– బాలశౌరికి కోపమొచ్చింది
– ఎంపీని రావద్దంటూ పేర్ని వర్గీయుల ర్యాలీ
– అందరి ఎంపీలదీ అదే గోస
– ఎమ్మెల్యేలకే పెత్తనమిచ్చిన జగనన్న
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన పార్లమెంటు సభ్యుడు. అంటే ఏడు నియోజకవర్గాల ప్రజలకు ఏకైక ప్రతినిధి. ఆయనకు పార్టీ టికెట్ తెచ్చుకునేముందు నుంచి.. కౌంటింగ్ పూర్తయ్యేవరకూ జేబు ‘మీటరు’ విష్ణుచక్రం మాదిరిగా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటి ఎలక్షన్ ట్రెండ్ ప్రకారం, ఆయనకయ్యే ఖర్చు కేవలం వంద నుంచి నూట ఇరవై కోట్లు. ఇంత ఖర్చు పెట్టి, ఎమ్మెల్యే అభ్యర్ధులకు నియోజకవర్గానికి ఇన్ని కోట్లని పంచేది ఎందుకంటే.. సదరు ఎమ్మెల్యే అభ్యర్ధి తన క్యాడర్ చేత, తనకూ ఓట్లు వేయించి స్టికర్లపై తన ఫొటో కూడా పెడతారన్న ఆశ. గెలిస్తే ఢిల్లీకెళ్లి ‘స్పీకర్ సాబ్’ అనొచ్చన్న ఇంకో చిన్న జీవితకాలపు కోరిక. ‘ఢిల్లీకెళితే ఆ కిక్కేవేరప్పా’ అన్న ఇంకో పెద్ద ఆశ. కాంట్రాక్టరయితే ఆలిండియా లెవల్‌లో ఏదైనా పెద్ద కాంట్రాక్టో, సబ్ కాంట్రాక్టో పట్టేయవచ్చన్న బిజినిసు యాపార అవుడియా. బోలెడుమంది బిగ్‌షాట్లు, కేంద్రమంత్రులతో పరిచయాలు పెంచుకోవచ్చన్న మరో దూరదృష్టి. అందుకే ఎంపీ టికెట్లపై అంత పోటీ, ఖర్చు.
మరి అన్ని కోట్లు తగలేసి గెలిచిన తర్వాత, తాను గెలిచిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమైనా గౌరవం దక్కుతుందా అంటే అదీ లేదు. ఎమ్మెల్యేలు కరివేపాకులా, పులుసులోముక్కలా తీసిపారేస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా సదరు ఎమ్మెల్యేకి చెప్పి పోవలసిందే. చివరాఖరకు ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల పెద్దమనిషయి ఆ ఫంక్షనుకు పిలిస్తే, అది కూడా ఎమ్మెల్యేలకు చెప్పి వెళ్లాల్సిందే. ఇన్ని ఆంక్షలు పెట్టే ఎమ్మెల్యేలకు మళ్లీ, ఎంపీ నిధులు మాత్రం కావాలి.
పక్కపిన్నులు, దువ్వెన్లు, పిన్నీసులు, బొట్టుబిళ్లలు అమ్ముకునేవారు కూడా స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు. కానీ చాలామంది అధికార పార్టీ ఎంపీలకు ఆ స్వేచ్ఛ కూడా లేదు ఫాఫం. ఇదీ ఏపీలో ఎంపీల విషాదం. పగవాడికి కూడా ఆ కష్టాలు వద్దనిపిస్తుంది. రామాయణంలో సీతమ్మవారికి లక్ష్మణుడు ఒక్కసారే లక్ష్మణరేఖ గీస్తాడు. కానీ వైసీపీ రామాయణంలో ఎమ్మెల్యేలంతా లక్ష్మణుల అవతారమెత్తారన్నది ఎంపీల గోస. దిసీజ్ వాస్తవం!
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు-ఎంపీల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంపీలను, అక్కడి ఎమ్మెల్యేలు కూరలో కరివేపాకులా తీసిపడేస్తున్న పరిస్థితి. తమ అనుమతి లేనిదే, నియోజకవర్గాలకు రావద్దని లక్ష్మణరేఖ గీస్తున్న అవమానకర పరిస్థితి. దీనితో పాపం కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచిన ఎంపీలను, సొంత నియోజకవర్గాల్లో ఒంటరిని చేస్తోంది. ‘‘ఓట్లకు మా డబ్బులు కావాలి గానీ, అవి ఇచ్చిన మేము పనికిరామా’’ అన్నది చాలామంది ఎంపీల ప్రశ్నే అయినప్పటికీ, వాటికి జవాబిచ్చే ఎమ్మెల్యేలే కరవు.
