– వీడియో సందేశం ద్వారా మంత్రికి విన్నవించిన బాధితురాలు
– క్షేమంగా ఇండియా రప్పించిన మంత్రి సుభాష్
– మంత్రి సుభాష్ కు రుణపడి ఉంటామన్న బాధితకుటుంబం
రామచంద్రపురం: అయ్యా మంత్రి గారు.. ఏజెంట్లు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయాను.. చిన్న ఇంట్లో పని అని చెప్పి.. నాలుగు అంతస్తుల భవనంలో వెట్టి చాకిరీ చేయిస్తూ.. చిత్ర హింసలు పెడుతున్నారు.. కడుపునిండా తిండి కూడా పెట్టట్లేదు.. గుండెలో నొప్పి.. ముక్కు చెవుల ద్వారా రక్తం పడుతుంది.. ఎలాగైనా ఆదుకొని నా కుటుంబంతో చేర్చండి అంటూ..వీడియో మెసేజ్ పెట్టిన గంటా దీప్తి అనే మహిళకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొండంత అండగా నిలిచారు.
గల్ఫ్ లో పని చేస్తున్న ఆ మహిళకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించి, ఇండియాకు రప్పించి తన కుటుంబ సభ్యులకు అప్పగించి తన మానవత్వం చాటుకున్నారు మంత్రి సుభాష్. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితురాలు గంటా దీప్తి, తన భర్త త్రిమూర్తు, కుటుంబ సభ్యులతో మంగళవారం మంత్రి సుభాష్ ను రామచంద్రపురంలో మర్యాదపూర్వంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ దీప్తి కుటుంబo ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం, భర్తకు హృదయ సంబంధిత రోగం, కన్నబిడ్డల అనారోగ్యం కారణంగా పొట్టకూటి కోసం గత అక్టోబర్ నెలలో బెహరాన్ దేశం వెళ్ళింది అని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేది కరా గ్రామానికి చెందిన గంటా దీప్తి కుటుంబ పోషణ నిమిత్తం కేతా శ్రీనివాస్ అనే ఏజెంట్ ద్వారా పని కోసం బెహరాన్ దేశం వెళ్ళింది.
అక్కడ రాజబాబు, హసీనా అనే ఏజెంట్లు ద్వారా ఒక ఇంట్లో పని నిమిత్తం గత అక్టోబర్ 24న వెళ్లగా అక్కడ బారెడు వెట్టి చాకిరీ చేయిస్తూ, తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని మంత్రి సుభాష్ కు సెల్ఫీ వీడియో ద్వారా తన గోడు వెల్ల బుచ్చుకున్నారు. దీప్తి వీడియో సందేశాన్ని చూసి చలించిన మంత్రి సుభాష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మరియు ఏపీ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ, బెహరన్ లో ఉన్న శివకుమార్ వారి సహకారంతో సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులుతో మాట్లాడి గంటా దీప్తిను ఆ ఇంటి నుండి విడిపించి స్వగ్రామానికి క్షేమంగా తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఇటీవల కాలంలో ఏజెంట్ల చేతిలో మోసపోయి కత్తర్, బెహరాన్,దుబాయ్, సౌదీ దేశాలలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పలు ప్రసారమాధ్యమాల్లో చూస్తున్నామన్నారు. గల్ఫ్ పేరుతో బాధితులను మోసం చేసిన ఏజెంట్ల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంటా దీప్తిను బహరాన్ పంపించిన ఏజెంట్ కేతా శ్రీనివాస్ పై సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించిన మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ లకు గల్ఫ్ బాధితురాలు దీప్తి, భర్త త్రిమూర్తులు, కేశవపాడు మాజీ సర్పంచ్ మట్టపర్తి దుర్గాప్రసాద్, రాజేష్, ఆమె కుటుంబ సభ్యులు మంత్రి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సుభాష్ తమ కుటుంబానికి చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేమని తమ ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.