Suryaa.co.in

Editorial

‘విలీన’మస్తు!

– కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి వేళాయె
– రాహుల్‌తో భేటీతో ఖాయమైన విలీనం
– ఫలించిన డికె, కెవిపి రాయబారం
– షర్మిల కష్టమంతా విలీన వ్యూహమేనా?
– తన ప్రాధాన్యం చాటుకునేందుకే పాదయాత్ర చేశారా?
– ఆర్ధిక సమస్యలే షర్మిల పార్టీ విలీనానికి కారణమా?
– కాసు నుంచి షర్మిల వరకూ కాంగ్రెస్‌లో విలీన పార్టీలు
– విలీన వీరుల్లో కాసు, చెన్నారెడ్డి, చిరంజీవి, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌, ఆలె నరేంద్ర
– తాజాగా రెండు తెలంగాణ పార్టీలూ విలీనమైన వైనం
– పార్టీలను మూసేసిన నాదెండ్ల, లక్ష్మీపార్వతి, హరికృష్ణ, కాసాని
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల ముందు విలీన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాము పెంచి పెద్ద చే సిన పార్టీలను ఆయా పార్టీల అధినేతలు, ఒక శుభముహుర్తంలో పెద్ద పార్టీల్లో విలీనం చేసి.. భారం దింపేసుకుంటున్న చరిత్ర చూస్తున్నదే. కొద్ది సంవత్సరాలు, మరికొద్దినెలలు సొంత పార్టీలతో హడావిడి చేసి, తర్వాత పక్క పార్టీలతో ముచ్చట్లాడి, వాటిలో విలీనమవుతున్న దృశ్యాలు ఎప్పటినుంచో చూస్తున్నవే.

ఉన్న దుకాణాలు మూసేసి, కొత్త దుకాణాల్లో చేరే ముందు కండువా కప్పేసుకున్న ఘటనతో.. అప్పటివరకూ వారికున్న వ్యక్తిగత ప్రాధాన్యం, కొండెక్కినట్లే లెక్క. ఇప్పుడు వైఎస్సార్‌టీపీ అధినేత్రి, దివంగత వైఎస్‌ ముద్దుల తనయ, వైఎస్‌ షర్మిల కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, తన జెండా పీకేసేందుకు సిద్ధమవుతున్నారు. తాను పుట్టించిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే శుభముహుర్తం కోసం, ఆమె ఢిల్లీ పెద్దలతో మంతనాలు మొదలెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ యువరాజు రాహుల్‌తో భేటీ తర్వాత, షర్మిల ‘హస్త’వారి కానున్నారు.

కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ నుంచి.. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టత వచ్చిన వెంటనే, షర్మిలక్క కాంగ్రెస్‌ కండువా కప్పేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మేరకు ఇప్పటికే మాటముచ్చట కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌, మాజీ ఎంపి కెవిపి రామచందర్‌రావు మధ్యవర్తులుగా.. విలీన కథను సుఖాంతం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

అయితే షర్మిల కాంగ్రెస్‌ వైపు వేస్తున్న అడుగులు, వ్యూహాత్మకమా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ముందుగా తెలంగాణలో తన ప్రాధాన్యం పెంచుకునేందుకే, ఆమె పాదయాత్ర చేసినట్లు కనిపిస్తోంది. సాధారణ నాయకులకు కాంగ్రెస్‌ నాయకత్వం అంత ప్రాధాన్యం ఇవ్వదన్న ముందుచూపుతోనే, షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసినట్లు కనిపిస్తోంది.

ఆ క్రమంలోనే కేసీఆర్‌ సర్కారుపై యుద్ధం చేస్తున్న షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రముఖురాలిగా మారారు. ఆ తర్వాత కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడం కూడా, షర్మిలకు కలసివచ్చినట్లయింది. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌తో, షర్మిల భేటీ కావడంతో ఆమె కాంగ్రెస్‌లో చేరికకు బీజం పడినట్లయింది. వైఎస్‌ బెంగళూరు వెళ్లినప్పుడల్లా, డికె శివకుమార్‌ ఫాంహౌస్‌లోనే ఉండేవారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

అటు వైఎస్‌ ఆత్మ కెవిపి కూడా, షర్మిలతో రాయబారం నడపటంతో కథ ఢిల్లీకి చేరింది. ఇప్పుడు నేరుగా యువనేత రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ కావడంతో, ఇక వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం లాంఛనంగానే కనిపిస్తోంది. ముందుగా పార్టీలో తన పాత్ర, పదవి, ప్రాధాన్యంపై ఆమె స్పష్టత తీసుకోనున్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ సహా పలువురు సీనియర్లు, ఆమెకు తెలంగాణకు బదులు.. ఏపీ బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీకి ఎక్కువ లాభమని వాదిస్తున్నారు.

నిజానికి షర్మిల తన పార్టీని విలీనం చేయడానికి, ఆర్ధిక సమస్యలు కూడా ఒక ప్రధాన కారణమని తెలుస్తోంది. పాదయాత్ర, పార్టీ ఆఫీసు నిర్వహణ, జీతాలు చెల్లించడం కష్టంగా మారిందంటున్నారు. షర్మిల తల్లి విజయమ్మ అభ్యర్ధన మేరకు పలువురు వైసీపీ నేతలు, విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ.. ఏపీ సీఎం, అన్న జగన్‌ అందుకు మోకాలడ్డినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం తెలిసిన జగన్‌ సదరు ఎంపీకి క్లాసు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దానితో వైఎస్‌ వల్ల లబ్థిపొందిన బడా కాంట్రాక్టర్లు కూడా ముఖం చాటేసినట్లు చెబుతున్నారు. మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్‌ సర్కారు వరసగా అన్ని కాంట్రాక్టులు కట్టబెట్టడంపై, షర్మిల ఢిల్లీ వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇదేవిధంగా చాలామంది పార్టీ పెట్టి, తర్వాత విలీనం చేసిన వారు కూడా ఇలాంటి ఆర్ధిక సమస్యల కారణంగా.. తమ పార్టీలను పెద్ద పార్టీల్లో విలీనం చేసిన అనుభవాలు, గతంలో చూసినవే. మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 75 లక్షల ఓట్లు, 18 మంది ఎమ్మెల్యేలు వచ్చినా.. ఆయన పార్టీని కొనసాగించలేక, పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చింది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు వైఎస్‌ మంత్రివర్గంలో పదవులతోపాటు, తాను కేంద్రమంత్రి పదవి తీసుకుని, ప్రజారాజ్యం జెండా పీకేశారు.

ఇక హీరోయిన్‌ విజయశాంతి కూడా ‘తల్లితెలంగాణ’ పార్టీని స్థాపించారు. ఆమె కూడా పార్టీని ఎక్కువకాలం నడిపించలేక, టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి, ఎంపి పదవితో సంతృప్తి చెందాల్సి వచ్చింది. దానికంటే ముందు ఆలె నరేంద్ర స్థాపించిన తెలంగాణ సాధన సమితి పరిస్థితి కూడా అంతే. ఆయన కూడా పార్టీని ఎక్కువకాలం నడిపించలేక, తన పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి, కేంద్రమంత్రి పదవితో సంతృప్తి పడ్డారు.

టీడీపీలో నెంబర్‌టూ అయిన దేవేందర్‌ గౌడ్‌ కూడా, తెలంగాణవాదంతో బయటకు వచ్చి ‘నవతెలంగాణ’ స్థాపించారు. ఆయన కూడా పార్టీని ఎక్కువకాలం కొనసాగించడం కష్టమై, పీఆర్పీలో విలీనం చేశారు. చెరకు సుధాకర్‌ స్థాపించిన తెలంగాణ ‘ఇంటిపార్టీ’ని కాంగ్రెస్‌లో విలీనం చేయగా, జిట్టా బాలకృష్ణారెడ్డి స్థాపించిన ‘యువ తెలంగాణ’ పార్టీని బీజేపీలో విలీనం చేసి, ఇటీవలే సస్పెన్షన్‌కు గురయ్యారు.

గతంలో మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కూడా, కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ‘రెడ్డి కాంగ్రెస్‌’ స్థాపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం. తర్వాత కాసు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కూడా.. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజాసమితి స్థాపించి, పార్లమెంటు ఎన్నికల్లో 11మంది ఎంపీలను గెలిపించి, కాంగ్రెస్‌ను ఖంగుతినిపించారు. తర్వాత ఆయన కూడా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

దివంగత ఎన్టీఆర్‌ రెండవ సతీమణి లక్ష్మీపార్వతి ‘ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ’ని, ఆయన కొడుకు నందమూరి హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం పార్టీ’ని, దానికంటే ముందు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు స్థాపించిన ‘ప్రజాస్వామ్య తెలుగుదేశం పారీ’్టని.. ఎక్కువకాలం నడిపించలేక వాటికి మూత వేయాల్సివచ్చింది.

ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా ‘మనపార్టీ’ స్థాపించి, ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టి, తర్వాత పార్టీని మూసేయాల్సి వచ్చింది.

LEAVE A RESPONSE