-
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పక్కన కాలుమీద కాలేసుకుని కూర్చున్న మేయర్ విజయలక్ష్మి
-
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదే. ఎవరికి వారే సుప్రీం. ఎవరికి వారే నాయకులు. అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో, ఎవరు ఎవరినీ లెక్కచేయరు. గాడ్‌ఫాదర్లు ఉన్న నాయకుల సంగతయితే చె ప్పక్కర్లేదు. ఎవరు ఎవరినీ గౌరవించరు. ఈ ఫొటో చూస్తే అదే అర్ధమవుతుంది.
మొన్నీమధ్య హైదరాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్లు, నగర, నియోజకవర్గ నాయకులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రుల క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభలకు జనసమీకరణ, నామినేటెడ్ పదవులపై సమావేశం నిర్వహించారు.
దానికి జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్ధులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నాయకులకు నామినేటెడ్ పదవులిస్తామని, స్థానిక నాయకులంతా ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితోపదేశం చేశారు. ఆ సందర్భంగా నియోజకవర్గ నేతలు తమ ఈతిబాధలు చెప్పుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది.
ఈ కార్యకమ్రానికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన రేవంత్‌రెడ్డి సన్నిహితుడే కాదు. క్యాబినెట్ హోదా ఉన్న వ్యక్తి. అలాంటి హోదా ఉన్న నాయకుడితో భేటీ కోసం, చాలామంది నాయకులు పరితపిస్తుంటారు. ఎలాగూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకులకు సమయం ఇవ్వరు కాబట్టి, వేం నరేందర్‌రెడ్డితో తమ ఈతిబాధలు చెప్పుకుంటే, ఆయన వాటిని రేవంత్‌రెడ్డికి చెప్పి.. వాటినికడతేరుస్తారన్నది వారి నమ్మకం. రేవంత్ దృష్టికి వెళ్లేంత సమస్యలు లేకపోతే కమిషనర్, కలెక్టర్‌తో అయ్యే సమస్యలు, ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే పరిష్కారమవుతాయన్న భరోసా ఉంటుంది. ఇక్కడ వ్యక్తుల స్థాయి ఏమిటన్నది కాదు ముఖ్యం. వారి హోదా ఏమిటన్నదే ప్రధానం.
అయితే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పక్కన, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూర్చున్నారు. ఆమె నగర ప్రధమ మహిళ కాబట్టి, ప్రొటోకాల్ ప్రకారం ఆయన పక్కన కూర్చుని ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఓ వైపు వేం నరేందర్‌రెడ్డి సాదాసీదాగా కూర్చుని ఉంటే, విజయలక్ష్మి మాత్రం దర్జాగా కాలుమీద కాలేసుకుని, ఆయన పక్కనే కూర్చోవడం పార్టీ నేతలను విస్మయపరిచింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సాదాసీదా వ్యక్తిలా కూర్చుంటే, మేయర్ విజయలక్ష్మి మాత్రం.. తన పక్కన ఉన్నది క్యాబినెట్ హోదా ఉన్న వేం నరేందర్‌రెడ్డి అన్న విషయం గుర్తించకుండా, ఆయనకు కనీస మర్యాద ఇవ్వాలని కూడా లేకుండా, కాలుమీద కాలేసుకుని కూర్చోవడం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
వేం నరేందర్‌రెడ్డికి కెవిపి రామచందర్‌రావు స్థాయి ఉందా లేదా? కెవిపి అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందా లేదా? ఆయన స్థాయిలో ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారా? లేదా? ఆయనంత రాజకీయ అనుభవం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే.. నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ సలహాదారు అన్న విషయాన్ని విజయలక్ష్మి మర్చిపోవడమే ఆశ్చర్యం.
నిజానికి వేం నరేందర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి కంటే కాంగ్రెస్‌లో సీనియర్. పైగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే కూడా. రేవంత్‌తోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకుల్లో ఒకరు. అసలు తనకు ఇష్టుడైన నరేందర్‌రెడ్డి కోసమే.. రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జమానాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వేం నరేందర్‌రెడ్డిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని.. నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు నచ్చచెప్పి, ఆయనను అభ్యర్ధిగా బరిలోకి దించారు.
చివరకు నరేందర్‌రెడ్డి కోసమే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, కేసీఆర్ వేసిన ఉచ్చులో చిక్కుకుని జైలుపాలయ్యారు. తెలంగాణలో మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితంలో, అదో మాయని మచ్చ. ఓటుకు నోటు కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. సీఎం కాకముందు కోర్టుకు హాజరయిన ఆయన, సీఎం అయిన తర్వాత కోర్టుకు హాజరుకావడం లేదు.
సరే కాంగ్రెస్‌ను తన చరిష్మాతో గద్దెనెక్కించి సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. తన మిత్రుడైన వేం నరేందర్‌రెడ్డికి ఎలాంటి అనుభవం లేకపోయినా, ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ కేసులో ఉన్న మరో వ్యక్తికి ఢిల్లీలో మరో పదవి ఇప్పించారు. అంత ప్రాధాన్యం ఉన్న వేం నరేందర్‌రెడ్డిని లెక్కచేయకుండా, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మేయర్ విజయలక్ష్మి.. ఆయన పక్కన దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చోవడం, పక్కనే ఉన్న వేం నరేందర్‌రెడ్డి అమాయకంగా ఫోన్ చూసుకునే ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎంత మిత్రుడి కోటాలో ప్రభుత్వ సలహాదారు పదవి దక్కించుకున్నప్పటికీ.. ఆయన క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి స్థాయి వ్యక్తి అని గుర్తించకపోతే ఎలా? ఆని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి మామూలే అన్న విషయం పాపం ఆ నెటిజన్లకే తెలిసినట్లు లేదు.