– యూజ్ లెస్ ఫెలో బాబువి పనికి మాలిన మాటలు
– బైజూస్ తో ఒప్పందం తప్పని ప్రపంచంలో ఏ ఒక్కరితో అయినా చెప్పిస్తావా బాబూ..?
– 35లక్షల మంది పేద విద్యార్థులకు ఉచితంగా బైజూస్ తో అవగాహన కల్పిస్తుంటే పనికిమాలిన విమర్శలా..?
– బైజూస్ అంటే హెరిటేజ్ లో అమ్మే జ్యూస్ కాదు.. మతిభ్రమించి బాబు విమర్శలు
– సామాజిక న్యాయంపై చర్చకు మేం సిద్ధం.. చర్చిద్దాం రా బాబూ…
– ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు బాబు రాజకీయం
– మమ్మీ-డాడీ అనటం కోసమే లోకేష్ ను ఇంగ్లీషు మీడియం చదివించావా?
– మీ కొడుకు, మనవడే ఇంగ్లీషు మీడియం చదువులు చదవాలా బాబూ..?
-మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రాజకీయాల్లో మీ అంత పనికిమాలిన వ్యక్తి ఎవరూ ఉండరు
చంద్రబాబు మాటలన్నీ విన్నాను. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజం. అయితే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పే చంద్రబాబు, నిన్న నా నియోజకవర్గంలో చేసిన విమర్శలు, ఆయన వాడిన భాష దారుణం. ఆయన మాటలు వింటే చంద్రబాబు పూర్తిగా సహనం కోల్పోయినట్లు, ఇక ఆయన పని అయిపోయినట్లు అనిపిస్తోంది. సూటిగా చంద్రబాబుకు ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో మీ అంత పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మీకు అధికారం వెన్నుపోటుతో వచ్చిందా? ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చిందా? అ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అనైతిక పనులు చేశావన్నది పక్కన పెడితే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాష చూస్తే.. మీ పని అయిపోయిందనే చెప్పాలి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం.
బైజూస్ అంటే హెరిటేజ్ లో అమ్మే జ్యూస్ కాదు
మీ మాటల్లో ఒక్కటంటే ఒక్కటైనా బాధ్యతగా మాట్లాడారా? రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశం కానీ ఉందా? విజయనగరం జిల్లా వచ్చి అసలు ఏం మాట్లాడావు? రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే, అది బైజూసో.. జగన్‌మోహన్‌రెడ్డి జూసో.. అంటావా.. ఏమిటా వెటకారం…?. బైజూస్ అంటే హెరిజేట్ లో అమ్మే ఏదైజా జ్యూస్ అనుకుంటున్నావా? లేక హెరిటేజ్ పాలతో చేస్తున్న జ్యూస్ అనుకుంటున్నావా?
– బైజూస్ అనేది 150 మిలియన్ల విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న కంటెంట్ సంస్థ. మీకు దాని గురించి తెలియకపోతే, నీ మనవణ్ని అడుగు చెబుతాడు. ఇంగ్లీష్ బోధన అంటే మమ్మీ – డాడీ అనడం కోసమేనా? మరి మీ అబ్బాయిని అందుకే ఇంగ్లిష్ మీడియమ్‌లో చదివించావా? కేవలం నిన్ను డాడీ అని పిలవడానికేనా? మరి దేని కోసం, ఎందుకోసం మీ కొడుకును విదేశాలకు చదువు కోసం పంపించావు?. అంటే మీ కొడుకు, మనవడు మాత్రమే ఇంగ్లిష్‌లో చదవాలి. వారు మాత్రమే విదేశాలకు వెళ్లాలి. ఆ తర్వాత తిరిగి వచ్చి మీ మాదిరిగా దోచుకు తినాలి. అది మీ ఉద్దేశం.
– నిరుపేదల పిల్లలు, గ్రామీణ విద్యార్థులకు మాత్రం ఇంగ్లిష్ మీడియమ్ చదువులు వద్దు. అదే మీ లక్ష్యం. బైజూస్ ద్వారా ఆ విద్యార్థులు బాగా చదువుకునేలా మంచి కంటెంట్ పెడుతుంటే, దాన్ని కూడా ఎగతాళి చేస్తావా?
