ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడి సముద్రంలో చిక్కుకున్నారని, ఆయనను మీరే రక్షించి ఒడ్డుకు చేర్చాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రజలను కోరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి మహిళలు తమకు ఓటు వేస్తారని అన్నారు. భర్తలు వద్దన్నా వారి భార్యలు మాత్రం తమకు ఓట్లేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శమన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయబోతున్నాయని అన్నారు. దమ్ముంటే.. జగనన్న పథకాలు రద్దు చేసి ఎన్నికలకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. ఈర్నపాడు, మసీదుపురం, అబ్దుల్లాపురంలలో తిరునాళ్లలా జన స్పందన వచ్చిందన్నారు. జగనన్న ఏం చేశాడో మీ ఇళ్లలో అడిగి తెలుసుకోవాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే శిల్పా చెప్పారు.. జగనన్న బాగుంటే తామంతా బాగుంటామని, జగనన్నను మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నానని, ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తానని శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. బుడ్డా వాళ్లు ఒరిజినల్ కాదని, డుప్లికేట్ లు అని, వారు కూడా ఉయ్యాలవాడ నుంచి వలస వచ్చారని అన్నారు. చెట్టు పేరు చెప్పి ఎన్నాళ్లు కాయలు అమ్ముకుంటావ్? అని బుడ్డా రాజాను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షులుగా సీఎం జగన్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే అదే స్థాయిలో మీరు కూడా పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు చక్రపాణిరెడ్డి సూచించారు. బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ పార్టీని ఏమీ అనకుండా తమపై విమర్శలు చేస్తున్నాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.