Suryaa.co.in

Andhra Pradesh

విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను విస్తృతంగా నిర్వహించండి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– మర్యాదపూర్వకంగా కలిసిన సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులు గుడివాడ, సెప్టెంబర్ 3: విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సాల్వేషన్ ఆర్మీ ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానిని సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ కమాండర్ మేజర్ ఐడీ ఎబినేజర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు డివిజనల్ కమాండర్ గా పనిచేసిన మేజర్ బీ జోసఫ్ లెఫ్టినెంట్ కల్నల్ గా పదోన్నతిపై చెన్నైకు బదిలీ అయ్యారు. విజయవాడలో డివిజనల్ కమాండర్ గా పనిచేస్తున్న ఎబినేజర్ గుడివాడ డివిజనల్ కమాండర్ గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి డివిజనల్ కమాండర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎబినేజర్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాల్వేషన్ ఆర్మీ ద్వారా అందిస్తున్న సేవలను మంత్రి కొడాలి నానికి డివిజనల్ కమాండర్ ఎబినేజర్ వివరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 132 దేశాల్లో విద్య, వైద్యం, సాంఘిక, ఆత్మీయ పరిచర్యలను సాల్వేషన్ ఆర్మీ అందించడం అభినందనీయమన్నారు. గుడివాడ డివిజనల్ పరిధిలో కూడా విస్తృతంగా సమాజ సేవాకార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నాడు, నేడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్మోహనరెడ్డి విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అలాగే సాల్వేషన్ ఆర్మీ కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాల్వేషన్ ఆర్మీ డివిజనల్ సెక్రటరీ కెప్టెన్ టీ శేఖర్, కెప్టెన్ ఎం మల్లిబాబు, లెఫ్టినెంట్ కాంతారావు, మేజర్ పీ శామ్యూల్, మేజర్ డీ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE