Suryaa.co.in

Andhra Pradesh

సత్యకుమార్.. ఒళ్ళు దగ్గర పెట్టుకో..

-బీజెపి కార్యదర్శిగా కాకుండా, టీడీపీ కార్యదర్శిలా మాట్లాడుతున్నాడు
-అసలు ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరైనా గుర్తుపడతారా ?
-సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చూశావా
– బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఫైర్

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. సత్య కుమార్ అనే వ్యక్తి అసత్య కుమార్ గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తూ, తద్వారా మరెవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు.

సత్య కుమార్ మాటలు చూస్తుంటే.. అసలు ఆ వ్యక్తి బీజెపికి చెందిన కార్యదర్శిగా కాకుండా, టీడీపీకి చెందిన కార్యదర్శిలా మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాలి. పథకాల్లో అవినీతి అని సిగ్గులేకుండా సత్యదూరమైన మాటలను సత్యకుమార్ మాట్లాడుతున్నాడు. నీ వెనుక ఎవరున్నారు, వారి చరిత్ర ఏమిటో కూడా ప్రజలకు తెలుసు. అసలు ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరైనా గుర్తుపడతారా.. ప్రభుత్వంపైన నాలుగు విమర్శలు చేసి, దులుపుకుని వెళ్ళే సత్యకుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.

బీజెపి పాలిత ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం లేదు. దేశంలో మరెక్కడా లేనివిధంగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ కు, ప్రతి గడపకూ, ప్రతి రైతు కుటుంబానికీ, ప్రతి అక్కచెల్లెమ్మకూ పథకాలు చేరే విధంగా, నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే కామన్ మ్యాన్ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చూశావా సత్యకుమార్..?

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక, సత్య కుమార్ లాంటి వారు చేస్తున్న అసత్య, అసందర్భ పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెబుతారు. టీడీపీ ఎజెండాతో సత్య కుమార్ అసత్యాలను, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రభుత్వంపై బురదచల్లాలని చూస్తున్నాడు. మరొకసారి ఇటువంటి బురదజల్లే మాటలను మాట్లాడితే సత్యకుమార్ కి తగిన శాస్తి జరుగుతుందని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE