– రూ.38 లక్షల నగదు, ఆస్తి పత్రాలు తీసుకెళ్లిన మాజీ మంత్రి శంకర్ నారాయణ
– వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కేసులు
– సీఎం చంద్రబాబు నాయుడుకి వైసీపీ బాధితుల మొర
– పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం… సమస్యల పరిష్కారానికి హామీ
– అన్నక్యాంటీన్ కు రూ.1 లక్ష విరాళం అందించిన వృద్ధురాలు బేబీ సరోజిని
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దుర్మార్గాలు, దురాగతాలపై బాధితులు ఒక్కొక్కరు వరుసగా బయటకు వస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలతో తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రికి… తమపై వైసీపీ మూకలు దుర్మార్గంగా ఎలా దాడులు చేసింది, ఆస్తులు ఎలా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారనే దానిని బాధితులు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా, అన్యాయాలు, అక్రమాలపై విచారణకు హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలు తీసుకుని తక్షణ సాయంగా పలువురికి ముఖ్యమంత్రి ఆర్ధిక సాయం అందించారు.
ఎమ్మెల్సీ తలశిల రఘరాంపై ఫిర్యాదు
అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తమ తండ్రిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, నాటి సీఐ రవీంద్ర, ఏసీపీ హనుమంతురావుతో బెదిరించి రూ.10 కోట్ల విలువైన తమ ఆస్తులు రాయించుకున్నారని గొల్లపూడికి చెందిన కారెంపూడి అభిరామ్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తన తండ్రి రవీంద్ర నామినేషన్ వేశారన్న అక్కసుతో లక్ష్యంగా చేసుకుని వేధించి కేసులు పెట్టి 73 రోజులు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర అప్పు తీసుకున్న వారిని తిరిగి ఇవ్వనివ్వకుండా అడ్డుకుని రూ.3.5 కోట్లు నష్టపోయేలా చేశారని, ఆర్థిక ఇబ్బందులతో తన తండ్రి గుండెపోటుతో మృతి చెందారని అభిరామ్ కన్నీటిపర్యంతమయ్యారు. తలశిల రఘురాంపై విచారణ చేయిస్తే ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో బయటకు వస్తాయని చెప్పారు.
శంకర్ నారాయణది అదే దారి
వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ బెదిరించి మరీ తమ ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని సత్యసాయి జిల్లా, పెనుకొండ మండలం, చంద్రగిరి గ్రామానికి చెందిన జి.మధు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా నాటి సీఐ శ్రీహరి, ఎస్ఐ భాషా తిరిగి తమనే బెదిరించారన్నారు. తనను, తన భార్యను నాలుగు రోజుల పాటు స్టేషన్లో ఉంచి తమ ఇంట్లోని రూ.38 లక్షల నగదు, ఇతర ఆస్తి పత్రాలు తీసుకెళ్లారని చెప్పుకున్నారు. తమకు చెందిన కొంత భూమిని ఎస్ఐ, సీఐ అమ్ముకున్నారని, తగిన న్యాయం చేయాలని కోరారు. చంపావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు 2022లో తనపై వైసీపీ నేత మైపాడు ప్రసాద్ దాడి చేశారని, తిరిగి తనపైనే కేసులు పెట్టారని నెల్లిమర్లకు చెందిన పి.సురేష్ వివరించారు.
అన్న క్యాంటీన్‌కు రూ. లక్ష విరాళం
అన్నక్యాంటీన్ కు గొల్లపూడికి చెందిన వృద్ధురాలు యలమంచిలి బేబీ సరోజిని రూ. 1 లక్షను విరాళంగా అందించారు. ఎప్పటి నుంచో పొదుపు చేస్తూ వచ్చిన సొమ్మును అన్నక్యాంటీన్‌కు విరాళంగా ఇచ్చానన్నారు. ఈ సందర్భంగా సరోజినీని సీఎం అభినందించారు.