Suryaa.co.in

Telangana

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి మంత్రి కిషన్ రెడ్డి సంతాపం

-కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు, ‘రెబల్ స్టార్’గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఉప్పలపాటి కృష్ణంరాజు ఇకలేరని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్న మహనీయుడు కృష్ణంరాజు. నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి వారు.

బీజేపీ పార్టీలో చేరి ఎంపీగా రెండుసార్లు (కాకినాడ, నరసాపురం) గెలిచిన కృష్ణంరాజు నాటి గౌరవ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ సహాయ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కోసం వారితో కలిసి పనిచేసిన సందర్భాలను, వారు చూపించిన ఆప్యాయతను ఎన్నటికీ మరువలేను.

నటుడిగా శ్రీ కృష్ణంరాజు గారు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు 200 సినిమాల్లో తన ప్రతిభను ప్రదర్శించిన ఆయన, విలక్షణ నటుడిగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల వారికున్న బంధాన్ని వీడలేదు. నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో నిబద్ధతో మెలిగిన కృష్ణంరాజు  తెలుగు సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారు.

అలాంటి మంచి మనిషి మరణం బీజేపీ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు, సమాజానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.medium-2022-09-11-56df435b5a

LEAVE A RESPONSE