– విజయనగరం జిల్లా పర్యటనలో గత 48 గంటల్లో మాట్లాడిన దాంట్లో రాష్ట్రం కోసం, ఆ ప్రాంతం కోసం మాట్లాడిన విషయం ఒక్కటైనా ఉందా..?. వయస్సు, అనుభవం ఉంటేనే సరిపోదు. అవి ఇతరులతో షేర్ చేసుకునేలా ఉండాలి. అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.
– మీకు ధైర్యం ఉంటే చర్చ పెట్టు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో చేసుకున్న ఒప్పందం తప్పు అని, కనీసం ప్రపంచంలో ఒక్కరితో అయినా చెప్పించు. ఒక మేధావితో మాట్లాడించు.. ఆ ఒప్పందం తప్పు అని చెప్పించు.
– 4 నుంచి 8 తరగతుల వరకు చదువుతున్న దాదాపు 35 లక్షల మంది పిల్లలకు బైజూస్ కంటెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కూడా పూర్తి ఉచితంగా. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా, వారికి విద్యాబోధన జరుగుతుండగా, ఇప్పుడు బైజూస్ వారికి ఉచితంగా కంటెంట్ అందిస్తోంది.
-సీఎంగారు ఇటీవలి దావోస్ పర్యటనలో బైజూస్ ఛైర్మన్ ను కలిశారు. అక్కడ ఇరువురి మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో, కేవలం 20 రోజుల్లోనే ఇక్కడకు అందుబాటులోకి వచ్చింది.
బైజూస్ యాప్ ఒక్కటి తీసుకోవాలంటే కనీసం రూ.20 వేలు ఖర్చవుతుంది. అలాంటిది ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుని 35 లక్షల మంది పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తే, ఏమిటా మాటలు?. సిగ్గులేకుండా, “అది బైజూస్ కాదు. జగన్‌మోహన్‌రెడ్డి జూస్” అంటున్నాడు. ఈ మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు.. చంద్రబాబుకు మతి స్థిమితం పోయింది. సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు.
సామాజిక న్యాయంపై చర్చకు రా..
విజయనగరం పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. సామాజిక న్యాయంపై చర్చకు వస్తాడట. రండి. మేము సిద్ధం. సామాజిక న్యాయం గురించి గొప్పగొప్ప మాటలు చెబుతున్నావు.. మరి, విజయనగరం జిల్లాలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చావు? అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి. వైయస్సార్‌సీపీ ద్వారా గెల్చి, రాజీనామా చేయకుండా టీడీపీలో చేరిన బొబ్బిలికి చెందిన సుజయ్‌కృష్ణ రంగారావు. ఆయన ఇంకో రాజు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చావు. మీరా సామాజిక న్యాయం గురించి విజయనగరం జిల్లా వెళ్ళి మాట్లాడేది.?
– మెడికల్ కాలేజీని చంద్రబాబు పెట్టడం ఏంటి? విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉందా? జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ మంజూరు అవడంతో ఇప్పుడు భవనాలు కడుతున్నారు. చంద్రబాబు ఎందుకిన్ని అబద్ధాలు ఆడుతున్నారు? అర్థమైన విషయం ఏంటంటే చంద్రబాబుకు జ్ఞాపకశక్తి పోయింది, సహనం కోల్పోయాడు. అందుకే పనికిమాలిన భాష, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఒక వేలు ఎదుటవాళ్లను చూపిస్తే, మూడువేళ్లు మీవైపు చూపిస్తాయి. ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నాడు.
విశాఖకు బాబు ఏం చేశాడు..?
చంద్రబాబు ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతున్నాడు. 85శాతం పూర్తి అయిన తోటపల్లి ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగతా 15శాతం పనులు పూర్తి చేయమంటే అయిదారు శాతం చేసి చేతులెత్తేసి, ఇవాళ దాని గురించి మా ప్రభుత్వంపై విమర్శలు చేయడమా?. టీడీపీ హయాంలో సుజల స్రవంతి కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. విశాఖలో పరిశ్రమల గురించి బాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏదైనా విశాఖ అభివృద్ధి చెందిందంటే అది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిగారి హయాంలోనే జరిగింది. ఈ విషయం గురించి నేను గర్వంగా చెబుతున్నాను. ఐటీ పార్కు, ఎస్‌ఈజెడ్, ఫార్మాసిటీ విశాఖకు వచ్చిందంటే అది వైయస్సార్ గారి కృషి వల్లే.
