోజనం లేకపోయింది.

అన్నిటినీ మించి సోనియా అనంతరం నెహ్రూ..గాంధీ కుటుంబం ఆధిపత్యం అంతరించిపోనుందా అనే పరిస్థితి ఏర్పడడం ఊహించని పరిణామం. రాహుల్ ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. ఓహో అనుకున్న ప్రియాంక కూడా ప్రజలపై బలమైన ముద్ర వెయ్యలేకపోయారు.పార్టీలో ఉద్దండులతో కూడిన తరం నెమ్మదిగా తెరమరుగు అవుతుండగా రాష్ట్రాల్లో గాని..జాతీయ స్థాయిలో కాని ఘనాపాటీలు అనదగ్గ కొత్త తరం నాయకులు ఎవరూ కూడా కానరావడం లేదు.కేంద్రంలో 2019 లో మరోసారి శృంగభంగం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు దాపురించాయి.రాష్ట్రాలు చెయ్యి జారిపోయాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలలో ఘోర పరాజయాలు ఎదురయ్యాయి.రాహుల్ ఇంటింటికీ తిరిగినా..సోనియా ప్రతి ఇంటి తలుపు తట్టినా భంగపాటు తప్పలేదు.బాధ్యతల నుంచి సోనియా.. రాహుల్ ఇద్దరూ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుందామనుకున్నా తప్పించుకొలేకపోతున్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇతరులు సిద్ధంగా లేరు.పార్టీనే వదిలి వెళ్లిపోదామని అనుకుంటున్న వారు ముళ్ళ
కిరీటాన్ని ఎందుకు పెట్టుకుంటారు.ఒకరొకరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తో సహా కొన్ని రాష్ట్రాలలో ఉనికినే కోల్పోతున్న పార్టీ ఇక ఆయా రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి రావడం మాట అటుంచితే కనీసం తన వంతు ఓట్లు తెచ్చుకోవడం గగనమే అనుకునే పరిస్థితి.ఎప్పుడైతే రాష్ట్రాల్లో..కేంద్రంలో అంత బలమైన పార్టీ బలం కోల్పోవడం మొదలైందో ఆపుడు ఇతర శక్తులు
బలం పుంజుకున్నాయి.

రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా విరాజిల్లుతూ గతంలో మాదిరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడే పరిస్థితి లేదు.మరోపక్క కేంద్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపి 2014 ఎన్నికల్లో అంతకు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చినా 2019 లో కొంత సొంత బలం..ఇంకొంత కాంగ్రెస్ బలహీనత ప్రాతిపదికగా అధికార పీఠం ఎక్కింది.వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి.నిజానికి కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి పాలనపై నూటికి నూరు శాతం ప్రజలందరూ సంతృప్తితో లేకపోయినా ప్రత్యామ్నాయం కనిపించని నేపథ్యంలో మరోసారి జనం కమలంవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఇలాంటి పరిణామాల నడుమ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పరాభవం ఎదురైతే అయిదు వేళ్ళ చేతి గుర్తు పార్టీ అయిదు ప్లస్ అయిదు ప్లస్ అయిదు.. మూడైదులు.. పదిహేనేళ్ల పాటు ఆధికారానికి దూరంగా ఉండి ఇంక అటు తర్వాత ఉనికిని మిగుల్చుకునే పరిస్థితి ఉంటుందా..ఇప్పటికే జనాల్లో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని ఇంకో అయిదేళ్ల తర్వాత అప్పటికి కొత్తగా జాబితాలో చేరే నవతరం ఓటర్లు గుర్తిస్తారా..అంటే..కాంగ్రెస్ పార్టీ ఇక ఇంతే సంగతులా..
దేశరాజధానిలోని
24..అక్బర్ రోడ్డు..
ఢిల్లీ..110011..
చిరునామా గల్లంతేనా..
శాశ్వత బీగాలేనా..
హతవిధీ…!!

ప్రత్యేక కథనం
– ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్

Leave a Reply