నర్సరావుపేట జిల్లాలో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయల్-మంత్రి రజనీకి మూడేళ్ల నుంచి అస్సలు పొసగడం లేదు. ఆయనను తన నియోజకవర్గానికి రాకుండా ఆమె కట్టడి చేసింది. తనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ను ఎంపీ ప్రోత్సహిస్తున్నారన్నది రజనీ అనుమానం, ఆగ్రహం కూడా. పాపం ఎంపీని ఆయన పార్లమెంటు పరిథిలో ఒకరో, ఇద్దరో పిలుస్తుంటారు. దానితో వైరాగ్యం
వచ్చిన ఆ యువ ఎంపీ, ఇక నర్సరావుపేట నుంచి పోటీచేయకూడదని నిర్ణయించుకున్నార ని, ఆయన స్థానంలో మోదుగుల వేణుగోపాలరెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ. నిజం ‘జగన్నాధుడి’కెరుక? ఇక ఒంగోలు ఎంపీ మాగుంట, నెల్లూరు ఎంపీ ఆదాల కూడా వారి
నియోజకవర్గాల్లో అతిథి పాత్రధారులే. మంత్రులు-ఎమ్మెల్యేలు దగ్గరకు రానీయరు. ఇలా చెప్పుకుంటూపోతే ఎంపీల కన్నీటి కష్టాలు, గోదావరిని కూడా మించిపోతాయి. వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి లాంటి కొంతమందికి తప్ప, అందరికీ ఇవే సినిమా కష్టాలట.
ఇప్పుడు ఆ జాబితాలో సీఎం జగనన్నకు ఇష్టుడైన బందరు ఎంపీ బాలశౌరి కూడా ఉండటమే హాశ్చర్యం. సాత్వికంగా కనిపించే మాజీ మంత్రి పేర్ని నాని, ఫాఫం బౌలశౌరి బాబాయ్‌ను తెగ వేధిస్తున్నారట. దాంతో అంతా ‘వార్నీ.. పేర్ని కూడానా’ అనుకుంటున్నారట. తన పార్టీ అధినేతపై తిరుగుబాటు చేసి, రోజూ
ఏడిపించుకుతింటున్న ‘ప్రియమైన శత్రువు’ రఘురామకృష్ణంరాజు స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని ఊడగొట్టేందుకు, పాపం బౌలశౌరి పడని కష్టం లేదు. తిరగని చాంబర్లు లేవు. సరే ఎలాగోలా రాజును దించి, జగనన్న పెదవులపై చిరునవ్వులు పూయించిన బాలశౌరికి, ఫాఫం ఇప్పుడు ఆ చిరునవ్వే కరవయిందట. కారణం పేర్ని పెత్తనమే.
‘బాలశౌరి బందరు రావద్దంటూ’ పేర్ని అనుచరులు చేసిన ర్యాలీ, ఎంపీ బాలశౌరికి ఎక్కడో కాలింది. పైగా తన చేతిలో ఓడిన టీడీపీ మాజీ ఎంపీ నారాయణతో , పేర్ని చెట్టపట్టాలేసుకుని తిరగడం కూడా ఎంపీకి సుతరాయించడం లేదు. దానితో ‘ పేర్ని సంగతి తేల్చేస్తా. నన్ను బందరు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇకపై బందరులోనే ఉంటా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా. నా ప్రొటోకాల్ నాకుంది. బందరు నీ అడ్డా కాదు. తాటాకు చప్పుళ్లు, ఉడతూపులకు భయపడేది లేదు. మూడేళ్లలో ఎంపీనైన నన్ను ఒక్కసారైనా పిలిచావా? నువ్వు ఎన్ని అభివృద్ధి పనులకు అడ్డుపడ్డావో బందరు జనాలకు తెలుసు’ అని పేర్నిని కడిగేశారు.
నిజానికి ఏపీలో చాలామంది వైసీపీ ఎంపీలది ఇదే గోస. కాకపోతే వాళ్లెవరూ పెదవి విప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. బాలశౌరి చేశారు. అంతే తేడా. మిగిలినదంతా ‘షేమ్’ టు ‘షేమ్’. ఇది ఇప్పటి కథ. ఇక బాలశౌరి వారందరికీ ఓ దారి చూపారు కాబట్టి, మిగిలిన ‘అవమానస్తులైన’ ఎంపీలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారేమో చూడాలి. అసలు తమ అవమానపర్వం గురించి ఎంపీలు ఎప్పుడో జగనన్న దగ్గర వెళ్లబోసుకుని, కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే వారిని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన జగనన్న కూడా.. ‘మీరు ఎమ్మెల్యేల జోలికి వెళ్లకుండా, మీ పని మీరు చేసుకోండి. నా తొలి ప్రాధాన్యం ఎమ్మెల్యేలకే’ అని చెప్పడంతో, ఇంటికొచ్చి తలుపేసుకుని విలపించారట.