Suryaa.co.in

National Telangana

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

– నల్లధనం తెచ్చేదెప్పుడు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేది ఎన్నడూ?
– దేశ ప్రజలపై రూ.80 లక్షల కోట్ల అప్పుల భారం
– అంబానీ, ఆధానీల ఆస్తులను పెంచుతున్న మోడీ
– ప్రజలను మోసం చేయడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే..
– పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ అపహాస్యం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా మోడీ చెప్పినట్టుగానే దేశ పరిపాలన సాగాలని, దేశంలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మోడీ ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు.

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శనివారం ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామం నుండి ప్రారంభమై పెద్ద గోపవరం, బంజర, కండ్రిక, తెల్లపాలెం, ఎర్రుపాలెం గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజలనుద్దేశించి భట్టి ప్రసంగించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15లక్షలు జమ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఈ ఎనిమిది ఏండ్లల్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసి వాటిలో ఉన్న ఉద్యోగులను తొలగించారని మండిపడ్డారు.

ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు జమ చేయకపోగా.. రూ. 80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశ ప్రజలపై అప్పుల భారం మోపిండని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల బాగు కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పని చేస్తుందని వివరించారు. దేశంలో ప్రజలపై పన్నుల భారం మోపుతూ వచ్చిన సంపదను ప్రజలకు పంచకుండా అంబానీ, ఆధానీల ఆస్తులను పెంచి పోషించడానికి బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని ధ్వజ మెత్తారు. పేదలపై పన్నుల భారాన్ని మోపి.. కార్పొరేట్లకు, సంపన్నులకు రాయితీలు ఇస్తున్న మోడీ ప్రభుత్వం ఈ దేశానికి అవసరమా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

మోడీ బాటలోనే సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. రాష్ట్రంలో సంపద పెంచుతున్నామని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం రూ. నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందన్నారు. తీసుకు వచ్చిన అప్పులు, పన్నుల ద్వారా వచ్చిన సంపద ప్రజల అందరికీ సమానంగా పంచకుండా అధికారంలో ఉన్న కొంత మంది దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డెకరేషన్ అమలు
వ్యవసాయ సంక్షేమం కోసం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వందకు వందశాతం అమలు చేస్తామని తెలిపారు.
ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరికి ఇప్పుడు ఇస్తున్న మద్దతు ధరకు అదనంగా వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తామని వెల్లడించారు. పత్తి, మిర్చి, పెసర, మినుము ఇతర పంటలకు బోనస్ ఇవ్వడంతో పాటు నకిలీ విత్తానాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, నిందితులు ఎవరైనా వదిలిపెట్టకుండా శిక్షిస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామన్నారు. రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి రూ. 15వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉన్న రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. తెలంగాణలో తిరిగి రైతు రాజ్యం తీసుకొస్తామని వివరించారు.

LEAVE A RESPONSE