Suryaa.co.in

Telangana

పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

– పూర్తి పారదర్శకంగా కొనుగోళ్ల ప్రక్రియ
– కొనుగోలు కేంద్రం వ‌ద్దే రైతుల‌ను ర‌సీదులు ఇవ్వాలి
– రైతు వేదిక‌లో మంత్రి జూప‌ల్లి
– తాలు, తరుగు, తేమ‌ వంటి అంశాల పేరుతో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– నిజామాబాద్ జిల్లాల్లో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలించిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
– సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప‌రిశీలించిన మంత్రి

నిజామాబాద్: రాష్ట్రంలో పండిన ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేస్తామ‌ని, ధాన్యం కొనుగోళ్ల ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌కంగా, లోప ర‌హితంగా జ‌రిపేలా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. డిచ్ ప‌ల్లి మండలంలోపని మెంట్రాజ్ ప‌ల్లి, ఆర్మూర్ మండ‌లం పెర్కిట్ లో మెప్మా ఆద్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ వ‌రి ధాన్యం కొనుగోళు కేంద్రాల‌ను మంత్రి జూప‌ల్లి ప‌రిశీలించారు.

కొనుగోలు ప్ర‌క్రియ‌, తాలు, తరుగు, తేమ వంటి అంశాలపై రైతుల‌తో మాట్లాడారు. ర‌సీదుల పుస్త‌కాన్ని ప‌రిశీలించారు. కొనుగోలు కేంద్రాల వ‌ద్దే ర‌సీదుల‌ను రైతుల‌కు అంద‌జేయాల‌ని, దానికి అనుగుణంగా చెల్లింపులు జ‌ర‌పాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్లు, డైరెక్టర్ల‌ను మంత్రి ఆదేశించారు. రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని, త‌రుగు, తేమ శాతం, రవాణా, కూలీ ఖర్చులలో జవాబుదారీతనం ఉండాలని, రైస్ మిల్ కు వెళ్ళిన త‌ర్వాత తాలు, తరుగు, తేమ వంటి అంశాల పేరుతో కోత విధించ‌వ‌ద్ద‌ని దిశానిర్దేశం చేశారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల‌ని, వచ్చిన ధాన్యాన్ని కొనేందుకు ఒక క్రమ పద్ధతిని అనుసరించడంతోపాటు ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరించాల‌ని సూచించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రైతులకు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గకుండా, వారు ద‌ళారుల బారిన ప‌డి ఇబ్బందులు ప‌డ‌వ‌ద్ద‌నే ఉద్దేశంతో సీయం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసింద‌న్నారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టిందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింద‌ని చెప్పారు.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం త‌రుగు, తేమ శాతం పేరుతో కోత‌లు పెట్టి రైతుల‌ను దోపిడీ చేసింద‌ని తెలిపారు. అలాంటి లోటుపాట్లు పున‌రావృతం కాకుండా ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్ష‌ నాయ‌కులు రాజ‌కీయ ల‌బ్ది కోసం రాద్దాంతం చేస్తున్నార‌ని, వాటిని ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని వెల్ల‌డించారు. స‌న్నాల‌కు బోన‌స్ ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

అనంత‌రం మెంట్రాజ్ ప‌ల్లి రైతు వేదిక‌లో రైతుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అన్న‌దాత‌ల‌తో ముచ్చ‌టించారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన నిర్వ‌హ‌కం వ‌ల్ల రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆద్వానంగా త‌యారైంద‌ని, కొత్తగా తెస్తున్న‌ అప్పుల్లో ఎక్కువగా గత ప్రభుత్వం తెచ్చిన రుణాలకు వడ్డీలు చెల్లించడానికి ఖర్చు అవుతుందని అన్నారు.

అయినా అన్నింటిని అధిగమించి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నామని, ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. సన్నాల‌కురూ. 500 బోనాస్ ఇస్తామని, అర్హులైన వారంద‌రికీ రుణమాఫీ కింద రెండు లక్షలు ఇస్తామని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే డా. భూప‌తిరెడ్డి, ఆర్మూర్ ఎమ్యెల్యే రాకేష్ రెడ్డి, క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, అద‌న‌పు క‌లెక్ట‌ర్ కిర‌ణ్ కుమార్, డీసీఎంస్ చైర్మ‌న్ తారాచంద్ నాయ‌క్, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ముప్ప గంగారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ విన‌య్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ సునీల్ రెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప‌రిశీలించిన మంత్రి

సమగ్ర ఇంటింటి కుటుంబ‌ సర్వేను బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్నామని, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు కాదని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారం మాత్రమే అని గుర్తు చేశారు.

మెంట్రాజ్ ప‌ల్లిలో నిర్వ‌హిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆయ‌న ప‌రిశీలించారు. స‌ర్వేలో పాల్టొన్న ప‌లువురు మ‌హిళ‌లు, వృద్దుల‌తో మంత్రి మాట్లాడారు. యావత్ తెలంగాణలో సమాచారం సేకరించి అసమానతలు తొలగించి అర్హులైన వారంద‌రికీ అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నామన్నామ‌ని వివ‌రించారు.

LEAVE A RESPONSE