-
తన పాత నియోజకవర్గంలో ప్రత్యర్థుల తవ్వకాలపై మంత్రి సీరియస్
-
ప్రతిష్ఠగా తీసుకున్న మంత్రి
-
మీడియాలో కథనం వెనుక ఆయనేనంటున్న టీడీపీ సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతూ, పార్టీ ప్రతిష్ఠను పలచన చేస్తున్న మైకా గనుల వ్యవహారంలో తన ప్రత్యర్ధులు చక్రం తిప్పడంపై ఓ సీనియర్ మంత్రి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి తమ కుటుంబం చక్రం తిప్పిన ఆ నియోజకవర్గంలో, తన రాజకీయ ప్రత్యర్ధి రంగంలోకి దిగి మైకా గనుల వ్యవహారంలో పెత్తనం చేయడాన్ని, సదరు మంత్రి గారు సహించలేకపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని దశాబ్దాలు తన కుటుంబం రాజకీయంగా చక్రం తిప్పి, తమను మంత్రులను చేసిన ఆ నియోజకవర్గంలో.. త మకు ప్రమేయం లేకుండానే తన రాజకీయ ప్రత్యర్ధి మైకా వ్యాపారాన్ని శాసిస్తుండటాన్ని, ఆ సీనియర్ మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే.. గత ఎన్నికల్లో అందరికంటే ఆయనకే ఎక్కువ నిధులిచ్చిన నెల్లూరు పెద్దారెడ్డితో, నేరుగా ఢీకొనలేక.. సదరు సీనియర్ మంత్రి మౌనంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలుచెబుతున్నాయి.
దానితో తనకు మంత్రి పదవి వచ్చేందుకు సహకరించిన ఓ మీడియా అధిపతికి తన కష్టాల చెప్పుకున్న ఫలితంగానే, మైకాపై కథనం వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు… మైకాలో సూత్రధారులెవరన్నదీ తెలిసిన ఆ మీడియా అధిపతి, ఆ విషయాన్ని తెరమరుగు చేసి.. పాత్రధారుడైన నెల్లూరు బెట్టింగ్ రాజాపై మాత్రమే కథనం రాయడం, మరో ఆసక్తికర అంశమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదొక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలాఉండగా.. జగన్ జమానాలో టన్నుకు 7 వేల రూపాయలు కప్పం కట్టించుకుని, ఎగుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తవ్వకాలు, లైసెన్సులు, ఎగుమతులు రద్దు చేశారు. క్వారీలన్నీ తనకే ఇవ్వాలని, లేకపోతే తాను చెప్పిన ధరకు మైకాను తమకే అమ్మాలని నెల్లూరు బెట్టింగ్ రాజా లక్ష్మణరేఖ విధించడంతో, నెల్లూరు జిల్లాలో మైకా ఎగుమతులు నిలిచిపోయాయి. వీటి వెనుక జిల్లాలో చక్రం తిప్పుతున్న నెల్లూరు పెద్దారెడ్డి ఉన్నారని, ఆయన త్వరలో నిర్మించబోయే ఫ్యాక్టరీ కోసమే బెట్టింగ్ రాజా రంగస్థలం సిద్ధం చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది.
దానితో 60,70 ఏళ్ల నుంచి మైకా వ్యాపారంలో ఉన్న వారి ఆదాయానికి గండిపడింది. ఈ పరిణామాలు ఆ నియోజకవర్గం నుంచే ఎన్నికయి.. నియోజకవర్గ పునర్విభజనలో దానిని కోల్పోయిన ఓ మంత్రి గారికి, ఆగ్రహం తెప్పిస్తున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వ తీరుపై ఆ మంత్రి గారు, అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది పార్టీ వర్గాల సమాచారం.