రైతు భరోసా కేంద్రాల పేరుతో రూ.6,300 కోట్ల అవినీతి

* వైసీపీ నిర్వాకంతో రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం
* అన్ని జిల్లాల్లోనూ రైతులను సమస్యలు చుట్టుముడుతున్నాయి
* కోనసీమ, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో క్రాప్ హాలిడే బాధాకరం
* గుంటూరు పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభ దశలో ఉందని, ఈ సమయంలో రైతుల వేదన వినాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి- వారిని అపహాస్యం చేసేలా మాట్లాడడం అత్యంత బాధాకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ అన్నారు. 19వ తేదీన పర్చూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న కౌలు రైతు భరోసా యాత్ర షెడ్యూల్ వివరించేందుకు శనివారం ఉదయం ఆయన గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఎంతో శ్రమించి నలుగురికీ అన్నం పెట్టే రైతన్న క్రాప్ హాలిడే ప్రకటించడం చాలా బాధాకరం. పంటకు విరామం ఇవ్వాలన్న ఆలోచన రైతుకు వచ్చిందంటే పెను ఉత్పాతం తప్పదు. కోనసీమలో సుమారు 50 వేల ఎకరాల్లో ఈ సీజన్లో క్రాప్ హాలిడేను రైతులు ప్రకటించారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం, గోవాడలోనూ 3 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించినట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా కోవూరు లోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రానురాను అగమ్యగోచరం అవుతోంది. దీనిపై దృష్టి సారించి, రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల పేరుతో గ్లోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు.

* దగా చేస్తున్నారు
ఎన్నికల సమయంలో ఒంటరి మహిళలకు 30 సంవత్సరాలకు పింఛను ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ వయసు పరిమితి 50 సంవత్సరాలకు పెంచడం దగా చేయడం కాదా? అర్హతలు ఉండి పింఛను కోసం, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికీ సాయం అందడం లేదు. సుమారు తొమ్మిది నెలలు అయినా వారి దరఖాస్తులను పట్టించుకునే నాథుడు లేరు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించలేని ప్రభుత్వం ఎందుకు గొప్పలు చెప్పుకుంటోంది? కేవలం పింఛన్లు కాదు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల తీరు ఇలాగే ఉంది. కౌలు రైతుల వేదన జనసేన పార్టీకి కనిపిస్తుంది తప్పితే, అధికారంలో ఉన్న నాయకులకు కనిపించకపోవడం దౌర్భాగ్యం. రైతు సంక్షోభాన్ని గుర్తించి, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఆర్థికంగా ఆదుకునేందుకు భారతదేశంలో ముందుకు వచ్చిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన మాత్రమే.

* 80 మందికి సాయం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 కౌలు రైతు కుటుంబాలకు సాయం చేయనున్నాం. క్షేత్ర స్థాయిలో మరింత మంది బాధితులు కనిపిస్తున్నారు. ప్రతి జన సైనికుడు గర్వపడేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు ఏటుకూరు చేరుకొని, అనంతరం చిలకలూరిపేట వస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జాగర్లమూడిలో మూడు కుటుంబాలకు చెక్కులు అందజేసే కార్యక్రమం ఉంటుంది. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ రు పర్చూరు చేరుకొని మిగిలిన బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేస్తారు. కౌలు రైతులు ఎవరు అధైర్య పడకండి. నిబ్బరంగా సాగు చేయండి. సాధారణ రైతులకు అందే సబ్సిడీలు, రాయితీలు, రుణాలు కౌలు రైతులకు కూడా అందేలా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది.

* రూ.6300 కోట్ల అవినీతి
రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు గింజ సరఫరా చేసే దగ్గర్నుంచి మళ్ళీ గింజ కొనుగోలు చేసే దాకా రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. దీని కోసం రూ.6300 కోట్లు కేటాయించారు. భవనాల నిర్మాణాలకు భారీగా నిధులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పరిస్థితిని చూస్తే రైతు భరోసా కేంద్రాలు కేవలం వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. దళారుల కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు దక్కుతున్న భరోసా పూర్తిగా శూన్యం. ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో సేకరించిన డబ్బును ఇలా ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు మాత్రం రకరకాల పన్నుల పేరుతో నడ్డి విరుస్తున్నారు. 6,300 కోట్ల రూపాయల రైతు భరోసా కేంద్రాల అవినీతిని బయట పెడతాం. రైతులకు అందని సేవలపై ఇంత భారీ మొత్తంలో నిధులు ఎందుకు ఖర్చు చేశారో కచ్చితంగా ప్రశ్నిస్తాం. రైతులకు న్యాయంగా దక్కాల్సిన రైతు భరోసా నిధులు సైతం కులాలు, ప్రాంతాలు, పార్టీల వారీగా విభజిస్తూ ఇస్తున్నారు. అక్కడ కూడా రైతులకు సరైన న్యాయం జరగడం లేదు. ప్రతి జిల్లాలోనూ వివిధ అంశాల వారీగా వ్యవసాయ సంక్షోభం చుట్టుముడుతోంది. రైతులు భవిష్యత్తులో సాగు చేస్తామా.. లేదా? అన్న బెంగతో ఉన్నారు.

* యువత అధైర్యపడవద్దు
దేశంలో యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కరోనా సమయంలో ఇది మరింత తీవ్రమైంది. ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు బలంగా తెలపాలి తప్పితే… హింసతో కూడిన నిరసనలు ఉండకూడదు. అగ్నిపథ్ నిరసనల విషయంలో సికింద్రాబాదులో శుక్రవారం జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరం. యువత తొందరపడి ఆవేశాలకు పోయి, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. కచ్చితంగా ప్రభుత్వానికి ఈ నిరసనలు తెలుస్తాయి అని భావిస్తున్నాం. ఇప్పటికే మా నాయకులను సైతం ఈ విషయంలో తొందరపడి ఎలాంటి ప్రకటనలు ఇవ్వద్దని కూడా హెచ్చరించాం. అన్ని రాజకీయ పార్టీలు మళ్లీ సాధారణ స్థితికి పరిస్థితి వచ్చే వరకు ఎలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు ఇవ్వకుండా సంయమనం పాటించాలి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు తగిన సాంత్వన కలిగేలా ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఈ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే విధంగా అడుగులు వేయాలి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.

* జనసేనలో చేరికలు
గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం జనసేన పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా సర్పంచుల ఫోరం కార్యనిర్వాహక కార్యదర్శి ద్రోణాదుల అంకారావు, ఎరుకల కులవృత్తుల సంఘం అధ్యక్షులు కండెల అంజయ్య పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply