తాడేపల్లి, సెప్టెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బద్వేల్ ఉప ఎన్నికపై గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ దివంగత వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరిపై ఉన్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని పేర్కొన్నారు. 2019 లో 44 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. అంతకన్నా ఎక్కువ మెజార్టీ డాక్టర్ సుధకు రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని సూచించారు. 2019 లో 77 శాతం ఓటింగ్ జరిగిందని, ఓటింగ్ శాతం కూడా పెరిగేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రోత్సహించాలన్నారు. నాయకులు నెల రోజుల పాటు తమ సమయాన్ని కేటాయించి ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలన్నారు. బద్వేల్ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.