– చంద్రబాబు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేయడానికి విశాఖ, విజయనగరం ప్రజలు ఏమైనా గొర్రెలు అనుకుంటున్నాడా? ఆయన చెబితే తలూపి ఆహో ఓహో అనడానికి..? విజయనగరం ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. మేము రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక ఏ స్థాయిలో ఉన్నామో అందరికీ తెలుసు. ప్రజలతో మమేకం అవుతాం కాబట్టే వాళ్లు మమ్మల్ని ఆదరించి, అభిమానిస్తారు. జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా ప్రభుత్వం ఉంది, సత్తిబాబు ఉన్నారనే ధీమాను కల్పించాం.
మీ మాదిరిగా కుక్కలతో కరిపించే సంస్కృతి మాది కాదు
మీమాదిరిగా ఇంటికి వస్తే కుక్కలతో కరిపించే సంస్కృతి మాకు లేదు. కాపలాకు మా ఇంట్లో కుక్కలు ఉండవు. ఇప్పటికైనా చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదు. అత్యంత ప్రతిష్టాత్మక బైజూస్ సంస్థతో ఒప్పందం జరిగితే దానిపై కూడా టీడీపీ నేతల అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో పాటు విద్యా ప్రమాణాలు పెంచడానికి ముఖ్యమంత్రిగారు ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆంగ్ల నైపుణ్యం మెరుగు పరుచుకోవడానికి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీషు మాట్లాడటానికి, రాబోయే రోజుల్లో అమలు చేసే సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదేమీ మన రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టడం లేదే? ఇప్పటికే బైజూస్ యాప్‌లో సుమారు 15కోట్ల మంది రిజిస్ట్రర్ అయ్యారు. దీనిపై కూడా విమర్శలా? ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండబట్టే విలువలు తగ్గిపోతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారం నుంచి దిగిపోయాక మరోమాట మీది. జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో.. ఈరోజు విద్యా ప్రమాణాలు పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.
బాబులా ప్రభుత్వ స్కూళ్ళు మూసివేయలేదు
బడులకు రంగులు వేస్తే విద్య రాదు చంద్రబాబు. విద్యార్థులు చదువుకునేందుకు మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణంతో పాటు విద్యా బోధన కూడా కల్పించాలి. ఆ విషయం మాకు తెలుసు కాబట్టే, నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. మీ మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను మూయించేసి, నారాయణ విద్యా సంస్థలను పెంచి పోషిస్తూ చూసి రాతలు రాయించేసే కార్యక్రమం మేమేమీ చేయలేదే? మీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల శాతం ఎంత ఉండేది అంటే.. 35 శాతం ప్రభుత్వ పాఠశాలలు, 65 శాతం ప్రయివేట్ పాఠశాలల్లో చదివేవారు. ఇది వాస్తవం కాదా?
– జగన్ గారు ఆనాడు ఏం చెప్పాడో అదే చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమంతో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్ల, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 60శాతం మంది విద్యార్థులు చదువుతుంటే 40శాతం మంది ప్రయివేట్ స్కూళ్లలో చదువుతున్నారు. మేమేమీ అవాస్తవాలు చెప్పడం లేదు. గణాంకాలతో సహా చెబుతున్నాం, అనుమానాలు ఉంటే లెక్కలు తీయండి. పదో తరగతిలో 65శాతం ఉత్తీర్ణత వస్తే.. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు, విద్యార్థులు ఇంట్లో నుంచి చదవడం వల్ల కాస్త అలసత్వం, పర్యవేక్షణ లోపం, ఇతర కారణాలతో ఉత్తీర్ణత శాతం తగ్గిందంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారా? మరి గుజరాత్‌లో మనకన్నా తక్కువ ఉత్తీర్ణతాశాతం వచ్చింది కదా దాన్నేమంటారు చంద్రబాబూ? మీ మాదిరిగా ఉత్తుత్తి పరీక్షలు పెట్టి, చూసి రాయించేయమంటావా?
