•ముఖ్యమంత్రి, హెచ్.ఆర్.డి. మంత్రి బాపట్ల మున్సిపల్ హై స్కూల్ కు రాక
•మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్
– రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి
అమరావతి: తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే సారి ఈ నెల ఏడోతేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిథర్ తెలిపారు.
బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు అవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సచివాలయం పబ్లిసిటీ సెల్ లో బుధవారం శశిధర్ పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి లోకేష్ సూచనల మేరకు మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులను పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించే విధంగా ప్రైవేటు పాఠశాలల కంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో నిర్వహించారని, పెద్ద రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా స్టార్ రేటింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో వినూత్నంగా అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. 0-5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని, ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ది అయ్యే విధంగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
మెగా పేరెంట్ – టీచర్ మీట్ లో కార్యక్రమాలు
ఈ నెల ఏడో తేదీన ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నున్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో 35,84, 621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజా ప్రతినిధులు వివిధ పాఠశాలల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మాన వనరుల అభివృద్ది శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు తదితర ప్రజాప్రతినిధులు తమ తమ దగ్గరలో ఉన్న పాఠశాలలో పాల్గొంటారన్నారు.
విద్యార్థుల సృజనాత్మతకు అనుగుణంగా తయారు చేసిన ప్రత్యేక ఆహ్వన పత్రాలతో వీరందరినీ ఆహ్వానించనున్నట్టు తెలిపారు. మంచి ఆహ్లదకరమైన వాతావరణంలో చదువుల పండుగ తరహాలో ఎటు వంటి రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. సాధారణ ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో వినూత్నంగా రూపొందించిన స్నేహపూర్వకమైన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులతో తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల సమగ్రాభివృద్దికి అవసరమైన అన్ని విషయాలను తల్లిదండ్రులకు వివరిస్తూ వారితో వివరణాత్మకమైన చర్యలు జరుపుతారన్నారు.
సమావేశం ప్రారంభంలో తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలను ఉంటాయన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్.ఎం.సి. సభ్యులు, ప్రజాప్రతినిధులతో బహిరంగ సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను చదవడంతో పాటు పాఠశాల మౌలిక వసతులు, విద్యా ఫలితాల ఆధారంగా స్టార్ రేటింగ్ వివరాలను తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ఓపెన్ హౌస్ సెషన్ ను ఉంటుందని తెలిపారు.
ఇప్పటి వరకూ దాదాపు 900 పాఠశాల్లోని విద్యార్థులకు ఆరోగ్య కార్డులను రూపొందించామని, వాటిని కూడా ఈ సందర్బంగా పంపిణీచేయనున్నట్టు ఆయన తెలిపారు. తల్లిదండ్రులకు సైబర్ అవగాహన పై చిన్న సెషన్ కూడా నిర్వహిస్తామని, సమావేశం ముగిసిన తదుపరి కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికీ పాఠశాల ఆవరణలోనే ఆ రోజు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు విజయరామరాజు, సర్వశిక్షా అభియాన్ ఎస్.పి.డి. బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.