చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి: మంత్రి గుడివాడ అమర్నాథ్

261

విజయనగరం : టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఏం ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ముఖ ద్వారం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తు నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గతంలో విశాఖ వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేశారు. సిగ్గు లేకుండా మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారో తెలియడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు అనే కంటే తెలుగుదేశం బాధలే బాధలు అని పేరు పెట్టుకుంటే బాగుండేదని యెద్దేవా చేశారు. చంద్రబాబు తను తన కొడుకు కోసమే తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్ని కష్టాలలో ఉన్నా ప్రజల‌ సంక్షేమమే ముఖ్యమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు భరోసా కల్పించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంతపెంచారో ప్రజలు ఇప్పటికీ మరిచి పోలేదని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని.. అది కలగానె మిగిలిపోద్దని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.