Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు

– సైకో పాలనలో పోలవరం ఆశలన్నీ అడియాసలు
– విజయనగరం శంఖారావం సభలో పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు

ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్రా అంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విజయనగరంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే వైసిపిని చూసి కాకుండా తనను చూసి ఓటేయాలని కోరుతున్నారు. ఆయన అంతరార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు. స్థానిక ఎమ్మెల్యే స్వామి ఊరినిండా ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, ఏం అభివృద్ధి చేశారని మీకు ఓటువేయాలి?

ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం కానీ ఇటువంటి సిఎంను చూడలేదు, ఎవరికీ రాని బిరుదు ఈ సిఎంకు వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌతులచ్చన్నకు సర్దార్ అనేది ప్రజలు ఇచ్చిన బిరుదు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర బ్రాందీషాపు ఏర్పాటుచేశారు, ప్రజలు తిరగబడే సరికి షాపు ఎత్తివేశారు. ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఆరున్నర లక్షలమంది పిల్లలను బడికి దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

మరోసారి ఈ సిఎంకు అవకాశం ఇస్తే దేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఎపిని నిలబెడతారు. సైకో ముఖ్యమంత్రి పాలనలో పోలవరం ఆశలన్నీ అడియాసలు చేశారు. 11 కేంద్రవిద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి గత ప్రభుత్వంలో భూసేకరణ చేశాం, వాటిలో ఏఒక్కటీ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. స్థానిక సంస్థల నుంచి రాష్ట్రస్థాయి వరకు వైసీపీ ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో లూటీలే కన్పిస్తున్నాయి.

మెడలువంచి ప్రత్యేకహోదా తెస్తానన్న ముఖ్యమంత్రి ఎవరి దగ్గరకువెళ్లి మెడవంచుతున్నాడో ప్రజలు తెలుసుకోవాలి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి సంతకంపెట్టే వ్యక్తి సిఎం కావడం రాష్ట్రప్రజల దౌర్భాగ్యం. యువకుడైన లోకేష్ పాదయాత్రద్వారా ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సమస్యలన్నింటినీ ఆకళింపు చేసుకుని ఏపీ నెం.1గా నిలిపేందుకు కృషిచేస్తారని ఆశిస్తున్నా.

విజయనగరంలో ఇబ్బంది పెట్టకుండా సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉంది. సైకో ప్రభుత్వాన్ని పారదోలి మళ్లీ ఎపికి గత వైభవం తెచ్చేందుకు టిడిపి-జనసేన కార్యకర్తలు కృషి చేయాలి.

ఈ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ : టిడిపి ఇన్చార్జి అదితి గజపతిరాజు
టిడిపి ప్రభుత్వం ఏంచేసింది, వైసిపి ప్రభుత్వం ఏంచేసింది అనే విషయమై బేరీజు వేసుకొని రాబోయే ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకెళ్లాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. స్పోర్ట్స్ స్కూలు తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తే వైసిపి ప్రభుత్వం గాలికొదిలేసింది. మహరాజా ఆసుపత్రిని 300 పడకలుగా అభివృద్ధి చేశాం, గోషా హాస్పటల్ కూడా ఎంతో అభివృద్ధి చేశాం.

వైసిపి ప్రభుత్వ హయాంలో పన్నులు, ధరలు విపరీతంగా పెరిగాయి. టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులకు పథకాలు కట్ చేస్తూ వైసిపి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి రెవిన్యూ యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపనికీ ఆయన వద్దకు రప్పించుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఏ చిన్న పనికావాలన్నా ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని అంటున్నారు.

ఈ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో యువత నిర్వీర్యమై పోతున్నారు. స్కూలు పిల్లలకు కూడా ఈ మత్తుపదార్థాలు అందడం ఆందోళనకరమైన విషయం. విజయనగరంలో ఎమ్మెల్యే నేతృత్వంలో సెటిల్మెంట్లు, భూఆక్రమణలు పెరిగిపోయాయి. దాసినపేట వాటర్ ట్యాంక్ ను గత టిడిపి ప్రభుత్వంతెస్తే దానిని ఓపెన్ చేయడానికి నలుగురు వైసిపి మంత్రులు వచ్చారు. టిడిపి-జనసేన కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఘనవిజయానికి కృషిచేయాలి.

LEAVE A RESPONSE