నందిగామ, సెప్టెంబర్ 3: కృష్ణాజిల్లా నందిగామలోని విజయ టాకీస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ కంటి ఆసుపత్రిని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, జాన్ వెస్లీ తదితరులు రిసెప్షన్, ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రిఫ్రెక్షన్ గది, ఆపరేషన్ థియేటర్, వైద్యుల గదులు, ఆప్టికల్స్ ను మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాల గురించి డాక్టర్ సోము శ్రీహర్ష, డాక్టర్ నారాయణలు మంత్రి కొడాలి నానికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నందిగామలో గరుడ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంటి సమస్యలతో వచ్చే వారికి మెరుగైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలని సూచించారు. నందిగామ, పరిసర ప్రాంత ప్రజలు గరుడ కంటి ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటి సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు నేత్ర పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించారన్నారు. నేత్ర సమస్యలకు పరిష్కారం చూపడమే వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదని, చికిత్స లేని కారణంగా కంటి చూపునకు ఎవరూ దూరం కాకూడదని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. మంచి సంకల్పతో రాష్ట్రంలో 60 ఏళ్ళు దాటిన 56.88 లక్షల మంది అవ్వా, తాతలకు కాటరాక్ట్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందు కోసం ప్రభుత్వం 413 బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత పీహెచ్సీ స్థాయి నుండి బోధనాసుపత్రుల వరకు ప్రభుత్వం స్క్రీనింగ్ క్యాంట్లను నిర్వహిస్తుందన్నారు. ఉచితంగా కంటి అద్దాలను కూడా అందజేస్తుందన్నారు. పేద రోగులకు మెరుగైన చికిత్స అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్పోరేట్ స్థాయిలో కంటి సమస్యలకు అందిస్తున్న వైద్యాన్ని పేదప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యులకు బృందాల వారీగా శిక్షణ కూడా ఇప్పించడం జరిగిందన్నారు. దీనివల్ల కాటరాక్ట్ సర్జరీలను మరింత నైపుణ్యంతో చేయడానికి వైద్యులకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణానికి చెందిన వైసీపీ నేత అడపా జగదీష్ (పండు) తదితరులు పాల్గొన్నారు.