దేశరాజకీయాల్లో పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు
నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. అలాంటి వాళ్లకు సరైన పద్దతుల్లో పరీక్షలు నిర్వహించాలి కానీ, మీది ఎలాగూ బ్యాక్ డోరే. అలాగే వాళ్లను కూడా బ్యాక్ డోర్ ద్వారా పాస్ చేయించాలా? చంద్రబాబు సహనం కోల్పోయి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు. నిన్నా, మొన్న చంద్రబాబు మాటలు, వాడే భాష, హావభావాలు చూశాక ఈ క్యాండెట్ పని అయిపోయిందనుకున్నాను. దేశ రాజకీయాల్లో పనికిమాలిన వాడెవరైనా ఉంటే అది చంద్రబాబే.
– టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ‍్యవస్థలో ఫలానా మార్పులు తీసుకువచ్చాం అని చెప్పే పరిస్థితి లేదు. విద్యాభివృద్ధికి ఇన్ని కార్యక్రమాలు చేశామని, ఉత్తరాంధ్రకు కొత్తగా కాలేజీలు, యూనివర్శిటీలు తీసుకువచ్చాం, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కార్యక్రమాలు చేస్తే వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేశాయని చెబితే అర్థం ఉంటుంది. విద్యా వ్యవస్థకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు ఏమీ చేయలేదు కాబట్టి, అవేవీ లేవు. వైయస్సార్ గారు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళంలో అంబేడ్కర్ యూనివర్శిటీతో పాటు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ లేదా కాలేజీ వచ్చేలా చూశారు. ఇక విజయనగరం జిల్లాలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీని మేము అధికారంలోకి వచ్చాక యూనివర్శిటీగా కన్వర్ట్ చేశాం. అలాగే, ఇంకో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి జగన్ గారు మంజూరు చేశారు. గిరిజన వర్శిటీకి మీ హయాంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దానికోసం మేము ఇప్పుడు స్థలాన్ని కేటాయించడంతో పాటు త్వరలో ప్రారంభించబోతున్నాం. ప్రజలు అమాయకులు అనుకుంటే తప్పు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో చంద్రబాబు లాంటి పనికిమాలినవాడిని చూడలేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనికిమాలిన వాళ్లను భరించాల్సిందే.
ప్రజలతో ఛీ కొట్టబడినోడు బాబు
విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ…
-చంద్రబాబు నాయుడు ఏమైనా రాజకీయాల్లో పుడింగా?. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీ పగ్గాలు తీసుకున్నాడు. వాజ్‌పేయ్, మోదీ కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయినోడు. నా మీద విమర్శలా? స్వశక్తి లేనివాడు చంద్రబాబు.
-ముఖ్యమంత్రికి రాష్ట్రం మొత్తం మీద పెత్తనం ఉంటుంది. ఒక్క ఉత్తరాంధ్ర మీద పెత్తనం ఏంటి? జగన్ మోహన్ రెడ్డిగారు రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు కూడా ముఖ్యమంత్రే. నేను కూడా విజయనగరం జిల్లా వచ్చి చంద్రబాబు ఎవడని అడిగితే? తలెక్కడ పెట్టుకుంటాడు. పైపెచ్చు ప్రతిపక్ష హోదాలో ఉన్న రాజకీయ పార్టీ కాబట్టి ఏమైనా, ఎంత దిగజారుడు మాటలైనా మాట్లాడతామని చంద్రబాబు అంటాడు. ముఖ్యమంత్రికి పెత్తనం లేకపోతే ప్రతిపక్ష నేతకు ఉంటుందా? ప్రజలతో ఛీ కొట్టబడినోడు, 2019 ఎన్నికల నుంచి, ప్రతి ఎన్నికల్లో ప్రజల చేత బాదుడే.. బాదుడు బాదించుకుంటున్నోడికి హక్కు ఉంటుందా?
– రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి, అయిదుకోట్ల మంది ప్రజల సంక్షేమం, విద్యా, ఆరోగ్యం అనేది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చూస్తున్నారు. చంద్రబాబుకు ఏం హక్కు ఉందని ప్రశ్నించడానికి? టెక్నాలజీతో పాటు మనం కూడా ఎప్పటికప్పుడూ మారాలి.