Suryaa.co.in

Editorial

మోదీ-జగన్‌ వేదికపై ఎంపీ రాజుకు చోటుందా?

– అరెస్టు అనుమానంతో మోదీ, అమిత్‌షాకి లేఖ రాసిన ఎంపీ రాజు
– రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే కేంద్రహోంశాఖకు రాజు లేఖ
– జగన్‌ ఫ్రాన్స్‌కు వెళితేనే రాజుకు చాన్స్‌
– అల్లూరి సభ వేదిపై రాజుకు స్థానంపై ఉత్కంఠ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్న వేదికపై.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన సొంత పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చోటు ఉంటుందా? ఉండదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ, సీఎం జగన్‌ హాజరుకానున్న నేపథ్యంలో, ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ కార్యక్రమానికి హాజరవుతారా? లేక కేసుల భయంతో దూరంగా ఉండిపోతారా? లేదా అన్న అంశంపై చర్చకు తెరలేచింది. అయితే ఇదంతా జగన్‌ ప్రాన్స్‌ పర్యటనకు కోర్టు అనుమతించే వ్యవహారంపైనే ఆధారపడి ఉండటం విశేషం.

alluri-seetaramarajuజులై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆజాద్‌కీ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. దానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. సహజంగా అయితే ఆ కార్యక్రమానికి, ప్రొటోకాల్‌ ప్రకారం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా హాజరుకావలసి ఉంది. ఆ ప్రకారం శిలాఫలకంపై ప్రధాని, సీఎం మంత్రులతో పాటు ఆయన పేరు కూడా రాయాల్సి ఉంటుంది. అయితే వేదికపై ఎవరు ఉండాలనేది పూర్తిగా ప్రధాని కార్యాలయమే నిర్ణయిస్తుంది.

అయితే, ప్రధాని-సీఎం ఉన్న వేదికను, ఎంపీ రాజు వారితో కలసి పంచుకునే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ రాజుపై వివిధ పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయనపై ఒకేరోజు 8 కేసులు నమోదవగా, అందులో కొన్ని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. వాటిపై కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో, ప్రస్తుతానికి ఆయనపై కొత్తగా ఎలాంటి కేసులు లేవు. అయితే, తాను తన నియోజవర్గానికి వెళితే తనపై కొత్తగా ఎస్సీఎస్టీ కేసులతోపాటు, ఇతర కేసులు కూడా బనాయించేందుకు తన పార్టీకి చెందిన కొందరు కుట్ర చేస్తున్నారంటూ ఎంపీ రాజు అనేక సందర్భాల్లో ఆరోపించారు. అదే విషయాన్ని ఆయన ప్రధాని, కేంద్రహోంశాఖమంత్రి, ఏపీ డీజీపీ, నర్సాపురం ఎస్పీకి లేఖలు కూడా రాశారు.

ఎంపీ రాజును ఆయన పుట్టినరోజున ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరుకు తీసుకువెళ్లినప్పటి నుంచీ ఆయన, జగన్‌ సర్కారుపై ప్రతీకారేచ్ఛతో ఊగిపోతున్నారు. తనను సీఐడీ పోలీసు కొట్టారంటూ ఏపీ హైకోర్టు నుంచి, పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీ వరకూ ఆయన ఫిర్యాదు చేశారు. అది చాలదన్నట్లు ఢిల్లీలో ప్రతిరోజూ రచ్చబండ పేరుతో జగన్‌ సర్కారును ఈటెల్లాంటి మాటలతో బాదేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలను సవాల్‌ చేయడంతోపాటు.. వాటి వెనుక ఉన్న అక్రమాలపై విచారణ జరిపించాలంటూ.. కేంద్రానికి లేఖలు రాస్తు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ విధంగా ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ, జగన్‌ సర్కారుకు శిరోభారంగా పరిణమించారు. అయినప్పటికీ, ఎక్కడ కేసులు బనాయిస్తారేమోనన్న ముందుచూపుతో రాజు తన నియోజకవర్గానికి రాకుండా, ఢిల్లీ-హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

తాజాగా రాజు తన సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతున్నందున, దానికి హాజరుకావడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే తాను వ్యతిరేకిస్తున్న సీఎం జగన్‌ కూడా అదే వేదికపై ఉంటారు. ఆ క్రమంలో ప్రొటోకాల్‌ ప్రకారమే అయినప్పటికీ తాను హాజరయ్యేందుకు భీమవరం వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నెపంతో తనపై కేసులు బనాయించడమో, లేక కొత్త కేసుల పేరుతో అరెస్టు చేస్తుందన్న భయం రాజులో లేకపోలేదు. ఆయన తన ఇబ్బందిని ఏకరువు పెడుతూ ప్రధాని, కేంద్రహోంత్రికి రెండురోజుల క్రితమే లేఖ రాశారు. వేదికపై ఎవరు ఉండాలనేది నిర్ణయించేది ప్రధాని కార్యాలయమే కాబట్టి, నేరుగా ఆయన పీఎంఓకే లేఖ రాసి ముందుచూపు ప్రదర్శించారు.

జగన్‌ ఫ్రాన్స్‌ వెళితేనే రాజుకు చాన్స్‌
కాగా ప్రధాని భీమవరం పర్యటన రోజునే.. సీఎం జగన్‌, ఫ్రాన్స్‌లో చదువుకుంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు ఆయన తన పర్యటనకు అనుమతివ్వాలని కోర్టును అభ్యర్ధించారు. ఇటీవలి దావోస్‌ పర్యటనలకూ కోర్టు అనుమతించినందున, జులై4 ఫ్రాన్స్‌ పర్యటనకూ కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా అదే జరిగితే ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం పర్యటనకు, ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

raghuramakrishnamrajuకాగా, సీఎం జగన్‌-ఎంపీ రఘురామకృష్ణంరాజు చివరిసారిగా.. 2020 జనవరి 3న ఏలూరులో జరిగిన బహిరంగసభ వేదిక పంచుకున్నారు. తర్వాత ఢిల్లీలో కలిసినప్పటికీ, వారిద్దరి చివరి వేదిక మాత్రం ఏలూరే. మళ్లీ అలాంటి అవకాశం జులై4న రానుంది. మరి ఆ వేదికపై ఉండే మోదీ-జగన్‌తో ఎంపీ రాజు కనిపిస్తారో లేదో చూడాలి.

LEAVE A RESPONSE